హైదరాబాదులో ఫోరెన్సిక్‌ సెంటర్‌

మంత్రి శ్రీధర్‌ బాబుతో రష్యా ఏసిఈ ల్యాబ్‌ ప్రతినిధుల భేటీ క అన్ని రకాల సహాయ సహకారాలకు మంత్రి హామీ

 

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 23 : తెలంగాణలో మరో అంతర్జాతీయ ప్రతిష్టాత్మక సంస్థ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. డిజిటల్‌ ఫోరెన్సిక్‌ మరియు డేటా రికవరీలో దిగ్గజ కంపెనీ అయిన రష్యాకు చెందిన ఏఈసి ల్యాబ్‌ జూమ్‌ టెక్నాలజీస్‌ కంపెనీతో కలిసి హైదరాబాదులో ఫోరెన్సిక్‌ సెంటర్‌ మరియు మ్యానుఫ్యాక్చరింగ్‌ హబ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం నాడు సచివాలయంలో ఏసీఈ లాబ్‌ సీఓఓ మ్యాక్స్‌ పుతివ్‌ సేవ్‌, జూమ్‌ టెక్నాలజీస్‌ సీఓఓ, ఆ సంస్థల ప్రతినిధులు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖామంత్రి దుద్దిల్ల శ్రీధర్‌ బాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తాము ఏర్పాటు చేయబోతున్న సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ప్రతిపాదనలపై వారు మంత్రికి వివరించారు. ప్రభుత్వపరంగా కావాల్సిన సహాయ సహకారాల గురించి వారు చర్చించారు. 129 దేశాల్లో తమ సంస్థ కార్యకలాపాలు ఉన్నాయని చెప్పారు. సైబర్‌ సెక్యూరిటీ రంగంలో ఆయా దేశాల దర్యాప్తు సంస్థలతో కలిసి పనిచేస్తున్న అనుభవం తమకు ఉందని వివరించారు. డేటా లాస్‌, డిజిటల్‌ ఇన్వెస్టిగేషన్‌ సవాళ్లను అధిగమించడానికి భారతీయ వ్యాపారాలు, బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలు, దర్యాప్తు సంస్థలకు తాము సహకరిస్తామని స్పష్టం చేశారు.

ప్రత్యేకమైన సాంకేతికతతో ఉన్నత స్థాయి నైపుణ్యాలు కలిగిన సాంకేతిక నిపుణులతో ఆయా సంస్థలకు తాము వృత్తిపరమైన శిక్షణ ఇవ్వడంలో నిష్ణాథులమని తెలిపారు. తెలంగాణలో అంతర్జాతీయ దిగ్గజ సంస్థ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి సంష్థ ముందుకు రావడం పట్ల మంత్రి శ్రీధర్‌ బాబు సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరఫున కావాల్సిన తోడ్పాటును అందిస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చారు. తెలంగాణలో ఆ సంస్థ యూనిట్‌ను ఏర్పాటు చేయడాన్ని మంత్రి స్వాగతించారు. ఇక టిబిటన్‌ పార్లమెంట్‌ ఇన్‌ ఎక్సైల్‌ ప్రతినిధులు మంగళవారం నాడు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. టిబెట్‌కు సార్వభౌమాధికారాన్ని కల్పించడానికి భారత ప్రభుత్వం చర్యలు తీసుకునే విధంగా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మంత్రిని కలిసిన వారిలో మాంక్‌ గేశే అతుక్‌ సెతాన్‌, ఎంపీ సెరింగ్‌ యంఘ్చెన్‌, దొండప్‌ తాషి తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *