న్యూ దిల్లీ, ఫిబ్రవరి 28 : మహిళలను దర్యాప్తు సంస్థలు ఇంట్లోనే విచారించాలనే అంశంపై భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీమ్ కోర్టు మార్చి 13కు వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ జరగాల్సి ఉండగా కోర్టు సమయం ముగియడంతో తదుపరి విచారణను త్వరగా జరపాలని కవిత తరఫు న్యాయవాది కపిల్ సిబల్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. మార్చి 13న చూస్తామని ధర్మాసనం తెలిపింది.
కాగా, మద్యం కేసులో విచారణకు రావాలని ఈడీ జారీ చేసిన నోటీసులను గతేడాది కవిత సవాలు చేశారు. గతంలో ఆమె పిటిషన్‌ను నళినీ చిదంబరం, అభిషేక్ బెనర్జీ కేసులతో జత చేసిన విషయం తెలిసిందే. పిటిషన్లపై విడివిడిగానే విచారణ చేపట్టనున్నట్లు గత విచారణలో జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనం స్పష్టం చేసింది. 3 కేసులు వేర్వేరు అని, కలిపి విచారణ చేయడం సబబు కాదని ధర్మాసనం అభిప్రాయపడింది.





