హస్తినలో రైతన్నల సింహగర్జన

మద్ధతు ధర సహా అపరిషృత డిమాండ్ల కోసం నిరసనలు
ఎక్కడిక్కడ పోలీసుల అరెస్టు…డ్రోన్ల సాయంతో టియర్‌ గ్యాస్‌ ప్రయోగం
పంజాబ్‌-హర్యానా బోర్డర్‌లో యుద్ధ వాతావరణం
నగరాన్ని అష్ట దిగ్బంధనం
మరో సుధీర్ఘ ఉద్యమానికి సిద్ధమయిన రైతులు

(జాజుల దినేష్‌, సామాజిక విశ్లేషకులు): న్యూదిల్లీ, ఫిబ్రవరి 13 : 2020లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏడాదిపాటు రైతులు దిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు చేశారు. అప్పట్లో 3 కీలక వ్యవసాయ బిల్లుల సవరణను కేంద్రం వెనక్కి తీసుకుంది. ఇప్పుడు మళ్లీ ఆందోళనకు రైతులు సిద్ధమయ్యారు. సోమవారం రాత్రి నుంచే దిల్లీకి ట్రాక్టర్లను తరలిస్తున్నారు. దీన్ని, ఛలో దిల్లీ, ఛలో పార్లమెంట్‌ పేర్లతో పిలుపునిచ్చారు..ఉత్తరప్రదేశ్‌, హర్యానా, పంజాబ్‌ రాష్ట్ర రైతు సంఘాలు మంగళవారం ‘మెగా మార్చ్‌’ నిర్వహిం చనున్నారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంతో పాటు తమ ఇతర డిమాండ్లు పరిష్కరించేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు యునైటెడ్‌ కిసాన్‌ మోర్చా (నాన్‌ పొలిటికల్‌), కిసాన్‌ మజ్దూర్‌ మోర్చాతో పాటు మరికొన్ని రైతు సంఘాలు దాదాపు 200కు పైగా రైతు సంఘాలు మంగళవారం ‘చలో దిల్లీకి’ మార్చ్‌ నిర్వహించ తలపెట్టాయి. 2021లో రైతులు తమ ఆందోళనను విరమించుకున్నప్పుడు పెట్టిన షరతుల్లో…తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ పార్లమెంట్‌ ఎదుట నిరసనకు సిద్ధమయ్యాయి. ఇప్పుడు తమ డిమాండ్ల సాధనకు మరోసారి హస్తిన బాట పట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే వివిధ రాష్ట్రాల నుంచి దిల్లీకి మెగా మార్చ్‌ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే రైతుల ఉద్యమాన్ని అణిచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల ముందస్తు చర్యలతో సిద్ధం అయింది.

ఇందులో భాగంగానే మార్చి 12 వ తేదీ వరకు నెల రోజుల పాటు దిల్లీలో 144 సెక్షన్‌ విధిస్తూ సోమవారం దిల్లీ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. దిల్లీలోకి రైతులు ప్రవేశించకుండా కొన్ని ప్రాంతాల్లో సరిహద్దులను మూసివేసింది. ఇక మరికొన్ని సరిహద్దుల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి భారీగా భద్రతా బలగాలను రంగంలోకి దింపింది. శాంతి, భద్రతల సమస్య తలెత్తవచ్చన్న ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని దిల్లీ పోలీసులు తెలిపారు,. రైతుల నిరసనల కారణంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశంతో పాటు హింస చెలరేగే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్‌ హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు దిల్లీ పోలీసులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. డిమాండ్ల సాధన కోసం దేశవ్యాప్తంగా రైతులు మరోసారి కదం తొక్కేందుకు సిద్ధం అయ్యారు. ఈ క్రమంలోనే నేడు దేశ రాజధాని చలో దిల్లీకి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే అసలు రైతులు ఎందుకు ఆందోళన చేస్తున్నారు, రైతుల డిమాండ్లలో మరికొన్ని ఉన్నాయి. 2020-21లో తమపై పెట్టిన కేసుల్ని తొలగించాలనీ, లఖింపూర్‌ ఖేరీ ఘటనలో బాధితులకు న్యాయం చెయ్యాలనీ, 2023 ఎలక్ట్రిసిటీ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలనీ, ఎంఎస్‌పిపై స్వామినాథన్‌ కమిషన్‌ రిపోర్టును అమలు చెయ్యాలనీ, దేశవ్యాప్తంగా రైతులు, రైతు కూలీల రుణాలను మాఫీ చెయ్యాలనీ, ప్రపంచ వాణిజ్య సంస్థ నుంచి భారత్‌ తొలగాలనీ, వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులపై ఇంపోర్ట్‌ డ్యూటీ తగ్గించడం మానుకోవాలనీ, ఇంపోర్ట్‌ డ్యూటీ పెంచి దేశీయ రైతులను కాపాడాలనీ ఇలా చాలా డిమాండ్లను రైతులు వినిపిస్తున్నారు.

అన్నదాతలు ట్రాక్టర్‌ ర్యాలీని 13న మంగళవారం ఉదయం ప్రారంభించారు. పంజాబ్‌ ఫతేగఢ్‌ సాహిబ్‌ నుంచి వేలాది మంది రైతులు ట్రాక్టర్లతో దిల్లీ బయలుదేరారు. కొన్ని  బృందాలుగా  ఇంద్రప్రస్థ దిశగా కదిలింది. దీంతో దేశ రాజధాని సరిహద్దుల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారిపోయింది. వాహనాల రాకపోకలకు అంతరాయం కూడా ఏర్పడిరది. సుదీర్ఘ ఆందోళనకు సిద్ధపడి..అందుకు తగిన ఏర్పాట్లను చేసుకుని వొచ్చినట్టు రైతులు వెల్లడిరచారు. ఆరు నెలలకు సరిపడే సామాగ్రి, వాహనాలకు డీజిల్‌ను తమవెంట తెచ్చుకున్నామని పంజాబ్‌కు చెందిన రైతులు  తెలిపారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా 13 నెలల పాటు ఆందోళన నిర్వహించిన విషయాన్ని గుర్తుచేశారు. తమ సహనానికి పరీక్ష పెట్టినా డిమాండ్లు నెరవేరే వరకు నిరసనను కొనసాగిస్తామని తెలియజేస్తున్నారు. రైతులను అరెస్టుల రూపంలో అరికట్టడం సాధ్యపడదని చెదరగొట్టేందుకు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. డ్రోన్లు సహాయంతో టియర్‌ గ్యాస్‌ను ప్రయోగించడంతో, ఆందోళనకారులు తలోదిక్కు పరుగులు తీశారు. అయినా వెనక్కి తగ్గని అన్నదాతలు…గతంలో నిరసన తెలిపిన రైతులు ప్రభుత్వం ఇచ్చిన హామీలతో విరమించారు. అసలు ఆ హామీల అమలు ఎక్కడి వరకు వొచ్చింది. మరి నేటి రైతుల ఆందోళనలపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

మరో సుధీర్ఘ ఉద్యమానికి సిద్ధమయిన రైతులు
అపరిష్కృతంగా ఉన్న తమ డిమాండ్లను నెరవేర్చుకునే లక్ష్యంతో గతంలో మాదిరి మరో సుధీర్ఘ ఉద్యమానికి రైతులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం చలో దిల్లీకి రైతు సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో మంగళవారం ఉదయం వేలాదిగా మంది అన్నదాతలు ట్రాక్టర్లతో సహా నగరానికి బయలుదేరారు. ఒక్క పంజాబ్‌ నుంచే వందలాదిగా ట్రాక్టర్లు బయలుదేరినట్లు తెలుస్తున్నది. ఈ సందర్భంగా కొంతమంది రైతులు మీడియాతో మాట్లాడుతూ…కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చే వరకు ఎన్ని రోజులైనా నిరసన కొనసాగిస్తామని తెలిపారు. ఆరు నెలలకు సరిపడా రేషన్‌, డీజిల్‌తో తాము తమ ప్రాంతాల నుంచి బయలుదేరామని వారు తెలిపారు. ప్రభుత్వం, పోలీసులు ఎన్ని నిర్బంధాలు విధించినా తాము వెనుకకు పోయేది లేదని, తమ డిమాండ్లు నెరవేరేవరకు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని వారు తెలిపారు. దీన్ని బట్టి చూస్తే రైతులు మరో సుధీర్ఘ ఉద్యమానికి సిద్ధమయినట్లు స్పష్టమవుతున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *