పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2: నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకాన్ని ప్రారంభించారని, ఆయా గ్రామాల్లో నిర్మించిన ఇళ్లల్లో స్థానికులకు సైతం 10 శాతం కేటాయిస్తామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు మండలం కర్దనూర్ గ్రామంలో శనివారం ఏర్పాటు చేసిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర గనులు సమాచార ప్రసార శాఖ మంత్రి మహేందర్ రెడ్డి తో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాజేంద్రనగర్ నియోజకవర్గానికి చెందిన 500 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల కేటాయింపు పత్రాలను పంపిణీ చేశారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయాలన్న సమున్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకాన్ని ప్రారంభించారని తెలిపారు. పూర్తి పారదర్శకతతో అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే ఇల్లను కేటాయించడం జరిగిందని తెలిపారు. ఇళ్ల పంపిణీ ప్రక్రియ నిరంతరం సాగుతూనే ఉంటుందని తెలిపారు. జిహెచ్ఎంసి పరిధిలోని పటాన్ చెరు నియోజకవర్గంలో నిర్మించిన ఇళ్లలో స్థానికులకు 10% ఇచ్చేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఇందులో భాగంగా భారతి నగర్, పటాన్చెరు, రామచంద్రాపురం డివిజన్ల పరిధిలో 4132 మంది లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందని గుర్తు చేశారు. కర్దనూరు, పోచారం, కిష్టారెడ్డిపేట, కొల్లూరు, ఉస్మాన్ నగర్, అమీన్ పూర్ పరిధిలో నిర్మించిన ఇళ్లలో స్థానికులకు సైతం అతి త్వరలో ఇల్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయంలో ఎలాంటి అపోహలకు తావు లేదని తెలిపారు.ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జడ్పిటిసిలు సుప్రజా వెంకట్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, గ్రామ సర్పంచ్ ఎర్ర భాగ్యలక్ష్మి సత్యనారాయణ, ఉపసర్పంచ్ కుమార్, వివిధ శాఖల ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారులు, గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.



