100 ‌రోజుల యాక్షన్‌ ‌ప్లాన్‌

  • 29‌న హోమ్‌ ‌శాఖ మంత్రి అమిత్‌ ‌షా..30న  ప్రియాంకా గాంధీ బహిరంగ సభలు 
  • కాంగ్రెస్‌ ‌పార్టీ 5 డిక్లరేషన్‌లు సిద్ధం..
  • 17 పార్లమెంటు, అన్ని శాసన సభ నియోజక వర్గాలో భారీ బహిరంగ సభలకు బీజేపీ సన్నాహాలు
  • రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న రాజకీయ పార్టీలు

ప్రజాతంత్ర బ్యూరో, హైదరాబాద్‌ : ‌రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలకు రాజకీయ పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. సమయం ముంచుకొస్తుండడంతో యాక్షన్‌ ‌ప్లాన్‌ను సిద్ధం చేసుకుంటున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్‌ ‌పార్టీలు వంద రోజుల ప్రణాళికతో జనంలోకి వెళ్ళేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ సందర్భంగా వివిధ అంశాలపై తమ పార్టీ విధానాన్ని విడుదల చేసేందుకు డిక్లరేషన్‌లను సిద్ధం చేస్తున్నారు. కాంగ్రెస్‌ ‌పార్టీ  ప్రధానంగా అయిదు డిక్లరేషన్‌లను ప్రకటించేందుకు ప్రణాళికను సిద్ధంచేస్తున్నది. ఓబిసి, దళిత, గిరిజన, మహిళా, మైనార్టీలపై తమ పార్టీ విధాన ప్రకటనను విడుదల చేసేందుకు సమాయత్తమవుతున్నది. ఇప్పటికే వివిధ అంశాలపైన తమ అభిప్రాయాన్ని ఆ పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే. వాటిల్లో రైతు విధానం,  యువజన విధానం, భూమి విధానంతో పాటు చేయూత పేరున నాలుగు వేల పెన్షన్‌ ‌పథకాన్ని తమ పార్టీ అధికారంలోకి రాగానే అమలు పరుస్తామని ఆ పార్టీ ప్రకటించింది.

ఇక జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరుతున్న సందర్భంగా ఈ నెల 30న కొల్లాపూర్‌లో నిర్వహించే పాలమూరు ప్రచారభేరి సభలో ముఖ్యఅతిధిగా పాల్గొననున్న ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ చేతులమీదుగా మహిళా డిక్లరేషన్‌ను ప్రకటించేందుకు రంగం సిద్ధం చేస్తున్నది. దీని తర్వాత ఆగస్టు 15న ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను, ఆ తర్వాత ఒకదాని వెనుక ఒకటిగా మిగతా డిక్లరేషన్‌లను ప్రకటించే ఏర్పాట్లు చేస్తున్నారు. డిక్లరేషన్‌లను ప్రకటించేముందు వాటిపై అవగాహన ఉన్న వివిధ వర్గాలకు చెందిన మేథావులు, ప్రజల నుండి సలహాలు, సూచనలు తీసుకుని ఆమోదయోగ్యమైన అంశాలను ఈ డిక్లరేషన్‌లో పొందుపర్చాలని నిర్ణయించారు. ముఖ్యంగా బిసీ డిక్లరేషన్‌ ‌విషయంలో బీసీలకు రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీలను చేర్చాలని నిర్ణయించారు.  కాగా వందరోజుల కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రను చేపట్టాలని పార్టీవర్గాలు నిర్ణయించాయి. ఈ బస్సు యాత్రలో సీనియర్‌ ‌నాయకులు, గతంలో అసంతృప్తిగా ఉన్నారనుకుంటున్న వారందరినీ భాగస్వాములను చేసేందుకు సమాయత్తం అవుతుంది.

దీనివల్ల పార్టీలో అభిప్రాయ భేదాలున్నాయన్న అపోహకు ఫుల్‌ ‌స్టాప్‌ ‌పెట్టవొచ్చని పార్టీ నేతలు సంకల్పించారు. ఇదిలా ఉండగా నాయకులంతా చేరికలపై దృష్టిపెట్టాలని నాయకగణం అభిప్రాయపడింది. నియోజకవర్గాల వారీగా పార్టీ బలాబలాలను బేరీజు వేసుకోవడంతోపాటు, వివిధ పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న సీనియర్‌, ‌యువజన నాయకులను కాంగ్రెస్‌లో చేరేవిధంగా ప్రోత్సహించాలని నిర్ణయించింది. అయితే ఈ విషయంలో మాత్రం పార్టీలో విభేదాలు బయటపడ్డాయి. తమ నియోజకవర్గ పరిధిలో చేరికలు జరిగేప్పుడు కనీసం తమకు సమాచారం ఇవ్వడంలేదని, ఆ విషయంలో తమ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలన్న అభిప్రాయాలు వ్యక్తమైనాయి.

తెలంగాణ భారతీయ జనతాపార్టీ కూడా వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను ప్రకటించింది. ఈ వంద రోజులపాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలతో మమేకం అయ్యే విధంగా కార్యక్రమాలను ఆ పార్టీ రూపొందిస్తుంది. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకు రావడమన్న ప్రధాన లక్ష్యంగానే పనిచేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొత్తగా నియామకమైన, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పార్టీ నేతలకు సూచించిన విషయం తెలిసిందే. ప్రణాళికలో భాగంగా ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల పరిధిలో ముఖ్యమైన వారిని స్వయంగా కలిసే కార్యక్రమం కొనసాగుతుంది. ఈ నెల 31 వరకు 30 వేల మందిని కలువాలన్నది ఆ పార్టీ లక్ష్యంగా నిర్ణయించుకుంది. అలాగే రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో టిఫిన్‌ ‌బైటక్‌లను ఇప్పటికే పార్టీ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాతో పాటు అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో  భారీస్థాయిలో బహిరంగ సభలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ సభలకు పార్టీ కేంద్ర నాయకులను ప్రత్యేకంగా ఆహ్వానించాలని నిర్ణయించారు.

ఈ  సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేయడంలో ఏమాత్రం వెనుకాడవొద్దని పార్టీ నేతలకు సూచించ•డమైంది. గత తొమ్మిదేళ్ళలో బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలేవీ నెరవేర్చలేదని, ప్రధానంగా ఎన్నికల మానిఫెస్టో హామీలను అమలు చేయడంలో పూర్తిస్థాయిలో విఫలమైన విషయాన్ని ప్రజలముందు ఉంచే విధంగా నాయకులు, కార్యకర్తలు అన్ని విషయాలపై అవగాహన పెంచుకోవాలని పార్టీ సూచించింది. డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్ల నిర్మాణం, పించను, రేషన్‌కార్డుల జారీ విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ త్వరలో రాష్ట్ర రాజధానిలోని ఇందిరా పార్క్ ‌వద్ద చేపట్టే భారీ ధర్నా  విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులంతా ఐక్యంగా పాల్గొనాలని ఆ పార్టీ నూతన అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తాజాగా పిలుపిచ్చారు. ఈ నెల 30న కాంగ్రెస్‌ అ‌గ్ర నాయకురాలు ప్రియాంకా గాంధీ… అంతకు ఒక రోజు ముందు ఈ నెల 29న ఖమ్మంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ఆ పార్టీ సీనియర్‌ ‌నేత, హోమ్‌ ‌శాఖ మంత్రి అమిత్‌ ‌షా పాల్గొననుండడంతో తెలంగాణలో అప్పుడే ఎన్నికల కళ వొచ్చేసినట్లు కనిపిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *