వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 7: ఈనెల 15న జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో స్వతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సమీకృత కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఈనెల 15న స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను చేపట్టాలని ఆదేశించారు. పారిశుధ్య పనులతో పాటు టెంట్లు, షామియానాలు, త్రాగు నీరు తదితర ఏర్పాట్లను పక్కాగా చేపట్టాలని రెవిన్యూ, మున్సిపల్, తదితర శాఖల అధికారులను సూచించారు. అన్ని సంక్షేమ శాఖల అధికారులు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై స్టాల్స్, ట్యాబ్లూస్ లను ఆకర్షణీయంగా ఏర్పాటు చేయాలని అన్నారు. కార్యక్రమానికి వచ్చే అతిథులకు ప్రోటోకాల్ పాటిస్తూ వారికి గ్యాలరీలు ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. గృహలక్ష్మి పథకం కింద లబ్ధిదారులు అందించే దరఖాస్తులను ఈరోజు నుండి సేకరించడం జరుగుతుందని కలెక్టర్ తెలియజేశారు. ఈ పథకం కింద అధిక సంఖ్యలో లబ్ధిదారులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నందున అధికారులందరూ పది రోజులపాటు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంటుందని, అధికారులందరూ దీనిపై దృష్టి సారించాలని సూచించారు. అనంతరం ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి వివిధ సమస్యలపై ప్రజల నుండి 204 దరఖాస్తులను కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎంతో దూరం నుండి వ్యయ ప్రయాసాలకొర్చి తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణికి వస్తున్న ప్రతి ఒక్కరి దరఖాస్తుపై సంబంధిత శాఖల అధికారులు సత్వర చర్యలు చేపట్టి వారి సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.




