- మార్చ్ 30న శ్రీ సీతారాముల కల్యాణం….31న పుష్కర పట్టాభిషేకం
- జిల్లా అధికార యంత్రాంగం సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ అనుదీప్
కొత్తగూడెం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21 : శ్రీరామనవమి సందర్భంగా స్వామి వారి కళ్యాణ వేడుకలు ప్రతి భక్తుడు వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. మంగళవార ఐడిఓసి కార్యాలయంలో శ్రీరామనవమి, పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం మహోత్సవాల నిర్వహణపై అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత సంవత్సరం భక్తుల మన్ననలు పొందిన విధంగా ఈ సంవత్సరం అదే స్పూర్తితో దిగ్విజయంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేద్దామని చెప్పారు. మార్చి 30న శ్రీరామనవమి, 31న పుష్కర పట్టాభిషేకం మహోత్సవాలు జరుగనున్నట్లు చెప్పారు. స్వామివారి వేడుకలు నిర్వహించే మిథిలా స్టేడియంలో సెక్టారు ప్రణాళిక తయారు చేయాలని దేవస్థానం అధికారులను ఆదేశించారు. స్టేడియాన్ని సెక్టార్లుగా విభజించాలని, ప్రతి సెక్టారు పర్యవేక్షణకు జిల్లా అధికారిని ప్రత్యేకంగా నియమించనున్నట్లు వెల్లడించారు. వేడుకల నిర్వహణకు కార్యాచరణ తయారు చేయడంతో పాటు పర్యవేక్షణ అత్యంత ముఖ్యమని చెప్పారు.
కార్యాచరణ అమలు పర్యవేక్షణ ద్వారా వేడుకలు నిర్వహణకు సిద్ధం కావాలని చెప్పారు. కేటాయించిన విధులు ప్రకారం అధికారులు కసరత్తు ప్రారంభించాలని చెప్పారు. ముందు నుండే సన్నద్ధం కావడం వల్ల ఎలాంటి లోటుపాట్లుకు తావులేకుండా వేడుకలు ఘనంగా నిర్వహించగలమని చెప్పారు. మార్చి 25 వరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. మార్చి 1 నుండి భక్తులు టిక్కెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలన్నారు. భక్తులు టిక్కెట్లు కొనుగోలు చేసేందుకు కొత్తగూడెం, భద్రాచలం ఆర్జీఓ కార్యాలయాల్లో విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. పోస్టల్, మీ సేవా, కార్గో సర్వీసులు ద్వారా భక్తులకు స్వామివారి తలంబ్రాలు, ప్రసాదాలు చేరవేయు విధంగా చర్యలు చేపట్టాలని చెప్పారు. తలంబ్రాలు, ప్రసాదాలు పంపిణీ కేంద్రాలు వద్ద రద్దీ నియంత్రణకు బారికేడింగ్ ఏర్పాటు చేయాలని చేయాలని చెప్పారు.
భక్తులకు సమాచారం అందించేందుకు సమాచార కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిపిఆర్డీకు సూచించారు. విధులు నిర్వహించు సిబ్బందికి గుర్తింపు కార్డులు జారీ చేయాలని చెప్పారు. భక్తులు పెద్దఎత్తున వచ్చే అవకాశం ఉన్నందున అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని, బస్సుల్లో భక్తులకు ఉచితంగా తలంబ్రాలు పంపిణీ చేయాలని ఆర్టీసి అధికారులను ఆదేశించారు. వ్యర్థాలను ఎప్పటికపుడు తొలగించేందుకు జోన్లుగా విభజించి పారిశుద్య పనులు జరిగేలా పర్యవేక్షణకు జోన్‌కు ఒక ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లులో మంచినీటి సౌకర్యం కల్పించాలన్నారు. భక్తులు ఎండ నుండి ఉపశమనం పొందేందుకు మజ్జిగ, మంచినీటిని సరఫరా చేయాలని చెప్పారు. స్వామి వారి ప్రసాదాలు, హోటళ్లులోని ఆహార పదార్థాలను నాణ్యతలను తనిఖీ చేయాలని ఆహార తనిఖీ అధికారులను ఆదేశించారు. తినుబండాలను అధిక ధరలకు విక్రయించకుండా హెరీటల్ యజమానులతో సమావేశం నిర్వహించి ధరలను నిర్ణయించాలని భద్రాచలం, ఆర్డీఓకు సూచించారు.
