ఐటీ టవర్ ప్రారంభోత్సవ సభలో మంత్రి కేటీఆర్
అసూయ పడేలా మంత్రి హరీష్ రావు సిద్దిపేటను అభివృద్ధి చేస్తున్నాడని ప్రశంస
కలలో కూడా సిద్ధిపేటకు ఐటి టవర్ వొస్తదనుకోలేదు..కేసీఅర్‌కి హ్యాట్రిక్ గెలుపు ఇవ్వాలి : మంత్రి హరీష్ రావు
సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూన్ 15 : సిద్దిపేటలో కేసిఆర్ పుట్టకుంటే తెలంగాణ వొచ్ఛేది కాదని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సిద్దిపేటను చూసి అసూయ పడేలా మంత్రి హరీష్ రావు అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. 63 కోట్ల రూపాయలతో నిర్మించిన ఐటి టవర్‌ను గురువారం మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ…తెలంగాణ మోడల్ అంటే సమగ్ర, సమీకృత, సమతుల్య, సమ్మిళిత అభివృద్ధి. ఓ వైపు, పంచాయతీ అవార్డులు..మరోవైపు పట్టణ ప్రగతి అవార్డులు జాతీయ స్థాయిలో వొస్తున్నాయన్నారు. చాలా మంది సిద్ధిపేట మీద ప్రత్యేక ప్రేమ ఎందుకు అని అడుగుతున్నారు. ఉద్యమ నాయకుణ్ణి అందించిన జిల్లా సిద్ధిపేట గడ్డ. సిద్దిపేటలో కేసీఆర్ పుట్టకుంటే తెలంగాణ ఉద్యమం పుట్టేదా..వొచ్చేదా అని ప్రశ్నించారు.
తాను సిరిసిల్లకి వెళ్ళేటప్పుడు, సిద్దిపేటకి వొచ్చినప్పుడు తన బావకి ఫోన్ చేసి మళ్ళీ కొత్తది ఏం కట్టినవ్ అని అడిగేలా సిద్దిపేటని అభివృద్ధి చేస్తున్నాడు హరీష్ రావు. సిద్దిపేట స్వచ్ఛబడి స్ఫూర్తితో ప్రతి జిల్లాలో స్వచ్ఛబడి ఏర్పాటు చేస్తామన్నారు. ‘1980లో సిద్ధిపేట అభివృద్ధి మొదలైంది. దళిత బంధు కొత్త పథకం అని అంటున్నారు…సిద్దిపేటలో ఆనాడే దళిత చైతన్య జ్యోతి అని కేసీఆర్ పెట్టారు. మిషన్ భగీరథకు పునాది పడ్డది కూడా సిద్దిపేటలోనే. మిషన్ భగీరథ పథకాన్ని కేంద్రం హర్ ఘర్ జల్ అని కాపీ కొట్టింది. హరీష్ రావు నాకు బావ కాబట్టి అప్పుడప్పుడు ఎడిపిస్తా. ప్రతి నియోజకవర్గం సిద్దిపేట లాగా అభివృద్ధి చేస్తాం. సిద్ధిపేటను ఆదర్శంగా తీసుకుని మేమందరం పని చేస్తాం. ఈ సారి హరీష్ రావుని లక్షా 50 వేల మెజార్టీతో గెలిపించాలి’ అని కెటిఆర్ పిలుపునిచ్చారు.
ఐటీ హబ్ ని ఇంకా విస్తరిస్తం
టాస్క్‌తో యువతకి శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పిస్తామని, టాలెంట్ ఎవడబ్బ సొత్తు కాదని మంత్రి కెటిఆర్ ఈ సందర్భంగా అన్నారు. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతుందని, 2014లో తెలంగాణ ఏర్పడినప్పుడు ఐటీ ఎగుమతులు 56 వేల కోట్లు ఉంటే..ఈ 9 ఎళ్లల్లో రెండు లక్షల 41 వేల కోట్లకు పెరిగాయన్నారు. ప్రపంచంలో ఏ ప్రభుత్వమైనా అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉండదని, తెలంగాణలో 6.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో యువత ఎక్కువగా ఉందని..వారికి ప్రయివేట్ ఉద్యోగాలు సృష్టించడం కోసం ఎన్నో పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
కలలో కూడా సిద్ధిపేటకు ఐటి టవర్ వొస్తదనుకోలేదు..కేసీఅర్‌కి హ్యాట్రిక్ గెలుపు ఇవ్వాలి : మంత్రి హరీష్ రావు
ఐటీ టవర్ ప్రారంభోత్సవ సభలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ…కలలో కూడా సిద్దిపేటకి ఐటీ టవర్ వస్తుందని అనుకోలేదు. సిద్దిపేట జిల్లా అయ్యి ఐటీ టవర్ వొచ్చిందంటే తెలంగాణ తెచ్చిన కేసీఆరే కారణం. సిద్దిపేటలో చదివిన బిడ్డలు సిద్దిపేటలోనే ఐటీ ఉద్యోగం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మంత్రి కేటీఆర్ సహకారంతో మరికొన్ని పరిశ్రమలు తెస్తాం. మంత్రి కేటీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే కేటీఆర్ లాంటి ఐటీ మినిస్టర్ ఇతర రాష్ట్రాల్లో కావాలని యువత కోరుకుంటుందని మంత్రి హరీష్ రావు ప్రశంసించారు. తెలంగాణ వొస్తే ఎలా ఉంటుందో అని చాలా అనుమానాలు క్రేయేట్ చేశారని, ఎవరైతే కేసీఆర్‌ని తిట్టారో ఆ నోళ్లే ఇప్పుడు కేసీఆర్‌ని మెచ్చుకుంటున్నాయన్నారు. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌లో పరిశ్రమలకు పవర్ హాలీడే ఇస్తున్నారని, గతంలో ఎందరో పాలించారని, విజన్ 2020 అన్నారు..హైటెక్ అన్నారు..కానీ వాళ్ళ వల్ల కానిది సీఎం కేసీఆర్ చేసి చూపించారన్నారు. దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుందని, తెలంగాణ ఆచరిస్తుందని, దాన్ని దేశం అనుసరిస్తుందని హరీష్ రావు అన్నారు. మరో సారి సీఎం కేసీఆర్‌ని గెలిపించి హ్యాట్రిక్ గెలుపు అందివ్వాలనీ అన్నారు.




