- పిల్లల పౌష్టికాహారం కోసమే అల్పాహారం
- విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ
- వెస్ట్ మారేడుపల్లి ప్రభుత్వ పాఠశాలలో సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 6 : ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన పోషాకాహారం అందివ్వాలనే ఉద్దేశంతో శ్రీకారం చుట్టిన సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ సూపర్ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. అల్పాహారం రుచిగా ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని వెస్ట్‌మారేడుపల్లి ప్రభుత్వ పాఠశాలలో సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి మంత్రి టిఫిన్ చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు. రాష్ట్రంలోని 23 లక్షల మంది పిల్లలకు ప్రతి రోజు ఉదయం సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీం కింద అల్పాహారం అందిస్తున్నామని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 27,147 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మధ్యాహ్నం భోజనంలో భాగంగా ప్రతి విద్యార్థికి సన్నబియ్యంతో కూడిన భోజనాన్ని అందిస్తున్నామని మంత్రి గుర్తు చేశారు.
అదే విధంగా ఉదయం పూట కూడా నాణ్యమైన బ్రేక్ ఫాస్ట్ పెడితే బాగుంటుందని సీఎం కేసీఆర్ నిర్ణయించారన్నారు. హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో, మున్సిపాలిటీల్లో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో, గ్రామాల్లో పంచాయతీరాజ్ డిపార్ట్‌మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ సంయుక్తంగా కలిసి బ్రేక్ ఫాస్ట్‌ను అందించనున్నాయి. బ్రేక్ ఫాస్ట్ పోషకాలతో కూడి ఉందని, చాలా రుచిగా ఉందని, తాను కూడా తిన్నానని, మెనూ ప్రకారం అల్పాహారం అందివ్వకపోతే తమకు ఫోన్ చేయాలని విద్యార్థులకు కేటీఆర్ సూచించారు. నాణ్యతతో కూడిన అల్పాహారాన్ని అందివ్వాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను కేటీఆర్ ఆదేశించారు. తరుచుగా బ్రేక్ ఫాస్ట్‌ను పరిశీలిస్తూ, రుచిని కూడా పరిశీలించాలన్నారు. మరో ఐదారు రోజుల్లో దసరా సెలవులు కూడా వొస్తాయి కనుక ఈ లోపు అల్పాహారం పథకం ఎలా ఉందనే ఫీడ్ బ్యాక్ ఇవ్వాలని టీచర్లకు సూచించారు కేటీఆర్. పిల్లలందరూ మన పిల్లలే.
ఎక్కడ ఒక చిన్న తప్పు జరిగినా అందరం బాధపడే పరిస్థితి ఉంటది కాబట్టి.. టీచర్లు కూడా తమకు చెప్పాలని కెటిఆర్ సూచించారు. ఈ పథకాన్ని ఎలా అభివృద్ధి చేయాలో కూడా చెప్పాలని కేటీఆర్ కోరారు. తమిళనాడులో ఈ కార్యక్రమాన్ని ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు అమలు చేస్తున్నారని కేటీఆర్ తెలిపారు. సీఎం కేసీఆర్ మాత్రం తెలంగాణలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు అమలు చేయాలని నిర్ణయించారు. ఎందుకంటే పనులకు వెళ్లే తల్లిదండ్రుల పిల్లలకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని, పోషకాలతో కూడి అల్పాహారం విద్యార్థులకు అందుతుందని తెలిపారు. పిల్లల బ్రేక్ ఫాస్ట్ కోసం పొద్దున 5 గంటలకు లేవాల్సి ఉంటుందని, ఈ పథకం అమలుతో అటు తల్లిదండ్రులకు, ఇటు పిల్లలకు లాభం కలుగుతుందని కేటీఆర్ పేర్కొన్నారు.





ఈ ఫలితాలు ముమ్మాటికీ రెఫరెండమే