సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 16: ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలులో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని బిజెపి సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు.బుధవారం పార్టీ పిలుపు మేరకు పల్లె బాట-బస్తి బాట కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని పలు వార్డులలో తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ కెసిఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపారు.ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ
..పోరాడి సాధించుకున్న తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబం బాగు పడిందే తప్ప ప్రజలకు మేలు జరగలేదని మండిపడ్డారు.పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తానని చెప్పి తొమ్మిది సంవత్సరాలుగా ప్రజలను మభ్య పెట్టడం బాధాకరమన్నారు.వెంటనే అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ప్రజా సమస్యలే ఎజెండా గా ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తామన్నారు.రైతు బంధు పథకం వల్ల సన్న చిన్న కారు రైతుల కంటే భూస్వాములకే ఎక్కువ లబ్ధి జరుగుతుందన్నారు.కెసిఆర్ అబద్దాల కోరని లక్ష ఉద్యోగాలు భర్తీ చేసి ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి ఊరుకో ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు.దళితులను ముఖ్యమంత్రి చేస్తానని, దళితులకు మూడెకాల భూమి పంపిణీ చేస్తానని ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయలేదని ధ్వజమెత్తారు.నిలువ బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పులమయంగా తయారు చేశాడని, అవినీతిలో తెలంగాణను దేశంలోనే మొదటి స్థానంలో నిలిపారని ఆరోపించారు.రాష్ట్రంలో అమలయ్య పథకాల్లో కేంద్రం వాటే సింహభాగం ఉందని చెప్పారు.తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలంటే బిజెపి గెలుపు చారిత్రాక అవసరమని పేర్కొన్నారు.ప్రజలు ఈసారి భారతీయ జనతా పార్టీకి ఒకసారి అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రజలకు శ్రీకాంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు ఉపేందర్ రావు, పత్రి శ్రీనివాస్, యాదవ్, గోనె మార్కండేయులు, గాడిపల్లి అరుణ రెడ్డి, పద్మ ,సుగుణ, జ్యోతి, యాదన్ రావు, భోగి శ్రీనివాస్, సాయి కిరణ్, అశోక్, వేణు, నరేష్, శేఖర్ క్రాంతి, శోభన్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.




