సౌదీతో వ్యూహాత్మక భాగస్వామ్యం

  • పశ్చిమాసియాతోపాటు ప్రపంచ స్థిరత్వానికి ఎంతో కీలకం
  • యావత్‌ ‌ప్రపంచం ఎంతో ప్రయోజనం పొందుతుంది
  • సౌదీ యువరాజుతో భేటీలో ప్రధాని మోదీ

న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 11 : ‌భారత్‌, ‌సౌదీ అరేబియా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం..పశ్చిమాసియాతోపాటు ప్రపంచ స్థిరత్వానికి ఎంతో కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇరుదేశాలు కొత్త అంశాలతో తమ సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటున్నాయని చెప్పారు. భారత్‌కు అత్యంత వ్యూహాత్మక భాగస్వాముల్లో సౌదీ అరేబియా ఒకటని అన్నారు. ఆ దేశ యువరాజు, ప్రధాని మహ్మద్‌ ‌బిన్‌ ‌సల్మాన్‌తో భేటీ సందర్భంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. దిల్లీలోని హైదరాబాద్‌ ‌హౌస్‌లో మోదీ, మహ్మద్‌ ‌బిన్‌ ‌సల్మాన్‌లు..ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. ఇరు దేశాల సన్నిహత భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు అనేక మార్గాలు అన్వేషించామని మోదీ తెలిపారు. మరోవైపు, భారత్‌లో పర్యటించడం సంతోషంగా ఉందని సౌదీ యువరాజు తెలిపారు.

జీ20 సదస్సును నిర్వహించినందుకు భారత్‌ను అభినందిస్తున్నట్లు తెలిపారు. ఈ సదస్సు వల్ల యావత్‌ ‌ప్రపంచం ఎంతో ప్రయోజనం పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరు దేశాల గొప్ప భవిష్యత్తు కోసం రెండు దేశాలు కలిసి పనిచేస్తాయని పేర్కొన్నారు. అయితే మోదీతో ద్వైపాక్షిక చర్చలకు ముందు సౌదీ యువరాజుకు రాష్ట్రపతి భవన్‌ ‌వెలుపల లాంఛనప్రాయ స్వాగతం లభించింది. భారత్‌కు వ్యూహాత్మక భాగస్వాముల్లో సౌదీ అరేబియా కీలక దేశంగా ఉంది. గత కొన్నేళ్లుగా తీసుకుంటున్న చర్యలతో ఇరుదేశాల సంబంధాలు ఉన్నత స్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా రక్షణ, భద్రతను మరింత బలోపేతం చేసేందుకు ఇరు దేశాలు కృషి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌-‌సౌదీ వ్యూహాత్మక భాగస్వామ్య మండలిని 2019లో ప్రకటించారు. 2020 డిసెంబర్‌లో అప్పటి భారత చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌ ‌జనరల్‌ ఎంఎ ‌నరవణె కూడా సౌదీ అరేబియాలో తొలిసారి పర్యటించారు. ఆ తర్వాత ఇరుదేశాల సైనిక ఉన్నతాధికారుల మధ్య రాకపోకలు సాగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *