ప్రముఖ టెన్నీస్ క్రీడాకారిణి సానియా మిర్జాను ఇక్కడ నిలిపితే ఎలా ఉంటుందన్న ప్రతిపాదన ఒకటి రావడంతో దానిమీద పార్టీ పెద్దలు సమీక్ష జరుపుతున్నట్లు తెలుస్తున్నది.హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన సానియా మిర్జాను గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా గౌరవించిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అండాసిడర్‌గా కొనసాగిన ఆమెనే హైదరాబాద్ లోకసభ అభ్యర్థినిగా నిలబెడితే గెలుపు ఖాయమని కాంగ్రెస్ భావిస్తున్నది.భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఒక మహిళా అభ్యర్థిని నిలబెట్టడంద్వారా ఎంఐఎంఏతర వోటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే సామాజిక కార్యక్రమాలతో ప్రజల నోళ్ళలో నానుతున్న డాక్టర్ కొంపెల్లి మాధవీలతను పోటీకి నిలిపింది. కాంగ్రెస్ సానియామిర్జాను అభ్యర్థిగా ప్రకటిస్తే మజ్లిస్ పార్టీ మొదటిసారిగా ఇద్దరు మహిళలను ఎదుర్కోవాల్సి వొస్తుంది.
హైదరాబాద్ లోకసభ నియోజకవర్గంపై పట్టు సాధించేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. దశాబ్దాలుగా ఒకే పార్టీ ఇలాఖాగా మారిన ఈ నియోజకర్గాన్ని గెలుచుకునేందుకు ఆయా పార్టీలు ఆచితూచి అభ్యర్దులను ఖరారు చేస్తున్నాయి. ఇప్పటి వరకు బిఆర్‌ఎస్, బిజెపి తమ అభ్యర్ధులను ప్రకటించగా ఇంకా కాంగ్రెస్ సరైన క్యాండిడేట్ కోసం అన్వేషిస్తూనే ఉంది. రాష్ట్రంలోని పదిహేడు లోకసభ స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు తొమ్మిది స్థానాల అభ్యర్ధులను ప్రకటించింది. మిగతా ఎనిమిది స్థానాలకు సంబంధించి దాదాపు ఎంపిక ప్రక్రియ పూర్తి అయినట్లుగానే వార్తలు వొస్తున్నాయి. ఒకటి రెండు రోజుల్లో మిగతా జాబితా ప్రకటించే అవకాశం ఉంది.. అయితే ఇంతవరకు ఆల్ ఇండియా మజ్లీస్`ఇ`ఇత్తెహదుల్ ముస్లిమీన్ (ఏఎంఐఎం) పార్టీ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న అసదుద్దీన్ ఒవైసీని ఎదుర్కునే సత్తా ఉన్న అభ్యర్థిని నిలిపే విషయంలో తర్జనభర్జనలు కొనసాగుతున్నట్లు తెలుస్తున్నది. ఇదిలా ఉంటే అనూహ్యంగా ఒక కొత్త పేరు వెలుగులోకి వొచ్చింది. ప్రముఖ టెన్నీస్ క్రీడాకారిణి సానియా మిర్జాను ఇక్కడ నిలిపితే ఎలా ఉంటుందన్న ప్రతిపాదన ఒకటి రావడంతో దానిమీద పార్టీ పెద్దలు సమీక్ష జరుపుతున్నట్లు తెలుస్తున్నది. అసదుద్దీన్ ఒవైసీని ఎదుర్కోవాలంటే ఆదే సామాజిక వర్గానికి చెందిన వారిని నిలుపాలన్నది ఒకటి కాగా, ప్రపంచ క్రీడాకారిణిగా పేరున్న సానియా మిర్జా అవుతే తప్పకుండా వోటర్లను ఆకట్టుకోగలదని కాంగ్రెస్ భావిస్తున్నది. ప్రముఖ మాజీ క్రికెట్ క్రీడాకారుడు అజారుద్దీన్ చేసిన ఈ ప్రతిపాదనపై కాంగ్రెస్ ఆలోచిస్తున్నది.
