ఆయనకు రాహుల్ భాయ్ అయితే…మోదీ బడా భాయ్
అప్పుడేమో అన్నీ సిద్ధిపేటకే అన్నారు.. ఇప్పుడేమో ఏమీ చేయలేదంటున్నారు…ఏది నిజం
సొంత పార్టీ నాయకులకే రేవంత్ అపాయింట్‌మెంట్ ఇవ్వరు
మెదక్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్
సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఏప్రిల్ 20 : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెదక్‌లో మరోసారి తన మూర?త్వాన్ని చాటుకున్నారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలదీస్తే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అసహనంతో మాట్లాడుతున్నాడని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎంఎల్‌ఏ హరీష్ రావు విమర్శించారు. నీళ్ళు, నిధులు అన్ని గజ్వేల్‌కేనా అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నాడని, ఇప్పుడేమో గజ్వేల్ అభివృద్ధి ఇందిరాగాంధీ హయాంలో అయిందని అంటున్నారని మండిపడ్డారు. గజ్వేల్‌లో మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ…గజ్వేల్‌కు, సిద్దిపేటకు రైల్ తెచ్చింది కేసీఆర్ అని, మూడు యూనివర్శిటీలు తెచ్చింది కేసీఆర్ అని, ఉద్దేశ పూర్వకంగానే తమపై నిందలు వేస్తున్నారని, కాంగ్రెస్ హయాంలో కనీసం తాగు నీరు కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు.
సాగు నీరు, త్రాగు నీరు ఇచ్చింది కేసీఆర్ అని, మెదక్ జిల్లాను ఏర్పాటు చేసి మంచి ప్రభుత్వ కార్యాలయాలను నిర్మించిన ఘనత కేసీఆర్‌దని, సింగూర్ జలాలను మెదక్ కే దక్కేలా చేసింది కేసీఆర్ అని, తమను విమర్శించినప్పుడు తమకు కూడా విమర్శించే హక్కు ఉందని, కానీ తమకు విజ్ఞత ఉందని విమర్శించడం లేదన్నారు. సిఎం పదవిలో ఉండి స్థాయికి తగ్గట్లుగా మాట్లాడడం లేదని, వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదని, మోదీతో కుమ్మక్కయింది నువ్వే కాదా అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ నీకు భాయ్ అయితే, మోదీ బడా భాయ్ అంటాడని, 100 రోజుల్లో ఆరు గ్యారంటీ అమలు చేస్తానని ఇంతవరకు అమలు చేయలేదని అన్నారు. బిజెపికి బేడి అయిన కేడి అయిన అది రేవంత్ రెడ్డే అని, కాంగ్రెస్ పార్టీ చచ్చుబడేది ఖాయమని, పార్టీలు మారిన వారిని తక్షణమే అనర్హత వేస్తామని రాహుల్ గాంధీ మానిఫెస్టోలో పెట్టారని, ఆయనేమో పార్టీలు మారిన వారికి ఖండువాలు కపుతున్నాడని హరీష్ రావు విమర్శించారు. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తానని చెప్పి చేయలేదని, ఇప్పటికీ కూడా మాఫీ చేయకుండా రైతులను మోసం చేస్తున్నాడని, ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు ఇప్పటికీ అమలు చేయలేదని, కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పాడని, కానీ మాటమీద నిలబడే నైజం ఆయనకు లేదని హరీష్ రావు దుయ్యబట్టారు.
అత్యధిక ఎమ్మెల్యే సీట్లు బీసీలకు ఇచ్చిన పార్టీ బిఆర్‌ఎస్ అని, ఎస్‌సీలను, ఎస్‌టీలను మోసం చేసింది రేవంత్ రెడ్డేనని, మైనార్టీల వోట్లు వేయించుకుని గెలిచి వారికి క్యాబినెట్‌లో అవకాశం కల్పించలేదని, మైనార్టీలు క్యాబినెట్‌లో లేకుండా ప్రభుత్వం నడుతున్నది రేవంత్ ప్రభుత్వమేనని విమర్శించారు. వందలాది మంది భూములు లాక్కున్నాడని వెంకట్రామ్ రెడ్డిని విమర్శిస్తున్నాడని, అలా చేస్తేనే కదా లక్షలాది ఎకరాలకు సాగు నీరు అందించిందని, మల్లన్నసాగర్ కట్టడం వల్లే కదా నీరు అందిందని, అదే మల్లన్న సాగర్ నుండి నీళ్ళు హైదారాబాద్‌కు తీసుకెళ్ళడానికి రేవంత్ రెడ్డి చూస్తున్నాడని అన్నారు. ఇండియాలోని బెస్ట్ ఆర్ అండ్ ఆర్ కాలనీ కాలనీని కట్టింది వెంకట్రామ్ రెడ్డి.ఇండియా లోనే బెస్ట్ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజిని ఇచ్చింది అక్కడేనన్నారు. లక్షల మంది తాగు నీరు, సాగు నీరు అందిందని, ఎక్కడ నుండి వొచ్చి ఇక్కడ నుండి వోటేస్తున్నాడని వెంకట్రామ్ రెడ్డిని అంటున్నాడని, మరి మల్కాజ్ గిరిలో ఎంపీగా ఆయన పోటీ చేయలేదా అని ప్రశ్నించారు.
ఉత్తర్ ప్రదేశ్‌లో రాహుల్ గాంధీ తరిమేస్తే వయానాడుకు వెళ్లి పోటీ చేయలేదా అని ప్రశ్నించారు. అందరినీ తొక్కుకుంటూ ఈ స్థాయికి వొచ్చిన అని రేవంత్ రెడ్డి అంటాడని, ఆయన పదవి కోసం ఎవరిని అయినా తొక్కుతాడంటూ విమర్శించారు. రాచరిక పాలన అని అంటున్నాడని, ఆయన ప్రజలను ఎప్పుడు కలిసాడని, వారి పార్టీ నాయకుడు వి హనుమంతరావు, మోత్కుపల్లిలకు ఆయన అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని ప్రెస్ మీట్‌లు పెట్టారన్నారు. వారి నాయకుల్నతోనే ఆయన కలవడం లేదని, రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా వడగళ్ల వాన పడిరదని, రైతులను ఎవరిని కలిసింది లేదని, రైతుల పంటలను కొనడం లేదని రైతులు బాధపడుతున్నారని, వెంటనే రైతుల పంటలు కొనుగోలు చేయాలని, ఎక్కడ ఎక్కడ నష్టం జరిగింది పరిశీలించి రైతులకు ఎకరాకు 25 వేల నష్ట పరిహారం చెల్లించాలని, రైతులు కొనుగోలు కేంద్రాలలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదని, ఆరోగ్యం భాగాలేని కేసీఆర్ రైతులను పరామర్శిస్తుంటే ఆయనేమో క్రికెట్ చూస్తున్నాడని విమర్శించారు. ఉద్యోగులను కూడా మోసం చేశాడని అన్నారు.




