పొగాకు ఉత్పత్తుల ప్రచారం పైనా నిషేధం
ఏకగ్రీవంగా ఆమోదించిన రాష్ట్ర శాసనసభ
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12 : రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. హుక్కా సెంటర్లపై నిషేధం విధించింది. ఈ మేరకు హుక్కా కేంద్రాలను నిషేదించే సవరణ బిల్లును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరపున మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశ పెట్టగా సభ ఆమోదించింది. ఈ సందర్భంగా బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినందుకు సభకు మంత్రి శ్రీధర్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. మాదకద్రవ్యాల మహమ్మారి నుంచి యువతను కాపాడేం దుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడిరచారు. సిగరెట్ పొగ కంటే హుక్కా మరింత హానికరమని చెప్పారు. యువతకు హుక్కా వ్యసనమయ్యే అవకాశం ఉందన్నారు. హుక్కా అనేది సిగరెట్లతో పోల్చితే వెయ్యి రెట్లు హానికరం. ఒక సిగరెట్‌తో పోల్చితే, ఒక హుక్కా సెషన్‌లో దాదాపు 125 రెట్లు పొగ, 25 రెట్లు తారు , 2.5 రెట్లు నికోటిన్, 10 రెట్లు కార్బన్ మోనాక్సైడ్ విడుదలవుతుంది. ఒక్కసారి హుక్కాకు అలవాటు అయితే..యువత దానికి బానిసలవుతారు. ఈ పోకడ ఇటీవల కాలంలో బాగా పెరిగింది. ఈ క్రమంలోనే తెలంగాణలోని యువత, ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ సర్కార్ హుక్కాను.. హుక్కా సెంటర్లను శాశ్వతంగా బ్యాన్ చేస్తూ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసింది. హుక్కా నిషేధం బిల్లుపై సభలో ఎలాంటి చర్చ లేకుండానే అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. నాలుగో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాక ఈ కీలక బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇక యువత ధూమపానానికి దూరంగా ఉండాలని, ఇందుకు దూమపానం, పొగాకు సంబంధించి ఎలాంటి యాడ్స్‌ను ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించినట్టు చెప్పారు.