కాగా హైదరాబాద్‌లో ఎంఐఎంను ఢీ కొనడం అంత సులభమేమీకాదన్నది రాజకీయ పార్టీలకు తెలియందికాదు. ఎందు కంటే 1984 నుండి 2019 చివరి ఎన్నికల వరకు ఈ నియోజవర్గానికి ఎంఐఎం ప్రాతినిధ్యం వహిస్తూ వొస్తున్నది. 1984 నుండి 1999 వరకు ఆరుసార్లు జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ అధినేత సలావుద్దీన్ ఒవైసీ వరుసగా గెలుస్తూ వొచ్చారు. అలాగే ఆయన తదనంతరం 2004 నుండి 2019 వరకు అంటే నాలుగు సార్లు జరిగిన ఎన్నికల్లో సలావుద్దీన్ ఒవైసీ కుమారుడు అసదుద్దీన్ ఒవైసీ వరుసగా గెలుస్తూ వొచ్చారు. అంటే దాదాపు మూడున్నర దశాబ్దాలుగా ఈ నియోజకవర్గం ఎంఐఎం నాయ కత్వంలోనే కొనసాగుతున్నది. అయితే హైదరాబాద్‌లో ఎంఐఎం కారణంగా ఈ ప్రాంతం ఇతర ప్రాంతాలతో పోలిస్తే అభివృద్ధికి దూరంగా ఉందన్నది ఇతర పార్టీల ఆరోపణ. ప్రధానంగా ఈ విషయంలో బిజెపి తరచు ఆరోపణలు చేస్తూనే ఉంది. ఈ నియోజకవర్గాన్ని హస్తగతం చేసుకునేందుకు చాలాకాలంగా బిజెపి అనేక ప్రయత్నాలు చేసినా లాభం లేకుండా పోయింది. ముఖ్యంగా తెలంగాణపై కాషాయ జండాను ఎగురవేస్తామని చెప్పుకునే బిజిపికి రాష్ట్ర రాజధానికి గుండెకాయవంటి హైదరాబాద్ నియోజకవర్గాన్ని గెలుచుకోవడం అత్యంత ప్రాధాన్య అంశంగా మారింది. అందుకు ఒక మహిళా అభ్యర్థిని నిలబెట్టడంద్వారా ఎంఐఎం ఏతర వోటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే సామాజిక కార్యక్రమాలతో ప్రజల నోళ్ళలో నానుతున్న డాక్టర్ కొంపెల్లి మాధవీలతను పోటీకి నిలిపింది. బలమైన హిందూ భావాన్ని పుణికి పుచ్చుకున్న మాధవీలత హిందూ మత కార్యక్రమాలతోపాటు తమ లోపాముద్ర ఛారిటబుల్ ట్రస్ట్, లతామా ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవలను అందిస్తోంది. పాతబస్తీలోనే పుట్టిపెరిగిన మాధవీలత విరించి హాస్పిటల్ చైర్మన్ గా అనేక మందికి ఉచిత వైద్యసేవలను అందించిన పేరుంది. సైన్స్‌లో పోస్టు గ్రాడ్యుయేట్ అయిన ఈమె ఎన్‌సిసి క్యాండెట్‌గా, గాయనిగా, నాట్యకారిణిగా పలువురి ప్రసంసలను అందుకుంది. అన్నిటికీ మించి ఆధ్యాత్మిక ఉపన్యాసాలతో పలువురిని ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ముస్లిం మహిళలు ఎంతటి నిర్లక్ష్యానికి గురి అవుతున్నారన్నది, వారికి వాక్ స్వాతంత్య్రం లేకపోవడాన్ని ఎత్తి చూపుతూ నారీ శక్తి అస్త్రాన్ని ప్రయోగించే ప్రయత్నం చేస్తున్నది.
2014, 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికలను పరిశీలిస్తే ఎంఐఎం తర్వాత రెండవ స్థానంలో బిజెపినే అధిక వోట్లను సాధించుకుంది. ఇప్పుడు మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో బిజెపిని అక్కడి వోటర్లు ఆదరిస్తారని బిజెపి నమ్మకంగా ఉంది. అయితే ఈ రెండు ఎన్నికల్లో కూడా ఆనాడు అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్ నాల్గవ స్థానానికే పరిమితైన విషయం గమనార్హం. మూడవ స్థానానికే పరిమితమవుతున్న కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో ఇప్పుడు ఆ పార్టీ గట్టిపోటీ ఇచ్చేందుకు సిద్దమవుతున్నది. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన సానియా మిర్జాను గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా గౌరవించిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అండాసిడర్‌గా కొనసాగిన ఆమెనే హైదరాబాద్ లోకసభ అభ్యర్థినిగా నిలబెడితే గెలుపు ఖాయమని కాంగ్రెస్ భావిస్తున్నది. కాగా తమస్థానాన్ని ఎవరూ కబళించలేరని సిట్టింగ్ ఎంపి అసదుద్దీన్‌ఒవైసీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. నాలుగు దశాబ్దాలుగా ప్రజలు తమను ఆదిరిస్తుండగా, తమను ఓడిరచాలనుకున్న వారికి శృంగభంగం అవుతూనే ఉందంటారాయన. తరాలుగా మజ్లీస్ పార్టీకి కంచుకోట అయిన హైదరాబాద్ నుండి తమ పార్టీ ఇప్పుడు దేశ దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేస్తున్నారు. కాగా హైదరాబాద్ నియోజకవర్గం కింద ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరింటిలో ఎంఐఎం ఆధిపత్యం వహిస్తున్నది. ఒక్క గోషామహల్‌్‌లో మాత్రం బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన కూడా ఇటీవల పార్టీపైన అలకపూనడం ఆ పార్టీకి ఇబ్బందికరమైన విషయం. ఇవ్వాళ రేపట్లో కాంగ్రెస్ సానియామిర్జాను అభ్యర్థిగా ప్రకటిస్తే మజ్లిస్ పార్టీ మొదటిసారిగా ఇద్దరు మహిళలను ఎదుర్కోవాల్సి వొస్తుంది.
సీనియర్ జర్నలిస్ట్





