హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 3:రాష్ట్ర ప్రభుత్వం సేంద్రియ వ్యవసాయానికి సముచిత ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరించారు. మండలిలో ఆయన ప్రశ్నరలకు సమాధానం ఇస్తూ..కేంద్రం సైతం ఈ సేద్యాన్ని ప్రోత్సహించేందుకు పలు పథకాలు తీసుకొచ్చిందని.. అయితే, గత భారాస సర్కారు హయాంలో కేంద్ర పథకాలను రాష్ట్రంలో అమలు చేయకపోవడం వల్ల తెలంగాణలో సేంద్రియ సాగు సరిగా జరగలేదన్నారు. భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు పరిహారం కింద గత సంవత్సరం రూ.95 కోట్లు చెల్లించామని, ఈ సారి పరిహారాన్ని త్వరలో రైతుల ఖాతాలో జమచేస్తామని తెలిపారు. రాష్ట్రంలో యాప్ ద్వారా రైతులందరికీ యూరియా సక్రమంగా అందుతోందని తుమ్మల వివరించారు. యాప్ ద్వారా చేపట్టిన పత్తి కొనుగోళ్లు విజయవంతమయ్యాయని, అదే తరహాలో యూరియాకూ యాప్ తెచ్చామన్నారు. భారాస సభ్యులు దాసోజు శ్రవణ్‌కుమార్, తక్కళ్లపల్లి రవీందర్రావు అడిగిన ప్రశ్నలకు మంత్రి ఈ మేరకు బదులిచ్చారు.
—————-
కాలుష్య పరిశ్రమలపై గట్టి చర్యలు
మంత్రి కొండా సురేఖ వెల్లడి
హైదరాబాద్,ప్రజాతంత్ర,జనవరి3:చౌటుప్పల్ ప్రాంతంలో పలు ఫార్మా కంపెనీలు కాలుష్యకారకంగా మారుతున్న క్రమంలో నిబంధనలు ఉల్లంఘించిన పరిశ్రమలపై కాలుష్య నియంత్రణ మండలి గట్టి చర్యలు తీసుకుంటోందని మంత్రి కొండా సురేఖ తెలిపారు. చౌటుప్పల్‌లో 8 పరిశ్రమలకు జరిమానా విధించామన్నారు. మండలిలో ప్రశ్నోత్తరాల సందర్భహంగా మాట్లాడుతూ…భువనగిరి ప్రాంతంలో 18 పరిశ్రమలకు నోటీసులు ఇచ్చామని, ఎక్కడైనా పరిశ్రమలు వాతావరణాన్ని కలుషితం చేస్తుంటే తమకు ఫిర్యాదు చేయొచ్చని సురేఖ తెలిపారు. బాసర నుంచి భద్రాచలం వరకు టెంపుల్ టూరిజం అభివృద్ధి చేస్తున్నట్టు వివరించారు. కొండగట్టు, వేములవాడ తదితర ఆలయాలను తీర్చిదిద్దుతున్నామని, మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయాన్ని తమ సర్కారు హయాంలో అభివృద్ధి చేయడం అదృష్టంగా భావిస్తున్నానని సురేఖ అన్నారు. చౌటుప్పల్‌లో పారిశ్రామిక కాలుష్యంపై సీపీఐ సభ్యుడు నెల్లికంటి సత్యం, కొండగట్టు ఆలయాభివృద్ధిపై భారాస సభ్యుడు ఎల్.రమణ ప్రశ్నించగా.. మంత్రి ఈ మేరకు స్పందించారు. ఇకపోతే ప్రత్యేక ప్రస్తావనల కింద సభ్యులు పలు ప్రశ్నలు అడిగారు. మత్స్య సహకార సంఘాలకు క్రమం తప్పకుండా ఎన్నికలు జరపాలని భారాస సభ్యుడు బండా ప్రకాశ్ కోరారు. యాదాద్రి ఆలయ నిర్మాణంలో అవినీతి జరిగిందని.. దీనిపై సిట్టింగ్ జడ్జి లేదా సభా సంఘంతో విచారణ జరిపించాలని తీన్మార్ మల్లన్న కోరారు. మోడల్ పాఠశాలల ఉపాధ్యాయులకు ట్రెజరీ ద్వారా జీతాలు చెల్లించాలని బీజేపీ సభ్యుడు మల్క కొమరయ్య విన్నవించారు. ఎంఐఎం సభ్యుడు ఎఫెండీ, భారాస సభ్యులు వాణీదేవి, నవీన్ తదితరులు అడిగిన ప్రశ్నలను నోట్ చేసుకున్నామని మంత్రి వివేక్ తెలిపారు.
—–
పాలమూరుపై ఇరు పార్టీల దొంగాట
కెసిఆర్, రేవంత్ తీరులపై మండిపడ్డ అరుణ
హైదరాబాద్,ప్రజాతంత్ర,జనవరి3:పాలమూరు జిల్లాను కేసీఆర్, రేవంత్ రెడ్డిలు రాజకీయాల కోసం వాడుకుంటున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ విమర్శించింది. పాలమూరు ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి ఇద్దరికీ లేదు.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లతో ఒకరిపై ఒకరు నేపం నెట్టుకునే ప్రయత్నం తప్ప ఏం లేదు.. కేసీఆర్, రేవంత్ రెడ్డిలు ఇద్దరు పాలమూరు ప్రజలకు నష్టం చేసిన వారేనని మండిపడింది. జూరాల నుంచి నీళ్లు తీసుకోవాలని అనేక సార్లు చెప్పడం జరిగింది.. పాలమూరు రైతులతో ఆట ఆడుతున్నారని ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. ఇక, మాయ మాటలతో, మోసం చేసి.. మరోసారి అధికారంలోకి రావాలని కేసీఆర్ నాటకాలు ఆడుతున్నారని డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేసారు. తప్పులను వాళ్ళపై నెట్టి తప్పించుకోవాలని కాంగ్రెస్ నాటకం ఆడుతుంది. ఇద్దరు ఆడుతున్న నాటకంలో పాలమూరు ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది.. పాలమూరు ప్రజలను పదేళ్లు కేసీఆర్ మోసం చేశారనే.. ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించారు.. జూరాల అప్రోచ్ అయితేనే ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని చెప్పుకొచ్చింది. జూరాల నుంచి నీళ్లు తీసుకోవడానికి ఒక అడుగు కూడా ముందుకు పడటం లేదు.. డిండి ప్రాజెక్టుకి నీళ్ళు తీసుకెళ్లడంతో పాలమూరు ప్రజలకు అన్యాయం జరుగుతుందని బీజేపీ ఎంపీ అరుణ తెలిపింది. అయితే, పోటీలు పడి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు.. దాని ఔట్ కమ్ ఏంటి? అని డీకే అరుణ ప్రశ్నించింది. డిండి ప్రాజెక్టుకి నీళ్ళు తీసుకెళ్ళడాన్ని గతంలో పార్టీలకు అతీతంగా వ్యతిరేకించడం జరిగింది.. జూరాల నీళ్లు తీసుకుని పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ ఆఖఖీ టెకాప్ చేయండి అని సూచించింది. ఇంతకు ముందు చేసిన పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ ను కల్వకుర్తిలో కలపండి లేదా నాగర్ కర్నూల్, నల్గొండ అని దాని పేరు పెట్టండి అని కోరింది. అందులో పాలమూరు- రంగారెడ్డి రెండు లేవు.. పాలమూరు ప్రాంత ఎమ్మెల్యేలు ఎందుకు నోర్లకు ప్లాస్టర్ వేసుకున్నారని అడిగింది. డిండికి నీళ్ళు తీసుకెళ్తుంటే నోర్లు మూసుకొని, చోద్యం చూస్తున్నారంటూ మండిపడింది. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ పై ఎందుకు రివ్యూలు పెట్టడం లేదని డీకే అరుణ ప్రశ్నించారు. అలాగే, రివ్యూలకు నన్ను ఆహ్వానించడం లేదు.. కలిసి నిర్ణయం తీసుకుంటే ఏం ఇబ్బంది వచ్చిందని? ఎంపీ అరుణ అడిగింది. వెంటనే సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ పైనా ఇరిగేషన్ నిపుణులు, అధికారులు, ప్రజా ప్రతినిధులతో రివ్యూ పెట్టండి అని సూచించింది. వచ్చే మూడేళ్లలో పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసేలా సీఎం చొరవ తీసుకోవాలని కోరింది.
——————
అసెంబ్లీ వద్ద సోయా రైతుల ఆందోళన
అడ్డుకుని తరలించిన పోలీసులు
హైదరాబాద్,ప్రజాతంత్ర,జనవరి3: అసెంబ్లీ వద్ద అదిలాబాద్ రైతులు హడావుడి చేశారు. అసెంబ్లీ లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. అధిక వర్షపాతం కారణంగా సోయా బీన్ పంటకు నష్టం వాటిల్లింది. రంగు మారిందని సోయా బీన్ పంటను కొనుగోలు చేయడం లేదని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా రైతులం మంత్రిని కలవడానికి వచ్చామని పేర్కొన్నారు. కేవలం ఐదుగురు రైతులను మాత్రమే అనుమతి ఇస్తామని పోలీసులు తేల్చి చెప్పారు. అయితే, 2,80,000 క్వింటాల్ కి పైగా సోయా బిన్ పంటను కొనుగోలు చేయాల్సి ఉంది.. రైతుల దగ్గర నిలువ ఉన్న పంటను రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. 24,000 మంది రైతులు 72 ఎకరాలలో సోయా బీన్ సాగు చేశారు. 4,32,000 క్వింటాల దిగుబడి వస్తుందని అంచనా కానీ అంతకంటే ఎక్కువనే వచ్చింది. 6, 280 మంది రైతుల వద్ద 1,64,000 క్వింటల్ పంట ప్రభుత్వం కొనుగోలు చేసింది. వచ్చిన రైతులందరినీ పంపిస్తేనే లోపలికి వెళ్తామని రైతులు తెలిపారు. పోలీసులు అనుమతించకపోవడంతో అక్కడి నుంచి వెనుదిరిగారు.