హైదరాబాద్‌లో భారీ వర్షం

  • రహదారులు జలమయం
  • ఇంటినుంచి బయటకు రావొద్దని డీఆర్‌ఎఫ్‌ ‌హెచ్చరిక
  • ‘కృష్ణా’ ప్రాజెక్టుల్లోకి చేరుతున్న వరద
  • 55 టీఎంసీలకు చేరిన ఆలమట్టి నీటిమట్టం
  • కాళేశ్వరం వద్ద తగ్గుతున్న గోదావరి
  • లక్ష్మీ బరాజ్‌లో స్వల్పంగా తగ్గిన వరద

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర జూలై24: గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ (‌జీహెచ్‌ఎం‌సీ) పరిధిలో భారీ వర్షం పడుతోంది. నగరంలోని బోరబండ, ఎర్రగడ్డ, సనత్‌ ‌నగర్‌, ‌యూసఫ్‌ ‌గూడ, అమీర్‌పేట్‌, ఎస్సార్‌ ‌నగర్‌, ‌జూబ్లీహిల్స్, ‌బంజారాహిల్స్, ‌ఖైరతాబాద్‌, ‌పంజాగుట్ట ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. మాదాపుర్‌, ‌గచ్చిబౌలి, రాయదుర్గం, కొండాపుర్‌ ‌ప్రాంతాల్లో మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతోంది. రాజేంద్రనగర్‌, అత్తాపూర్‌, ‌గండిపేట, కోఠి, సుల్తాన్‌ ‌బజార్‌, అబిడ్స్, ‌బేగంబజార్‌, ‌నాంపల్లి, బషీర్‌ ‌బాగ్‌, ‌నారాయణగూడ, హిమాయత్‌ ‌నగర్‌, ‌లిబర్టీ, అంబర్పేట్‌, ‌కాచిగూడ, నల్లకుంట విద్యానగర్‌లో భారీ వర్షం కురుస్తోంది. హైదరాబాద్‌-‌విజయవాడ జాతీయ రహదారిపై భారీ వర్షం కారణంగా వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ ‌నిలిచిపోయింది. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో చెట్లు నేలకూలి విద్యుత్‌ ‌సరఫరా నిలిచిపోయింది. నగరంలో కురిసిన భారీ వర్షానికి రహదారులన్నీ జలమయం అయ్యాయి.

చెరువులను తలపించేలా మారిన రోడ్లపై రాకపోకలు సాగించేందుకు నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ ‌నిలిచిపోయింది. నగరంలో భారీ వర్షం నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దని గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ (‌జీహెచ్‌ఎం‌సీ) అధికారులు హెచ్చరించారు. అనవసర ప్రయాణాలు చేయవద్దని డీఆర్‌ఎఫ్‌ ‌బృందాలు హెచ్చరించాయి. అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యల కోసం 040-21111111, 9000113667 నంబర్లను సంప్రదించాలని జీహెచ్‌ఎం‌సీ సూచించింది. కాళేశ్వరం పుష్కరఘాట్‌ ‌వద్ద గోదావరి నది తగ్గుతూ వస్తున్నది. సోమవారం 9.30 మీటర్ల ఎత్తులో 5.11 లక్షల క్యూసెక్కులతో ప్రవహిస్తోంది. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టులోని సరస్వతీ(అన్నారం) బరాజ్‌లో సోమవారం 32 గేట్లు ఎత్తి 75799 క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు.

బరాజ్‌కు పార్వతి బరాజ్‌, ‌మానేరు వాగు నుంచి 94910 క్యూసెక్కుల నీరు వస్తోంది. 10.87 టీఎంసీలకు 6.668 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. లక్ష్మీ బరాజ్‌లో వరద ప్రవాహం స్వల్పంగా తగ్గింది..ఆదివారం 5,49,210 క్యూసెక్కుల ప్రవాహం రాగా, సోమవారం 5,11,480 క్యూసెక్కులకు తగ్గింది. బరాజ్‌లోని 84 గేట్లకు 75 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో దిగువకు విడుదల చేస్తున్నట్లు భారీ నీటిపారుదల శాఖ డీఈఈ సురేశ్‌ ‌తెలిపారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో పాటు రాష్ట్రంలో పడుతున్న వానలతో తెలంగాణలోని పలు ప్రాజెక్టులోకి నీరు చేరుతోంది. ఆలమట్టిలోకి లక్ష క్యూసెక్కులకు పైగా ఇన్‌ ‌ఫ్లో వస్తుండగా..ప్రాజెక్టు నీటి నిల్వ 55 టీఎంసీలకు చేరుకుంది. జూరాలకు భీమా నుంచి వస్తున్న వరదతో ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టానికి చేరింది. ఈసారి కాస్త ఆలస్యమైనా ప్రాజెక్టు నిండుతుందనే నాగార్జునసాగర్‌ ఆయకట్టుదారులు ఆశతో ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు కృష్ణాపరివాహక ప్రాజెక్టుల్లోకి వరద ప్రవాహం మొదలైంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో పాటు రాష్ట్రంలో పడుతున్న వానలతో .. ప్రాజెక్టుల్లోకి వరద చేరుతోంది. ఆలమట్టిలోకి లక్ష క్యూసెక్కులకు పైగా ఇన్‌ ‌ఫ్లో వస్తుండగా.. ప్రాజెక్టు నీటి నిల్వ 55 టీఎంసీలకు చేరువైంది. జూరాలకు భీమా నుంచి వస్తున్న వరదతో ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టానికి చేరింది. జూరాల ఎగువ, దిగువ జల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల్లో కరెంట్‌ ‌తయారీ ప్రారంభించారు. మొత్తం 9 యూనిట్ల ద్వారా ఉత్పత్తి చేస్తున్నట్లు అధికారులు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *