హస్తినలో బీఆర్‌ఎస్‌ ‌కార్యాలయం

ప్రారంభించిన సీఎం కేసీఆర్‌
అభినందనలు తెలిపిన జాతీయ, రాష్ట్ర నేతలు
హాజరైన అఖిలేష్‌ ‌యాదవ్‌, ‌కుమారస్వామి
పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కేటీఆర్‌

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 14 : ‌దేశ రాజకీయాల్లో ఒక నూతన ఘట్టం ఆవిష్కృతమైంది. తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్‌) అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌ ‌రావు బుధవారం దిల్లీలో పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించి, పార్టీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు జాతీయ, రాష్ట్ర నేతలు అభినందనలు తెలిపారు. అనంతరం రాజశ్యామల యాగం పూర్ణాహుతికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌దంపతులకు వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉత్తరప్రదేశ్‌ ‌మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ ‌యాదవ్‌, ‌కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి హాజరయ్యారు. మరోవైపు కార్యక్రమంలో పాల్గొనేందుకు వొచ్చిన పార్టీ శ్రేణులు, ముఖ్య నేతలతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత, మంత్రులు హరీష్‌ ‌రావు, తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌, ‌మల్లారెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, ‌ప్రశాంత్‌ ‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌, ఎం‌పీ కవిత, హైదరాబాద్‌ ‌నగర మేయర్‌ ‌గద్వాల విజయలక్ష్మి సందడి చేశారు. యాగం ముగిసిన వెంటనే కేసీఆర్‌ ‌బీఆర్‌ఎస్‌ ‌జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేసీఆర్‌ ‌కార్యాలయంలోని తన ఛాంబర్‌కు వెళ్లి ఆసీనులయ్యారు. తెలంగాణ ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్‌ ‌జాతీయ పార్టీగా అవతరించింది. బీఆర్‌ఎస్‌ ‌పేరుతో జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించింది.

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ‌క్రమంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు విస్తరించాలని యోచిస్తున్నారు. ఇక దిల్లీలో బీఆర్‌ఎస్‌ ‌కార్యాలయం ప్రారంభం సందర్భంగా పార్టీ శ్రేణులకు మంత్రి కేటీఆర్‌ ‌శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సీఎం కేసీఆర్‌..‌దేశంలో గుణాత్మక మార్పు కోసం జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారని తెలిపారు. ఆనాడు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం విప్లవాత్మక పంథాను అనుసరించారో, ఇవాళ దేశహితం కోసం నూతన రాజకీయ ఒరవడిని కేసీఆర్‌ ‌ప్రారంభిస్తున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ ‌ప్రత్యేక అనుమతితో బీఆర్‌ఎస్‌ ‌కార్యాలయం ప్రారంభోత్సవానికి హాజరు కాలేకపోతున్నానని కెటిఆర్‌ ‌వెల్లడించారు. ముందే నిర్ణయించబడిన రెండు కీలకమైన పెట్టుబడి సమావేశాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సిరిసిల్లలో సెస్‌ ఎన్నికల నామినేషన్లు కూడా ఈ రోజే ఉన్నాయని కేటీఆర్‌ ‌గుర్తు చేశారు. సంక్రాంతికి ఏపీలో బీఆర్‌ఎస్‌ అడుగుపెట్టబోతుంది. ఈ సందర్భంగా అమరావతిలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్‌ ‌భావిస్తున్నట్లు తెలుస్తుంది. బహిరంగ సభ బాధ్యతలను కూడా తలసానికి కేసీఆర్‌ అప్పగించారు. ఏపీ మూలాలున్న హైదరాబాద్‌లోని ప్రముఖులతో కేసీఆర్‌ ఇప్పటికే పరిచయం పెంచుకున్నారు. జాతీయ పార్టీ అధికారిక గుర్తింపు కోసం తెలుగు ప్రజలు మెజారిటీగా ఉన్న రాష్ట్రాల్లో ముందుగా పోటీ చేయాలని కేసీఆర్‌ ‌ప్లాన్‌ ‌చేస్తున్నారు. తొలి దశలో ఏపీ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *