ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 29 : మంచితనం, మానవత్వం, దయాగుణం, సహాయతత్వం అనేవి ప్రతి ఒక్కరూ అలవర్చుకొని సమాజాభివృద్ధికి పాటుపడాలని తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాష్ అన్నారు. ఈ మేరకు మంగళవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ తెలంగాణ సిటిజెన్ కౌన్సిల్ స్వచ్ఛంద సేవా సంస్థ రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ రాజ్ నారాయణ ముదిరాజ్ ఆధ్వర్యంలో మదర్ తెరిసా జయంతి ముగింపు ఉత్సవాలను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఎదుటి మనిషి నీ ప్రేమించే, నిస్వార్ధంగా సేవ చేయడం ఎంత గొప్ప విషయమో ప్రపంచానికి చాటిన సెయింట్ మదర్ తెరిసా అని అన్నారు. తెలంగాణ శాసన మండలి సభ్యులు బుగ్గారపు దయానంద మాట్లాడుతూ అమ్మగా మదర్ తెరిసా మారిందని, ప్రపంచంలోనే అత్యుత్తమైన అవార్డు నోబుల్ ప్రైజ్ భారత దేశంలో అత్యుత్తమమైన అవార్డు భారతరత్న ఈ రెండును కైవసం చేసుకున్న మాతృమూర్తి మదర్ తెరిసా అని ఆమె సేవలను నీటి తరం ఆదర్శంగా తీసుకొని సమాజాభివృద్ధికి పాటుపడాలని అన్నారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ మాట్లాడుతూ పేదల పాలిట పెన్నిధి, అభాగ్యుల పాలిట ఆశాజ్యోతి, దిన జనులకు దయామయి అందరికీ అమ్మ మదర్ తెరిసా అని అన్నారు.



