ఆధార్ తదితర వివరాలు సక్రమంగా లేక ఆలస్యం
వారందరికి త్వరలోనే అమలు
ఇంతపెద్ద మొత్తంలో దేశంలో ఎక్కడా మాఫీ జరగలేదు
విపక్షాల విమర్శలు అత్యంత దారుణం
వి•డియా సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 19 : రాష్ట్రంలో జరిగిన రుణమాఫీ..దేశంలో ఇంతవరకు ఎప్పుడూ జరగలేదని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. రైతులను రుణవిముక్తులను చేయాలని తాము సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. సాంకేతిక కారణాల వల్ల కొందరికి రుణమాఫీ జరగలేదని, వారికి కూడా నూటికి నూరు శాతం రుణమాఫీ చేస్తామని మంత్రి హావి• ఇచ్చారు. రాజకీయ దురుద్దేశంతోనే విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నామని మండిపడ్డారు. సోమవారం ఎర్రమంజిల్‌లోని జలసౌధలో ఆయన వి•డియాతో మాట్లాడుతూ…2014 తర్వాత బీజేపీ ఎప్పుడూ రుణమాఫీ గురించి మాట్లాడలేదన్నారు. పదేళ్లుగా అధికారంలో ఉన్న ఆ పార్టీ రైతుల కోసం ఎలాంటి మంచి పనులు చేయలేదని విమర్శించారు. 1.20 లక్షల రైతు ఖాతాలకు ఆధార్ నంబర్లు సరిగా లేవని, అందుకే వారికి రుణమాఫీ జరగలేదని, వాటిని సవరించడానికి పక్రియ మొదలుపెట్టామని, ప్రతి మండలంలో మండల వ్యవసాయాధికారులకు బాధ్యతలు అప్పగించామని, వారు రుణమాఫీ కానీ రైతుల వివరాలను తీసుకొని పోర్టల్‌లో అప్లోడ్ చేస్తే రుణమాఫీ చేస్తామని ఉత్తమ్ తెలిపారు. కొన్ని ఖాతాల్లో వివరాలు సరిగా లేకపోవడం, రేషన్‌కార్డులు లేకపోవడం వల్ల రుణమాఫీ జరగలేదని, మండల వ్యవసాయాధికారులు ఈ సమస్యలను పరిష్కరిస్తారని, అర్హత ఉన్న ప్రతి రైతుకు కచ్చితంగా ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని, ఈ పక్రియ కొనసాగుతూనే ఉంటుందని మంత్రి తెలిపారు.
డిసెంబర్లో రుణమాఫీ చేస్తామని చెప్పి జూలై లోనే రుణమాఫీ మొదలు పెట్టామని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని వారికి త్వరలో రుణమాఫీ చేస్తామన్నారు. లక్షా 20 వేల మంది రైతులు ఆధార్ నంబర్లు తప్పుగా ఇచ్చారని..లక్షా 61 వేల రైతుల ఆధార్ కార్డుల్లో, అకౌంట్స్‌లో పేర్లు తప్పులు ఉన్నాయన్నారు. 4 లక్షల 83 వేల మందికి రేషన్ కార్డుల్లో తప్పులు ఉన్నాయని పేర్కొన్నారు. 8 లక్షల అకౌంట్స్ రెండు లక్షల కంటే ఎక్కువ రుణం తీసుకున్నారని..2 లక్షల కంటే ఎక్కువ ఉన్న వారు పై అమౌంట్ కడితే వెంటనే రుణమాఫీ అవుతుందన్నారు. నాడు బీఆర్ఎస్ రుణమాఫీ టోటల్ ఫెయిల్యూర్ అని..నాడు కేసీఆర్ చేసిన రుణమాఫీ రైతుల బ్యాంకు వడ్డీలకే సరిపోయిందని మంత్రి విమర్శించారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఒక తప్పుడు వాదనతో రైతుల్లో ఆందోళన కలుగజేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్లుగా దేశంలో ఎక్కడా, ఎప్పుడు, ఏ రాష్ట్రం రైతులకు రుణమాఫీ చేయలేదన్నారు. పార్లమెంట్లో వ్యవసాయం గురించి అనేక అంశాలపై మాట్లాడానని.. బీజేపీ రైతు రుణమాఫీ గురించి ఎప్పుడూ మాట్లాడలేదన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని.. రైతుల మేలు కోసం ఒక్క స్టెప్ కూడా బీజేపీ తీసుకోలేదని మండిపడ్డారు. మన్మోహన్ సింగ్ సర్కారు రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేసిందన్నారు.
తాము ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామన్నారు. పంద్రాగస్టు నాటికి రుణమాఫీ చేశామని.. మిగిలిన వారికి కూడా రుణమాఫీ చేస్తామన్నారు. పంట నష్టం జరిగితే రైతులకు బీఆర్ఎస్ ఒక్క పైసా ఇవ్వలేదని.. నాడు అనేక ఆందోళనలు చేశామని మంత్రి తెలిపారు. ఈ పంట నుంచి సన్నాలకు 500 రూపాయల బోనస్ ఇవ్వనున్నామని పేర్కొన్నారు. రైతులకు పంట నష్టపరిహారం తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇస్తున్నామని వెల్లడించారు.బీఆర్ఎస్ రైతులను మోసం చేసిందని. రైతుల జీవితాలను నాశనం చేసిందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు తీసుకున్న రుణం వడ్డీ మొత్తం మేము మాఫీ చేశామన్నారు. గతంలో ప్రజల ఆస్తి ఓఆర్ఆర్ను అమ్మి రుణమాఫీ చేశారని మంత్రి పేర్కొన్నారు. 2018లో రైతు రుణమాఫీలో అనేక ఫిర్యాదులు వస్తే వాటి పరిష్కారం కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన వెల్లడించారు. రైతులను మోసం చేయడం బీఆర్ఎస్కు అలవాటు అని.. అధికారంలో ఉన్నా లేకపోయినా బీఆర్ఎస్కు ఇది అలవాటేనంటూ ధ్వజమెత్తారు. రెండు లక్షల కంటే ఎక్కువగా రుణం ఉన్న వారు వెంటనే పైన డబ్బులు బ్యాంకులకు చెల్లిస్తే రుణమాఫీ అవుతుందన్నారు. మోసపూరిత బీఆర్ఎస్ నేతల మాటలు నమ్మవద్దంటూ వ్యాఖ్యానించారు. రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతామన్నారు. రుణమాఫీ విషయంలో బీజేపీ కుట్రలు చేస్తోందన్నారు. ఈ సారి నుంచి సన్న వడ్లకు రూ. 500 బోనస్ ఇస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందన్నారు. ప్రకృతి విపత్తులతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రి ఉత్తమ్ తెలిపారు.
రుణమాఫీ కాలేదని ఆందోళన చేస్తే అరెస్ట్ చేస్తారా
ప్రజాపాలన అంటూ అప్రజాస్వామిక విధానాలు
ప్రభుత్వ తీరుపై మండిపడ్డ మాజీ మంత్రి హరీష్ రావు
ప్రజాపాలన అంటూ అప్రజాస్వామిక విధానాలు
ప్రభుత్వ తీరుపై మండిపడ్డ మాజీ మంత్రి హరీష్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 19 : రుణ మాఫీ కాలేదన్న రైతులను అరెస్టులు చేస్తారా అని ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలన అని ప్రచారం చేసుకుంటూ అప్రజాస్వామిక విధానాలను కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించడం సిగ్గుచేటని విమర్శించారు. రుణమాఫీ కాలేదని అదిలాబాద్ జిల్లా తలమడుగులో నిరసన తెలియచేస్తున్న రైతులను అరెస్టులు చేయడం హేయమైన చర్య అన్నారు. పోలీసు యాక్ట్ పేరు చెప్పి, జిల్లాలో నిరసనలు, ఆందోళనలు చేయొద్దని పోలీసులు హుకుం జారీ చేయడం హక్కులను కాలరాయడమేనని చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా నిరసన తెలియ చేస్తున్న రైతులను ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారని, అరెస్టులు చేస్తున్నారని వెల్లడించారు. ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరిని బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రైతులు రుణమాఫీ కాకపోవడంతో కలెక్టరేట్లు, వ్యవసాయ కార్యాలయం, బ్యాంకుల చుట్టూ తిరిగి విసిగి వేసారి పోతున్నారని చెప్పారు. ఏం చేయాలో తెలియక చివరకు రోడ్డె•క్కి ఆందోళన చేస్తున్నారని తెలిపారు. అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తున్నదని వెల్లడించారు.
ప్రభుత్వం రైతుల రుణమాఫీ సమస్యకు పరిష్కారం చూపకుండా, పోలీసులను పురమాయించి గొంతెత్తిన వారిని బెదిరించడం, అణగదొక్కే ప్రయత్నం చేయడం దుర్మార్గమని విమర్శించారు. ఒకవైపు రైతుబంధు రాక, మరోవైపు రుణమాఫీ కాక అన్నదాత ఆవేదనలో ఉన్నాడని చెప్పారు. వ్యవసాయ పనులు చేసుకోవాలా లేక రుణమాఫీ కోసం ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేయాలా అంటూ కన్నీరు పెట్టుకుంటున్నారని వెల్లడించారు. ఏకకాలంలో ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఆచరణలో మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యారని ఎద్దేవా చేశారు.
నమ్మి వోటేసినందుకు రైతన్నను నట్టేట ముంచారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ రైతుల పాలిట శాపంగా మారిందన్నారు. ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం ఏనాడూ బాగుపడ్డట్లు చరిత్రలో లేదన్న విషయాన్ని కాంగ్రెస్ పాలకులు మరిచిపోయినట్లున్నారని చెప్పారు. ఇప్పటికైనా కండ్లుతెరిచి రైతులందరికీ రుణమాఫీ చేయాలని, ఆందోళనలో ఉన్న రైతాంగానికి భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని మరోసారి డిమాండ్ చేశారు. అదిలాబాద్ సహా ఇతర జిల్లాల్లో రైతన్నలపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే అరెస్టు చేసిన రైతన్నలకు అండగా బీఆర్ఎస్ పార్టీ కార్యచరణ ప్రకటిస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.