వాహనాలు పార్కింగ్‌కు పార్కింగ్ స్థలాలన గోదావరి లోతును తెలియచేసే ప్రమాద హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు పటిష్ట పర్యవేక్షణ ఉండాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. 24 గంటలు పనిచేసేలా అత్యవసర వైద్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని వైద్యాధికారులకు తెలిపారు. భద్రాచలం ప్రధాన ఆసుపత్రిల్లో అత్యవసర వైద్యసేవలు నిర్వహణకు బెడ్లు, రక్త నిల్వలు సిద్ధంగా ఉంచాలని చెప్పారు. ఎండబారిన పడకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లుతో పాటు అత్యవసర మందులను సిద్ధంగా ఉంచాలని చెప్పారు. అత్యవసర వైద్య సేవలు నిర్వహణకు తరలించేందుకు వీలుగా 108 వాహనాలను అందుబాటులో ఉంచాలని చెప్పారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరాల చేయాలని, ప్రత్యాన్మయంగా జనరేటర్లును సిద్ధంగా ఉంచాలని విద్యుత్ అధికారులకు సూచించారు. విద్యుత్ ఏర్పాట్లను పరిశీలించి ధఅవీకరణ నివేదిక అందచేయాలని చెప్పారు. మహోత్సవాల రోజుల్లో మద్యం, మాసం విక్రయాలను నిలుపుదల చేయాలని చెప్పారు.
నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టడంతో పాటు నిరంతర తనిఖీలు చేపట్టేందుకు ప్రత్యేకంగా టీములు ఏర్పాటు చేయాలని ఎక్సైజ్ అధికారులకు సూచించారు. హెలిప్యాడ్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రధాన రహదారులకు మరమ్మత్తులు నిర్వహించాలని ఆర్ అండ్ బి, జాతీయ రహదారుల అధికారులకు సూచించారు. లాడ్జిలలో అధిక ధరలు వసూలు చేయకుండా ధరల పట్టిక ఏర్పాటుతో పాటు ఎప్పటికపడు రూముల ఖాళీల వివరాలను ప్రదర్శింప చేయు విధంగా చర్యలు తీసుకోవాలని భద్రాచలం ఆర్డీఓకు సూచించారు. అధిక రేట్లు తీసుకుంటే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. పరిశ్రమల ఆధీనంలో విశ్రాంతి భవనాలను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని ఆర్డీఓలను ఆదేశించారు. తదుపరి నిర్వహించే సమావేశానికి కేటాయించిన విధంగా అధికారులు కార్యాచరణ నివేదికలతో హాజరు కావాలని ఆయన పేర్కొన్నారు.
శ్రీరామనవమి, పుష్కర పట్టాభిషేక మహోత్సవాలు వీక్షించేందుకు పర్ణశాల వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. మంగళవారం ఐడిఓన్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భద్రాచలంలో చేసిన విధంగానే పర్ణశాలలో ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు రావొద్దని ఆయన చెప్పారు. ఈ సమావేశంల దేవస్థానం కార్యనిర్వహణ అధికారి రమాదేవి, డిపిఓ రమాకాంత్, డిఆర్డిఓ మధుసూదన్ జు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ శిరీష, ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ రవిబాబు, ఆర్డీఓ వేణు, ఆహార తనిఖీ అధికారి వేణుగోపాల్, ర.భ. ఈఈ భీమ్లా, డిఆర్డీఓ అశోక్ చక్రవర్తి, అగ్నిమాపక అధికారి శ్రీనివాస్, జాతీయ రహదారుల డిఈ శైలజ, కొత్తగూడెం, భద్రాచలం ఆర్డీఓలు స్వర్ణలత, రత్నకళ్యాణి, దేవస్థానం డిఈ రవీందర్, ప్రధాన అర్చకులు పొడిచేటి సీతారామానుజా చార్యులు తదితరులు ప్గాన్నారు.



