సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

సూర్యాపేట, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 25 : ఒక కుటుంబం శుభకార్యానికి వెళ్తుండగా సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొని ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగాపురం సమీపంలో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనక నుంచి కారు బలంగా ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఓ చిన్నారితో సహా ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం ఎల్‌ గోవిందాపురం గ్రామానికి చెందిన శ్రీకాంత్‌ కుటుంబ సభ్యులు కారులో హైదరాబాద్‌ నుంచి విజయవాడకు పయనమయ్యారు. విజయవాడ సమీపంలో ఉన్న గుణదలలోని టెంపుల్‌ లో చిన్నారికి చెవులు కుట్టించేందుకు బయలుదేరారు. కారులో మొత్తం ఎనిమిది మంది ప్రయాణిస్తున్నారు.

కోదాడ పట్టణ సమీపంలోని దుర్గాపురంలో అప్పటికే బ్రేక్‌ డౌన్‌ అయి లారీ ఆగిపోయింది. దీన్ని గమనించని కారు వేగంగా వొచ్చి, ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉంది. తీవ్రంగా గాయపడ్డ ముగ్గురు చిన్నారులు హాస్పిటల్‌లో చికిత్సపొందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో కారులో ఎనిమిది మంది ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆరుగురు ఘటనాస్థంలోనే చనిపోగా, గాయపడిన ఇద్దరిని కోదాడ ప్రభుత్వ హాస్పిటల్‌కి తరలించారు. కారు హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.  మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతులలను ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం ఎల్‌ గోవిందపురం చెందిన వారుగా గుర్తించారు.

ఒకరు కోదాడ మండలం చిమిర్యాలకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారని, హైదరాబాద్‌ నుండి విజయవాడ గుణదల దేవాలయంలో పాపకు చెవులు కుట్టించేందుకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. చనిపోయిన వారిని మాణిక్యమ్మ, చందర్రావు, కృష్ణంరాజు స్వర్ణ, శ్రీకాంత్‌, లాస్యగా నిర్ధారించారు. గాయపడ్డ వారిలో నాగమణి అనే మహిళ పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం ధాటికి కారు లారీ కిందకు వెళ్లిపోయింది. లారీ వెనుక భాగంలో ఇరుక్కున్న కారును బయటికి తీసేందుకు పోలీసులు శ్రమించాల్సి వొచ్చింది. జాతీయ రహదారిపై ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటామని పోలీస్‌ అధికారులు చెబుతున్నారు. బ్లాక్‌ స్పాట్స్‌ లను గుర్తించడంతోపాటు స్పీడ్‌ గనులను కూడా ఏర్పాటు చేస్తామని సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్‌ హెడ్డే చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *