స్ధానిక* ఎన్నికల కోసమే బీఆర్‌ఎస్‌ రంకెలు

మరోసారి కేసీఆర్‌ అండ్‌ కోకు కర్రుకాల్చి వాతపెట్టండి

రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి

మహబూబాబాద్‌/హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 8: రాబోయే స్ధానిక ఎన్నికలలో లబ్దిపొందేందుకు బీఆర్‌ఎస్‌ నాయకులు రంకెలు వేస్తున్నారని, వారికి మరోసారి రాష్ట్ర ప్రజానీకం కర్రుకాల్చి వాతపెట్టాలని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. మహబూబూబాద్‌ మండలం సోమల తండాలో మంగళవారం ప్రజాపాలన ప్రగతిబాట పేరిట మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సుమారు రూ.100 కోట్ల విలువైన అభివృద్ది పనులకు శంకుస్దాపనలు చేశారు. ప్రత్యేకంగా ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్బంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ గత 18 నెలల ఇందిరమ్మ రాజ్య పాలనలో పేదవాడికి కష్టం కలగకుండా పథóకాలు అందించామన్నారు. గత ప్రభుత్వం పదేళ్లలో రైతులకు రూ.17వేల కోట్లు రుణ మాఫీ చేస్తే తాము పది నెలల్లోనే రూ.21 వేల కోట్లు రుణమాఫీ చేశామని, తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్లు రైతుభరోసా అందించామని వివరించారు. ఈ నియోజకవర్గానికి నాలుగు వేలకు పైగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని తెలిపారు. పేదలే లక్ష్యంగా తాము పధకాలు అమలు చేస్తుంటే బీఆర్‌ఎస్‌ నాయకులు పోట్ల గిత్తల్లా రోడ్లపై పడి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని ఇష్టారీతిలో మాట్లాడుతున్నారని, ఈ రోజు హైదరాబాద్‌లో కేటీఆర్‌ రంకెలకు ఈ ప్రగతిపాలన సభే సమాధానమని అన్నారు. పదేళ్లపాటు రాష్ట్రాన్ని గాదె కింద పందికొక్కుల్లా తెగతిని బలిసిన ఆ నాయకులకు ఇప్పటికే రెండుసార్లు ప్రజలు బుద్ది చెప్పారని, ఆ రెండు ఎన్నికల్లో గుండు కొట్టారని అన్నారు. రాబోయే స్ధానిక ఎన్నికల్లోకూడా మరోసారి బిఆర్‌ఎస్‌కు అలాగే బుద్దిచెప్పాలని, ఇందిరమ్మ పార్టీ అభ్యర్దులను గెలిపించాలని కోరారు. కాగా, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని ఆయనకు పొంగులేటి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, ఎంపీ బలరాం నాయక్‌, ఎమ్మెల్యేలు మురళీనాయక్‌, కనకయ్య, నాగరాజు, విప్‌ రామచంద్ర నాయిక్‌, ప్రభుత్వ సలహాదారు వేంరెడ్డి నరేందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *