సాయంత్రం అనూహ్యంగా భారీ వర్షం
హైదరాబాద్,ప్రజాతంత్ర,జూన్5: హైదరా బాద్ మహానగరంలో ఉన్నట్లుండి వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారిపోయింది. జంటనగరాలలో చాలా ప్రాంతాల్లో మధ్యాహ్నం ఎండవేడి బాగానే ఉండగా, అయితే సాయంత్రం కాగానే ఒక్కసారిగా దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. దీనితో నగరంలోని అనేక చోట్ల ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఇక జంట నగరలలో కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, రాయదుర్గం ఇలా అనేక ప్రాంతాల్లో గాలి ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఇక సిటీ మరో వైపు చూస్తే.. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, పాత బస్తీ, మలక్ పేట, నాంపల్లి, నారాయణగూడ, బషీర్ బాగ్, అబిడ్స్ ప్రాంతాల్లో కూడా ఎడతెరపి కూడిన వర్షం కురుస్తోంది. దింతో నగరంలోని అధికారులు అప్రమత్తయ్యారు. ముఖ్యంగా వాహనదారులు చాలా జాగ్రత్తగా వాహనాలను నడుపుతూ క్షేమంగా ఇంటికి వెళ్లాలని కోరారు. గత రెండు మూడు రోజులుగా ఉదయంపూట వాతావరణం వేడిగా ఉన్న సాయంత్రం అయ్యేసరికి వరసలు కురుస్తున్నాయి. దీనితో నగర ప్రజలు కాస్త ఎండ తీవ్రత నుండి ఉపశమనం పొందుతున్నారు. నైరుతి రుతుపవనాలు చురుకుగా కదలడంతో తెలుగు రాష్టాల్రపై ప్రభావం చూపుతున్నాయి. మూడు రోజుల కిందట నైరుతి రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించాయి. అదేరోజు అటు ఆంధ్రప్రదేశ్ లో పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది.
తెలంగాణలోనూ గత మూడు రోజుల నుంచి ఏదో చోట తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షం కురుస్తోంది. హైదరాబాద్ లో బుధవారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికి బయలుదేరే సమయంలో వాన పడటంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు కొన్ని మార్గాల్లో ఇబ్బంది పడ్డారు. అవిూన్‌పూర్, కిష్టారెడ్డిపేట, కూకట్ పల్లి, లింగంపల్లి, కొండాపూర్, మాదాపూర్, నిజాంపేట తదితర ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. సరూర్ నగర్, సైదాబాద్ లలో వర్షం పడుతోంది. అటు మియాపూర్ నుంచి ఇటు వనస్థలిపురం వరకు సికింద్రాబాద్, హైదరాబాద్ వ్యాప్తంగా మరికొన్ని గంటలపాటు వర్షం కురుస్తుందని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు.
నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఉపరితల ఆవర్తనం దక్షిణ ఆంధప్రదేశ్ దాని పరిసర ప్రాంతాలలో సముద్రమట్టానికి 3.1 నుంచి 4 కిలో విూటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. దీని ప్రభావం, నైరుతి రుతుపవనాల వ్యాప్తితో మరో రెండు, మూడు రోజులు తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వర్ష సూచన ఉన్న జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసి ప్రజల్ని అప్రమత్తం చేశారు. సిద్దిపేట, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, కామారెడ్డి జిల్లాల్లోనూ వర్షం కురిసే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ అంచనా వేశారు. ఈ జిల్లాలతో పాటు మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షం కురవనుంది. జీహెచ్‌ఎంసీ ప్రాంతాల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చే సమయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు.




