సెక్టోరియల్ అధికారులు ప్రముఖపాత్ర పోషించాలి కలెక్టర్ గౌతమ్

మేడ్చల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 17 : తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో జిల్లా సెక్టోరియల్ అధికారుల పాత్ర ఎంతో కీలకమని, వారు బాధ్యతాయుతంగా ఉండి ప్రముఖ పాత్ర పోషించాల్సి ఉంటుందని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ అన్నారు. మంగళవారం  జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సెక్టోరియల్ అధికారులు, ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు చెందిన సెక్టోరియల్ అధికారులతో పాటు ప్రతి నియోజకవర్గానికి సంబంధించి  పది మంది  చొప్పున మాస్టర్ ట్రైనర్లను ఎంపిక చేసి వారికి ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్  అధికారులకు సంబంధించిన ఎన్నికల విధులపై శిక్షణనివ్వడం జరిగిందన్నారు. గతంలో సైతం ప్రతి నియోజకవర్గానికి ఆరుగురు చొప్పున అధికారులకు శిక్షణనిచ్చినట్లు తెలిపారు. అలాగే ప్రస్తుతం సెక్టోరియల్ అధికారులు,  ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు సంబంధించిన ఎన్నికల విధుల నిర్వహణపై శిక్షణనిస్తున్నట్లు పేర్కొన్నారు.  జిల్లాలోని సెక్టోరియల్ అధికారులు ఎన్నికలకు సంబంధించి శిక్షణ పొందిన తర్వాత వారు జిల్లాలోని పోలింగ్ అధికారులు, అసిస్టెంట్ పోలింగ్ అధికారులకు శిక్షణనివ్వాల్సి ఉంటుందని, దీనిని దృష్టిలో పెట్టుకొని అధికారులు ఎన్నికల ప్రవర్తన నియమావళిపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాల్సిందిగా తెలిపారు. జిల్లాలోని సెక్టోరియల్ అధికారులు విధులకు సంబందించిన శిక్షణలో తెలుసుకొన్న అంశాలను పోలింగ్ అధికారులు, అసిస్టెంట్ పోలింగ్ అధికారులకు శిక్షణనివ్వాల్సి ఉంటుందన్నారు. శిక్షణ సమయంలో ఎన్నికల కమిషన్ గైడ్లైన్స్ తప్పకుండా పాటించాలన్నారు.  జిల్లాలోని ప్రతి ఎన్నికల కేంద్రానికి సంబంధించి ఓటర్లు ఓటు వేసేందుకు వచ్చి వెళ్ళే దారితో పాటు, అవసరమైన సౌకర్యాలు ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులకు సూచించారు. దీనిపై సెక్టోరియల్ అధికారులు డ్రాఫ్ట్లు తయారు చేసుకోవాలని, అలాగే ఏమైనా అనుమానాలు ఉంటే వెంటనే నివృత్తి చేసకోవాల్సిందిగా పేర్కొన్నారు. జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారులు తమకు కేటాయించిన బాధ్యతలను తప్పకుండా పాటించాలని ఆదేశించారు. ఈ శిక్షణలో ఈవీఎమ్లపై కూడా అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్రెడ్డి, జిల్లా ఎన్నికల శిక్షణ అధికారులు, జిల్లా బీసీ సంక్షేమాధికారి  కేశూరామ్, జిల్లా సంక్షేమాధికారి కృష్ణారెడ్డి, జడ్పీ సీఈవో దేవసహాయం, జిల్లా స్థాయి ఎన్నికల శిక్షకులు తిరుమలేష్  తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *