హక్కుల వకీలు’ బాలగోపాల్‌

అసాధారణ మేధస్సు, నిరంతర అధ్యయనం, విస్తృత విషయ పరిజ్ఞానం, వాగ్ధాటి రచనా కౌశలం, ఆత్మీయత, ఆచరణశీలత, నిబద్ధత, నిమగ్నత, కార్యదీక్ష, అంకితభావం మరియు మానవీయతా సుగుణం మొదలైన లక్షణాలన్నింటిని తనలో మూర్తీభవింపజేసుకున్న అపురూప మేధావి బాలగోపాల్‌. ‌కశ్మీర్‌ ‌నుండి కన్యాకుమారి దాకా తలెత్తిన హక్కుల ఉల్లంఘనలపై ఆయన ఉద్యమించారు. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రంలో హక్కుల ఉద్యమాలకు ఆయన దశ-దిశని నిర్దేశించి వెన్నుదన్నుగా నిలిచారు.

బాలగోపాల్‌ ‌మధ్య తరగతి బ్రాహ్మణ పండిత కుటుంబంలో 1952, జూన్‌ 10 ‌నాడు నాగమణి, పార్థనాథశర్మ దంపతులకు జన్మించారు. ఆయన నిరంతరం పేద, దళిత, గిరిజన, మైనారిటీ మరియు బలహీన వర్గాల అభ్యున్నతికి తన కార్యక్షేత్రం ద్వారా కృషి చేశారు. ఆయన గణితశాస్త్ర విద్యార్థి అయిననూ చరిత్ర, తత్వశాస్త్రం మరియు అర్థశాస్త్రం లను విస్తృతంగా అధ్యయనం చేసి సమాజ పోకడలని సునిశితంగా పరిశీలించారు. రాజ్యాంగంలో హక్కుల అమలుకు పటిష్టమైన చర్యలు తీసున్ననూ నిరంకుశ ప్రభుత్వాల అణచివేత విధానాల వల్ల పౌరులు ఆయా హక్కులు పొందలేకపోవడాన్ని చూసి చలించి అందరూ హక్కులు పొందే స్థితి ఒనగూడాలని ఆశించి హక్కుల ఉద్యమ దిశగా ఆయన తన ప్రస్థానాన్ని కొనసాగించారు.

బాలగోపాల్‌ ‌లో ‘అసమానతలు లేని సమాజం ఆవిష్కరింపబడాలి’ అనే ఆదర్శం బలంగా ఉండేది. ప్రతి మనిషికి ఓకే విలువ ఉండే సమాజం ఉన్నప్పుడు, ప్రతి హక్కుని ప్రతి మనిషి అమలు చేయించుకోగలిగిననాడు అసమానతలు లేని సమాజం తద్వారా సమసమాజం సాధ్యం అవుతుంది’ అన్ని ఆయన బలంగా విశ్వసించారు.

బాలగోపాల్‌ ‌వరంగల్‌ ‌లోని రీజినల్‌ ఇం‌జినీరింగ్‌ ‌కాలేజీలో ఎం.ఎస్సీ అప్లైడ్‌ ‌మాథ్స్ ‌ని అభ్యసించి అక్కడే డాక్టరేట్‌ ‌చేస్తున్న క్రమంలో అక్కడ జరుగుతున్న రాడికల్‌ ‌విద్యార్థి సంఘం కార్యక్రమాలను సునిశితంగా పరిశీలించి రాజకీయ, తాత్విక సంఘర్షణలకు లోను అయ్యారు. నమ్మిన రాజకీయాల కోసం విద్యార్థులు ప్రాణాలు పణంగా ఇవ్వడం ఆయనలో సంఘర్షణలు రేకెత్తించాయి. కమ్యూనిస్టులు వాస్తవాన్ని అతిశయం చేసి చెప్తారని మొదట్లో నమ్మిన బాలగోపాల్‌ ‌కమ్యూనిస్టులు తమ విశ్వాసాల కోసం ప్రాణాలు పణంగా పెట్టడాన్ని గమనించిన తర్వాత ఆయన కమ్యూనిస్టుల పట్ల ముఖ్యంగా విప్లవ కమ్యూనిస్టుల పట్ల తన వైఖరిని పూర్తిగా మార్చుకున్నారు. క్రమంగా ఆయనలో తాత్విక అన్వేషణ మొదలై సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులు అవగతం చేసుకొని వాటిని విశ్లేషించి తన గమ్యాన్ని నిర్దేశించుకున్నారు. రాడికల్‌ ‌విద్యార్థి సంఘం నాయకులు సూరపనేని జనార్ధన్‌ ఎన్‌ ‌కౌంటర్‌, ‌జన్ను చిన్నాలు హత్యా సంఘటనల తర్వాత ప్రజల కోసం ఒక క్రియాశీల కార్యకర్తగా పనిచేయాలని బాలగోపాల్‌ ‌బలంగా నిర్ణయించుకొని 1981 లో ఆంధ్రప్రదేశ్‌ ‌పౌర హక్కుల సంఘంలో చేరారు. వరంగల్‌ ‌రాజకీయ పరిస్థితులు లెక్కల మేధావిగా ఉన్న బాలగోపాల్‌ ‌ని హక్కుల కార్యకర్తగా తీర్చిదిద్దాయి. 1983 లో ఖమ్మంలో జరిగిన పౌర హక్కుల రాష్ట్ర రెండవ మహాసభలో బాలగోపాల్‌ ఆం‌ధ్రప్రదేశ్‌ ‌పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో తాను చేస్తున్న గణితశాస్త్ర అధ్యాపక ఉద్యోగం ఉద్యమాలకు అడ్డు రావడంతో ఆయన ఆ ఉద్యోగాన్ని సైతం తృణీకరించి పూర్తికాలపు హక్కుల కార్యకర్తగా కొనసాగారు. బాలగోపాల్‌ ‌పౌర హక్కుల సంఘంలో గుణాత్మక మార్పులు తీసుకువచ్చి హక్కుల ఉద్యమంలో నూతన ఒరవడులతో ఉద్యమించారు. కాని పరిణామ క్రమంలో తానై తీర్చిదిద్దిన పౌర హక్కుల సంఘం నుండి ఆయన వైదొలిగి 1998, అక్టోబర్‌ 11 ‌నాడు ‘మానవ హక్కుల వేదిక’ను స్థాపించారు.

బాలగోపాల్‌ ‌పౌర హక్కుల సంఘంలో పనిచేస్తున్న సమయంలో బెంగళూర్‌ ‌విశ్వవిద్యాలయం నక అనుబంధంగా ఉన్న వివేకానంద న్యాయ కళాశాలలో ఎల్‌. ఎల్‌. ‌బి. న్యాయ విద్యా డిగ్రీని అభ్యసించి 1997 లో ఆంధ్రప్రదేశ్‌ ‌హైకోర్టు బార్‌ ‌కౌన్సిల్‌ ‌లో న్యాయవాదిగా తన పేరుని నమోదు చేయించుకున్నారు. ఆయన న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించక పూర్వమే చట్టాలు, న్యాయశాస్త్రంలో ఉన్న ఆసుపాసులు మరియు తర్కాన్ని సమగ్రంగా అవగాహన చేసుకోవడంలో నిష్ణాతులుగా పేరు గడించిన బాలగోపాల్‌ ‌కి పెద్దగా సీనియర్‌ ‌న్యాయవాదుల అవసరం ఎంతమాత్రం రాలేదు. కాని చట్టం యొక్క పని విధానంలో ముందుకు వెళ్తున్నప్పుడు ప్రొసీజర్‌ ‌విధానంలో ఆయన సీనియర్‌ ‌న్యాయవాది కె. జి. కన్నాబిరాన్‌ ‌దగ్గర సలహాలు తీసుకొని ఆ ప్రకారం ముందుకు సాగారు.

బాలగోపాల్‌ ‌ప్రధానంగా హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన కేసులలో వాటివల్ల నష్టపోయిన బాధితుల పక్షం నిలబడి వారి తరపున కోర్టులలో వాదించే అవకాశం ఉన్నంత మేరకు వాదించి చట్ట ఫలితాలను వారికి అందించారు. ఆయన ఉచితంగా చాలా కేసులు వాదించారు. అతి తక్కువ రుసుములు తీసుకుని వాదించే న్యాయవాదులలో బాలగోపాల్‌ అరుదైన న్యాయవాది. కేసులతో వచ్చిన వారికి గొప్ప నమ్మకాన్ని కల్పిస్తూ కేసులని తప్పకుండా గెలుస్తామన్న ఆశావహ ధృక్పథాన్ని ఆయన కల్పించేవారు. దళితులు, గిరిజనులు, కార్మికులు, ఉద్యోగులు మరియు భూవివాదాలకు సంబంధించిన అన్ని కేసులను ఆయన వాదించారు. అలాగే లేబర్‌ ‌కోర్ట్, ఆం‌ధ్రప్రదేశ్‌ అడ్మినిస్ట్రేటిటివ్‌ ‌ట్రిబ్యునల్‌ , ‌సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటిటివ్‌ ‌ట్రిబ్యునల్‌ ‌మరియు లేబర్‌ ‌కమిషన్‌ ఆఫీసుల కేసులను కూడా ఆయన వాదించారు. నక్సలైట్లకు సంబంధించి అనేక హెబియస్‌ ‌కార్పస్‌ ‌పీటీషన్స్ ‌లను వేసి సబంధిత వ్యక్తులను కోర్టులకు హాజరుపరిచేలా ఆయన నిరంతర కృషి చేశారు. న్యాయాన్ని న్యాయంగా అందింపజేయడంలో బాలగోపాల్‌ ‌కి మరెవరూ సాటి రారు. చుండూరు హత్యాకాండ కేసులో బాలగోపాల్‌ ‌బాధిత దళితులకు అండగా నిలబడి హైకోర్టులో అత్యున్నత వాదనలు వినిపించి దళిత హక్కులకు బాసటగా నడిచారు. అదేవిధంగా ‘షెడ్యూల్డ్ ‌ట్రైబల్స్ అం‌డ్‌ అదర్‌ ‌ట్రడిషన్‌ ‌ఫారెస్ట్ ‌డ్వెల్లర్స్ ‌యాక్ట్’‌ని అమలు చేయడం కోసం గిరిజనులు చేసిన పోరాటానికి బాలగోపాల్‌ ‌బాసటగా నిలిచి కోర్టులో ఆ చట్టాన్ని గెలిపించడంలో అసామాన్యమైన కృషి చేశారు. ఈ చట్టం ద్వారా గిరిజనులకు 2009 లో భూములు పంచబడ్డాయి.

బాలగోపాల్‌ ‌చేసిన ముఖ్యమైన కేసులలో అత్యంత ముఖ్యమైన కేసు ఎన్‌ ‌కౌంటర్‌ ‌ల కేసు. ‘పోలీసులకు ప్రాణం తీసే హక్కు లేదు అని, పోలీసులు ఎన్‌ ‌కౌంటర్‌ ‌ల నుండి తప్పించుకోవడానికి వీలు లేదు అని, పోలీసులపై కూడా హత్యాచారం కింద  కేసులు పెట్టవచ్చు’ అని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో బాలగోపాల్‌ అత్యున్నతమైన బలమైన వాదనలు వినిపించి ‘పోలీసులపై కూడా న్యాయ విచారణని జరిపించాలి’ అనే తీర్పుని బాలగోపాల్‌ ‌తీసుకురాగలిగారు. ఆ తీర్పుని విని ఆయన కోర్ట్ ‌హాల్‌ ‌నుండి బయటకు వస్తూ మొట్టమొదటిసారిగా చాలా సంతోషకరంగా కనిపంచిన ఆ సందర్భాన్ని ఆయన జీవితంలో అత్యంత ప్రముఖమైన సందర్భంగా పేర్కొనవచ్చు. ఆ తీర్పు రావడం వెనకాల బాలగోపాల్‌ 30 ఏళ్ల నిర్విరామ కృషి ఉంది. అనేక హక్కుల సంఘాలతో  మిళితమైన ఈ కేసులో బాలగోపాల్‌ ‌తో పాటు  కె. జి. కన్నాబిరాన్‌ ,‌బొజ్జా తారకం తదితరులు తమ వాదనలు వినిపించారు.

హక్కుల నిరాధారణకు గురైనప్పుడు ప్రజలు చైతన్యంతో గొంతెత్తి ప్రశ్నించినప్పడు హక్కులు అమలు కాబడుతాయని బాలగోపాల్‌  ‌వవిశ్వసించారు. న్యాయాన్ని పొందేందుకు  ఉద్యమించాల్సిందేనని ఆయన నిర్దేశించారు. హక్కుల అమలు కోసం ఒక వైపు హక్కుల ఉద్యమాల్లో ఉద్యమిస్తూ మరో వైపు వాటికి సమాంతరంగా న్యాయవాదిగా నిరంతరం బాధితుల పక్షాన నిలబడి ఎన్నో కేసులు వాదించి ‘అత్యంత నిబద్ధత గల న్యాయవాది’గా చరిత్ర సృష్టించి ప్రజా హృదయాలలో  చెరగని ముద్ర వేసుకున్న బాలగోపాల్‌  2009, అక్టోబర్‌ 8  ‌నాడు మరణించిననూ ‘చెరగని హక్కుల స్ఫూర్తి’గా  వెలుగొందుతున్నారు.

( జూన్‌ 10 ‌బాలగోపాల్‌ ‌జయంతి )

– జె.జె.సి.పి బాబూరావు, సెల్‌: 94.933 19690.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *