ఉచిత ప్రయాణాలతో రూ.10 వేల కోట్ల ఆదా

– 290 కోట్ల ప్రయాణాలు చేసిన మహిళలు
– మహిళలకు అభినందనలు తెలిపిన మంత్రి సీతక్క

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 31: సోనియా, రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గేల ఆలోచనలకనుగుణంగా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. ఆర్టీసీలో మహలక్ష్మి పథకం కింద 290 కోట్ల ఉచిత ప్రయాణాల ద్వారా రూ.10 వేల కోట్ల ప్రయాణ చార్జీల ఆదాపై అభినందన కార్యక్రమం సోమవారం జరిగింది.ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళలకు బస్సు చార్జీలు లేకుండా ప్రయాణించే విధంగా ఆర్టీసీకి రూ.10 వేల కోట్ల నిధులు చెల్లించిన ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు. నయాపైసా ఆర్థిక భారం లేకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా ప్రయాణం చేసే విధంగా తమ ప్రభుత్వం మహిళలకు వెసులుబాటు కల్పించిందని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణాన్ని ఎగతాళి చేసేలా కొందరు నేతలు చిల్లర మాటలు మాట్లాడుతున్నారని, మహిళలను కించపరిచే వారిని ప్రతి మహిళా ఎదిరించాలని పిలుపునిచ్చారు. ఈ పథకాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మహిళలదేనన్నారు. మహిళలకు డబ్బులు ఆదా కావాలి.. ఆత్మ గౌరవంతో బతకాలి.. ఆ విధంగా మహిళలకు ఆత్మగౌరవాన్ని కల్పించింది ఉచిత బస్సు ప్రయాణం అని పేర్కొన్నారు. ఉపాధి పనులు, చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకునే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం వరంగా మారిందన్నారు. ఆడబిడ్డల అభ్యున్నతి కోసం ప్రభుత్వం పని చేస్తోందంటూ బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణాలు కల్పించడంతో రూ.8 వేల కోట్ల పెట్టుబడులతో 4.7 లక్షల సూక్ష్మ పరిశ్రమలు మహిళలు ఏర్పాటు చేశారని తెలిపారు. మహిళా సంఘాల రుణాలకు రూ.1390 కోట్ల వడ్డీలను చెల్లించామని, కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేసేందుకు సంకల్పించామని ఆమె వెల్లడించారు. మహిళ సంతోషంగా ఉంటే రాష్ట్రం సంతోషంగా ఉంటుందన్నారు. తమది బీఆరఎస్ మాదిరి మాయమాటలు చెప్పి మోసం చేసే ప్రభుత్వం కాదన్నారు. ఉచిత బస్సు ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకున్న మహిళలందరికీ అభినందనలు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలన్నింటినీ సద్వినియోగం చేసుకొని మహిళలు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, మహిళా ఐఏఎస్ ఆఫీసర్లు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *