– ఈనెల 24 నుంచి అమలులోకి
– సుప్రీం తీర్పు తర్వాత ట్రంప్ ప్రకటన
– వాణిజ్య దిగ్బంధం విధిస్తానని హెచ్చరిక
న్యూదిల్లీ, ఫిబ్రవరి 21: ప్రపంచ దేశాలపై అమెరికా విధించిన సుంకాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్ని దేశాలపై 10శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈమేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ సుంకాలు ఈనెల 24 నుంచి అమల్లోకి వస్తాయని, ఇవి 150 రోజులపాటు అమల్లో ఉంటాయని, చట్టపరమైన మరో అధికారాన్ని అమలు చేసే వరకు ఈ కొత్త సుంకం అమల్లో ఉంటుందని వైట్‌హౌస్ వెల్లడించింది. అన్ని దేశాలపై 10 శాతం సుంకాలు విధించేందుకు ఓవల్ ఆఫీస్ నుంచి సంతకం చేయడం తనకు చాలా గౌరవంగా ఉందని ట్రూత్ పోస్ట్‌లో ఆయన పేర్కొన్నారు. వాణిజ్య భాగస్వాములు అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం టారిఫ్‌లు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. భారత్ 10 శాతం టారిఫ్ చెల్లించాలా.. గతంలో ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకానమిక్ పవర్ యాక్ట్(ఐఈఈపీఏ) కింద విధించిన టారిఫ్‌లను భర్తీ చేస్తారా అనే ప్రశ్నకు వైట్‌హౌస్ అధికారి ఈ మేరకు స్పందించారు. ఈ 10 శాతం గ్లోబల్ టారిఫ్ అనేది అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన రక్షణాత్మక వాణిజ్య విధానంలో భాగమని పేర్కొన్నారు. చెల్లింపుల సమతుల్యత లోటును తగ్గించడం, అన్యాయ వాణిజ్య విధానాలను పరిష్కరించే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మరోవైపు రష్యా నుంచి చమురు కొనుగోళ్లను తన అభ్యర్థన మేరకు భారత్ గణనీయంగా తగ్గించిందని, భారత్‌తో తనకు అద్భుతమైన సంబంధం ఉందని ట్రంప్ తెలిపారు. తను విధించిన టారిఫ్‌లను అమెరికా సుప్రీంకోర్టు రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ వైట్‌హౌస్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక భారత్‌తో ట్రేడ్ డీల్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. పరస్పర టారిఫ్‌లను 18 శాతానికి తగ్గించిన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు కొత్త చట్టపరమైన మార్గాల ద్వారా కొనసాగుతాయని సంకేతాలు ఇచ్చారు.
భారత్- పాక్ యుద్ధాన్ని పరిష్కరించా
సుంకాలతో భారత్- పాక్ యుద్ధాన్ని పరిష్కరించినట్లు ట్రంప్ పునరుద్ఘాటించారు. ‘నేను పరిష్కరించిన 8 యుద్ధాల్లో 5 యుద్ధాలను టారిఫ్‌ల ద్వారా ముగించాను. మీకు నచ్చినా, నచ్చకపోయినా నేను 8 యుద్ధాలను ముగించాను. అందులో భారత్-పాకిస్థాన్ వంటి అణు యుద్ధానికి దారితీసే పెద్ద వివాదాలు కూడా ఉన్నాయి. గురువారం జరిగిన పీస్ బోర్డ్ సమావేశంలో పాకిస్థాన్ ప్రధానమంత్రి మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యం చేసుకుపి 3.5 కోట్ల మంది ప్రాణాలు కాపాడారన్నారు. వారు చాలా ప్రమాదకర చర్యలకు సిద్ధమవుతున్నారు అని ట్రంప్ వ్యాఖ్యానించారు. భారత్-పాక్ ఘర్షణ సమయంలో 10 యుద్ధవిమానాలు కూల్చివేసినట్లు ట్రంప్ తెలిపారు. గురువారం 11 విమానాలు కూల్చివేశారని చెప్పిన ఆయన ఇప్పుడు సంఖ్యను 10కి తగ్గించారు. ఇది అణు యుద్ధానికి దారితీసేలా సాగుతోందన్నారు. దానిని టారిఫ్‌ల ద్వారానే ఆపినట్లు చెప్పారు. ‘ఇరు దేశాలకు యుద్ధం చేయాలనుకుంటే చేయండని, కానీ అమెరికాతో వ్యాపారం చేయలేరు అని తేల్చి చెప్పాను. ప్రతి దేశంపై 200 శాతం టారిఫ్ విధిస్తానని హెచ్చరించాను.. దీంతో ఇరు దేశాలు ఫోన్ చేసి విరమణ ఒప్పందానికి వచ్చినట్లు చెప్పాయ’ని ట్రంప్ పేర్కొన్నారు. మరోవైపు తన పన్నుల విధింపు అధికారాన్ని కట్టడి చేస్తూ అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. శ్వేతసౌధంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన న్యాయవ్యవస్థపై ధ్వజమెత్తారు. ఈ తీర్పు దేశానికి తీరని అవమానమని, కొందరు న్యాయమూర్తులకు దేశం కోసం సరైన నిర్ణయం తీసుకునే ధైర్యం లేదని విమర్శించారు. అంతటితో ఆగక ఈ తీర్పు వెనుక విదేశీ ప్రయోజనాలు ఉన్నాయని, న్యాయమూర్తులు బయటి వ్యక్తుల ప్రభావానికి లోనయ్యారని సంచలన ఆరోపణలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు తనను ఆపలేదని స్పష్టం చేశారు. పాత చట్టం కింద వేసిన పన్నులను కోర్టు కొట్టివేస్తే తక్షణమే సెక్షన్ 122 కింద 10 శాతం గ్లోబల్ టారిఫ్ విధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. ‘నేను ఎంత పన్ను వేయాలనుకుంటే అంత వేస్తాను.. పాత చట్టాల కంటే ఇప్పుడు మా దగ్గర ఉన్నవి చాలా శక్తిమంతమైనవి.. అవసరమైతే ఏ దేశంపైనైనా వాణిజ్య దిగ్బంధం విధిస్తా.. ఇతర దేశాల వాణిజ్యాన్ని దెబ్బతీసే అధికారం నాకుంది’ అంటూ తన దూకుడును ప్రదర్శించారు. సుంకాల విధింపు వల్ల అమెరికాలో పరిశ్రమలు కళకళలాడుతున్నాయని ట్రంప్ చెబుతున్నారు. విదేశీ వస్తువుల దిగుమతి ఆగిపోవడంతో అమెరికాలో నిరుద్యోగం తగ్గిందని, స్టాక్ మార్కెట్ 50 వేల మార్కును దాటిందని ట్రంప్ గర్వంగా ప్రకటించారు. కాగా, సుప్రీంకోర్టు తీర్పుతో గతంలో వసూలు చేసిన సుమారు 175 బిలియన్ డాలర్ల పన్ను ఆదాయం ఇప్పుడు అనిశ్చితిలో పడింది. ఆ డబ్బును వెనక్కి ఇవ్వాల్సి ఉంటుందా అన్న ప్రశ్నకు కోర్టు ఆ విషయం గురించి చర్చించలేదు.. దీనిపై మరో ఐదేళ్లపాటు పోరాటం సాగుతుంది అని ఆయన దాటవేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


