సీఎం సాబ్‌..మాకొద్దీ మండీ.. చెంగిచర్ల నుంచి తరలించండి..

కబేలా కాలుష్యంపై నివాసితుల గుస్సా..
ప్రాణసంకటంగా మారిన మోడర్న్‌ స్లాటర్‌ హౌజ్‌..
పేరుకే అధునాతనం..ఊపిరిసలపనివ్వని దుర్గంధం..

పరిశుభ్రమైన మాంసం సరఫరా లక్ష్యంగా వందలాది కోట్ల రూపాయలు వ్యయంతో సువిశాలమైన స్థలంలో తెరపైకి తెచ్చిన ఆధునిక కబేలా నిర్వహణ లోపం కారణంగా దుర్వాసనలతో నివాసితులకు ప్రాణసంకటంగా మారింది. హైదరాబాద్‌ మహా నగర వాసులు, సమీప ప్రాంతాల వారి మాంస అవసరాలు తీర్చేందుకు చెంగిచర్లలో ఏర్పాటు చేసిన కబేలా నుంచి వెలువడుతున్న దుర్వాసనలతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ముక్కుపుటాలదరగొట్టే దుర్గందంతో ప్రజలు హాహాకారాలు చేస్తున్నారు.. కబేలా మూలంగా వాయు కాలుష్యంతో పాటు భూగర్భ జలాలు వాడుకోడానికి సైతం పనికిరావడం లేదంటూ నెత్తీనోరు మొత్తుకుంటూ దుర్గందభూయిష్టమైన కబేలాను తమ ప్రాంతం చెంగిచర్ల నుంచి తరలించాలని పలువురు ముఖ్యమంత్రికి మొరపెట్టుకుంటున్నారు.

ప్రజాతంత్ర, మేడిపల్లి, మార్చి 25 : చెంగిచర్లలో ఏర్పాటు చేసిన ఆధునిక పశు వధశాల(కబేలా) నుంచి వెలువడుతున్న దుర్వాసనలతో నివాసితులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దాని నుంచి తీవ్రంగా వెలువడుతున్న దుర్గంధంతో ఇండ్ల తలుపులు, కిటికీలు మూసుకొని గడపాల్సిన దుస్థితితో ప్రజలు నిత్యం అవస్థలకు, అసహనానికి గురవుతూ ప్రశాంతతను కోల్పోతున్నారు. హైదరాబాద్‌ నగరంలోని కబేలాలన్నింటినీ మూసి వేసిన అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం దాదాపు 83 ఎకరాల సువిశాలమైన స్థలంలో ఆధునిక జంతు వధశాల(మోడర్న్‌ స్లాటర్‌ హౌజ్‌)ను నెలకొల్పింది. హైదరాబాద్‌ నగరంతో పాటు శివారు ప్రాంతాల మాంస ప్రియుల అవసరాలు తీర్చేందుకు రోజుకు ఐదు వేల గొర్రెలు, మేకలు, సుమారు నాలుగు వేల పశువులను వధించి మాంసం అందించే సామర్ధ్యంతో ఈ అధునాతన వధశాలను ప్రస్తుత బోడుప్పల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని చెంగిచర్లలో ఏర్పాటు చేసింది. పూర్తిగా యంత్రాలపైనే జంతువులను వధించి మాంసం కటింగ్‌ చేసే పద్దతి ప్రవేశపెట్టినా.. తాము జీవనోపాధిని కోల్పోతున్నామని మాంసం వ్యాపారుల నుంచి తీవ్ర ఒత్తిడి పెరగడంతో ప్రభుత్వం యంత్రాలపైన జంతు మాంస కటింగ్‌ విధానానికి మినహాయింపులు ఇచ్చింది. అయితే ఇంతవరకు భాగానే ఉన్నా తరువాత అస్తవ్యస్థ నిర్వహణతో కబేలాలో వందలాది టన్నులుగా పేరుకుపోతున్న వ్యర్థాలను ఎప్పటికప్పుడు శుద్ధి చేయక అక్కడే నిల్వ చేస్తుండడంతో ముక్కు పుటాలదరగొట్టే దుర్వాసనలు కొన్ని కిలోమీటర్ల దూరం వరకు వ్యాపించడం మొదలయ్యాయి. ఫలితంగా చెంగిచర్లతో పాటు దాని పరిసరాల్లో ఉన్న నారపల్లి ప్రాంతం సైతం జల, వాయు కాలుష్యాల బారిన పడి బలవుతున్నాయి. గతంలో అనేకమార్లు చెంగిచర్ల, నారపల్లి ప్రాంతాల నివాసితులు దుర్వాసనలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కబేలా ఎదుట ధర్నాలు చేయడమే గాకుండా ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదులు చేశారు. అయినా పరిస్థితిలో మాత్రం పెద్దగా మార్పురాలేదనే చెప్పుకోవాలి. చెంగిచర్ల కబేలా ఆరంభం నుంచి గుత్తాధిపత్యంగా ఒకే వ్యక్తి నిర్వహణ బాధ్యతలు చేపడుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని పలువురి నుంచి తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి.

image.png
కాలుష్య నియంత్రణ మండలి ఏం చేస్తుంది..!
కబేలా నుంచి భరించలేని దుర్వాసనలు వెలువడుతూ జల, వాయు కాలుష్యాలకు కారణమవుతున్నా సంబంధిత పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు మాత్రం ఉలుకూపలుకూ లేకుండా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాలుష్యం వెలువడకుండా పరిశుభ్రత చర్యలు తీసుకునేలా నిర్వాహకులపై ఒత్తిడి పెంచాల్సిన కాలుష్య నియంత్రణ మండలి చేష్టలుడిగినట్లు వ్యవహరించడం పలు సందేహాలకు తావిస్తుంది. కబేలా నిర్వాహకుల నుంచి ముడుపులు ముడుతుండడంతోనే ఏ మాత్రం పట్టింపు లేనట్లుగా, చేష్టలుడిగినట్లుగా వ్యవహరిస్తున్నారని పలువురు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూగర్భ జలాలు కలుషితమై, విష వాయువులు విడుదలవుతున్నా తమకేమీ పట్టనట్లు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని పలువురి నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి.

నిబంధనలకు పాతర..అడ్డగోలుగా నిర్వహణ..?
కబేలాలో వధించే జంతువుల వయసు, ఆరోగ్యం తదితర పరిస్థితులను క్షుణ్ణంగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉన్నా వాటిని ఏ మాత్రం ఖాతరు చేయకుండా నియమ, నిబంధనలకు పాతరేస్తున్నారని పలువురు వాపోతున్నారు. మాంసం కోసం పశువులు 15 ఏళ్ళు దాటినవై ఉండాలి. అవి పూర్తిగా పని చేయలేని స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే వాటిని వధించాలి. అయినా ఇవేవి పట్టకుండా లేగదూడలను సైతం మాంసం కోసం వధిస్తుండడం గమనార్హం. ఇదే విషయమై జంతు ప్రేమికులు పలు సందర్భాల్లో ఆందోళనలు చేసినా ఫలితం మాత్రం శూన్యం. చెవిటి వాడి ముందు శంఖు ఊదిన చందంగా మారింది. ఇక్కడ ఆవులను సైతం యథేచ్ఛగా వధిస్తున్నారని పలువురు గో సంరక్షకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ కబేలాలో వెటర్నటీ డాక్టర్‌ సర్టిఫై చేసిన మేకలు, గొర్రెలు, పశువులను వధించాల్సి ఉన్నా ఇక్కడ ఇవేవీ పట్టించుకోకుండా నిబందనలను ఉల్లఘించి రోగాలతో బాధపడుతున్న వాటిని, తరలింపులో మృతి చెందిన, గాయపడిన జంతువులను సైతం వధిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పశు వైద్యుడు ప్రతి ఒక్క జంతువును పరిశీలించి ఆరోగ్యంగా ఉందని ధృవీకరించిన జంతువులనే మాంసం కోసం వధించాల్సి ఉన్నా ఇక్కడ ఆ నిబంధనలు గాలికొదిలేసారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి.

అవశేషాల ప్రాసెసింగ్‌లో లోపాలతోనే కాలుష్యం..!
జంతు కళేబరాలు, అవశేషాల నుంచి వెలువడే దుర్గంధం, కాలుష్యానికి శాశ్వత ముగింపు పలకాలనే సదుద్దేశంతో జీహెచ్‌ఎంసీ చెంగిచర్ల కబేలాలో వ్యర్థాలను ఎరువులుగా మార్చేందుకు శాస్త్రీయ పద్దతిలో అత్యాధునిక ప్లాంట్‌ను నెలకొల్పింది. వీటి ద్వారా చేపల ఎరువులలో, సబ్బుల తయారీలో  ఉపయోంచే చమురు తదితరాలను ఉత్పత్తి చేసే విధంగా గత కొన్నేళ్ళ క్రితం ప్రారంభించారు. అవశేషాలను ప్రాసెసింగ్‌ చేసే యంత్రాలను నెలకొల్పి ప్రారంభించడంతో పాటు పేరుకు పోయిన వీటిని నిల్వ చేసేందుకు కోల్డ్‌ స్టోరీజీలను సైతం అందుబాటులోకి తెచ్చారు. ప్రయోగాత్మకంగా ప్రజోపయోగం కోసం ఈ విధానం ప్రారంభించి ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించారు. అయినా ఈ కేంద్రం నుంచి కూడా నిత్యం దుర్వాసనలు వెదజల్లడం గమనార్హం. జంతువుల అవశేషాలైన ఎముకల నుంచి పౌడర్‌ రూపంలో ఎరువులు, చమురు తదితరాలు తయారీ చేస్తున్న క్రమంలో పశువుల ఎముకలు ఎండిరచి వాటి నుంచి నూనె తీసే క్రమంలో భరించలేని దుర్గంధం వెదజల్లుతుందని స్థానికులు మండిపడుతున్నారు. శాస్త్రీయ పద్దతిలో దుర్గంధం నివారణ చేసే విధామని చెబుతున్నా.. ప్రాసెసింగ్‌ విధాన పద్దతులు సక్రమంగా పాటించకపోవడం వల్లే అధిక దుర్వాసనలు వెదజల్లుతూ పరిస్థితి మరింత విషమంగా ఉంటుందని పలువురు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు.

మీతిమీరుతున్న కుక్కల బెడద.. కాకుల గోల..
కబేలాలో మాంస వ్యర్ధాలను ఇష్టానుసారంగా పారవేస్తుండడంతో ఈ ప్రాంతంలో కుక్కలు, కాకులు విపరీతంగా పెరిగిపోతున్నాయని స్థానికులు అభ్యంతరం తెలుపుతున్నారు. మాంస అవశేషాలకు అలవాటు పడిన వీధి కుక్కలు, కాకులు ఈ ప్రాంతంలో లెక్కకు మించి కోకొల్లలుగా ఉన్నాయి. నిత్యం మాంస వ్యర్థాలు తింటున్న వీధి కుక్కలు బలిష్టంగా తయారవుతూ మనుషులపై దాడి చేస్తూ భయానక వాతావరణం సృష్టిస్తున్నాయని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. కుక్కలు, కాకుల సంఖ్య వేలల్లో ఉంటుందని వాపోతున్నారు. నిత్యం మాంస వ్యర్థాల భక్షణతో మదమెక్కిన వీధి కుక్కలు ఎటూపాలుపోక అనేక సందర్భాల్లో చిన్న పిల్లలపై దాడులకు తెగబడుతూ తీవ్రంగా గాయపరుస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో వీటి బారిన పడిన చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన దురదృష్టకర సంఘటనలు ఉన్నాయి. అదే విధంగా ఇక్కడ కాకులు సైతం వేలల్లో పెరిగిపోయాయి. పొద్దుగూకితే చాలు ఇండ్లు, చెట్లపైన ఆవాసం ఏర్పాటు చేసుకొంటున్నాయి. ఈ కారణంగా అవి చేసే గోల, అరుపులు భరించలేకుండా కర్ణకఠోరంగా ఉంటున్నాయంటూ స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

కబేలాను మరో చోటికి తరలించాలి..: బింగి జంగయ్య యాదవ్‌, కార్పొరేటర్‌  
కాలుష్యనికి ఏ మాత్రం తావు లేకుండా చెంగిచర్లలో మోడర్న్‌ స్లాటర్‌ హౌజ్‌ ఏర్పాటు అంటూ గత ప్రభుత్వం మా నెత్తిన రుద్దింది. కబేలా రాకతో అభివృద్ది చెందుతుందనుకున్న మా ప్రాంతం జల, వాయు కాలుష్యాల బారిన పడి నివాసితులు నిత్య రోగులుగా మారుతున్నారు. ఈ కబేలా సమీపంలో ప్లాట్లకు ఏ మాత్రం డిమాండ్‌ లేకుండా పోయింది. నిత్యం భరించిలేని దుర్వాసనలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నిర్వాహకుడి ఇష్టారాజ్యంతో మండీ పూర్తిగా భ్రష్టుపట్టి రౌడీలకు అడ్డాగా మారింది. స్థానిక మున్సిపల్‌ కార్పొరేషన్‌కు చెల్లించాల్సిన పన్నులు సైతం చెల్లించకుండా నయా నయీంలుగా వ్యవహరిస్తూ నిబంధనలకు పాతరేస్తున్నారు. ఇదేమని ప్రశ్నించిన వారిపై తన అనుయాయులను ఉసిగొల్పుతూ దాడులకు తెగబడున్నాడు. ప్రజల ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావం చూపుతూ కాలుష్యకారకమమైన కబేలాను మా ప్రాంతం నుంచి మరో చోటికి తరలించాలి. కబేలా బాధితుల ఇబ్బందులు సీఎం రేవంత్‌ రెడ్డి సావధానంగా పరిశీలించి ఇక్కడి నుంచి కబేలాను ఎత్తివేయించి ఈ ప్రాంత ప్రజలకు సాంత్వన చేకూర్చాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *