విశాఖపట్నం, జులై 25 : ఈనెల 17వ తేదీన ఐఐటీ క్యాంపస్ నుంచి బయటకు వెళ్లిన కార్తీక్ అనే విద్యార్థి అదృశ్యం కేసు విషాదాంతమైంది. వారం క్రితం బయటకు వెళ్లిన ఐఐటీ విద్యార్థి కార్తీక్ విశాఖలో ఆత్మహత్య చేసుకున్నాడు. కార్తిక్ స్వస్థలం నల్గొండ జిల్లా మిర్యాలగూడ. ఐఐటీ హైదరాబాద్లో రెండో సంవత్సరం చదువుతున్నాడు.
ఈనెల 17వ తేదీన కార్తీక్ అదృశ్యం కాగా, 19వ తేదీన అతడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పట్నుంచి పలు ప్రాంతాల్లో కార్తీక్ కోసం గాలించగా, ఈ క్రమంలో మంగళవారం ఉదయం అతని మృతదేహం లభించింది. కార్తీక్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆచూకీ విశాఖలో ఉన్నట్లు లభించింది. దాంతో తల్లిదండ్రులను వెంటబెట్టుకుని విశాఖకు తీసుకెళ్లారు. అక్కడ కార్తీక్ శవమై కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.




