షాద్ నగర్ ప్రజా తంత్ర జూలై 28: ఎడతెరిపి లేని వర్షాలతో.. శిధిలావస్థలో ఉన్న ఇల్లు నేలమట్టమై అల్లాడుతున్న జనాలను ఆదుకునేందుకు నేతలే దాతలుగా అడుగు ముందుకు వేస్తున్నారు.. తోచినంత సహకారాన్ని బాధితులు తమ ఇళ్లను పునరుద్ధరించుకునేందుకు అందిస్తూ తమ ఔదార్యాన్ని కనబరుస్తున్నారు. షాద్ నగర్ నియోజకవర్గంలో ఈ దృశ్యం కనిపిస్తుంది. ఈ వ్యవహారంపై ముందుగా ముందడుగు వేసిన టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ ఇల్లు కూలిన బాధిత కుటుంబాలకు 25వేల రూపాయల నుండీ 10000 రూపాయల చొప్పున సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. ఈ క్రమంలో ఫరూక్ నగర్ కేశంపేట, నందిగామ, కొత్తూరు, చౌదరీగూడ, కొంధుర్గు మండలాల్లోని తదితర గ్రామాల్లో పర్యటించి ఇల్లు కూలిన బాధితులతో మాట్లాడి తక్షణ సాయాన్ని అందించారు. జరిగిన నష్టాన్ని బట్టి రూపాయలు పది నుంచి 25 వేలు సాయం అందించారు. నియోజకవర్గంలో మొట్టమొదటి నుండి విల్లపల్లి శంకర్ తన వంతు ఆర్థిక సహకారాన్ని అందిస్తూ వస్తున్నారు కూలినయులకు డబ్బులు ఇస్తూ మొదట రెండు సృష్టించారు ఇప్పుడు ఆ కోవలోనే మిగతా నాయకులు కూడా వెళ్తున్నారు. ఇదే బాటలో బిజెపి నేత పాలమూరు ట్రస్ట్ చైర్మన్ పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి కూడా అడుగు ముందుకు వేశారు. బాధిత కుటుంబాలకు ఒక్క కుటుంబానికి తక్షణసాయంగా 5000 రూపాయలు అందించేందుకు ఆయన ముందుకు వచ్చారు. నియోజకవర్గంలో మొత్తం 50 ఇండ్లకు బాధితులు ఒక్కొక్కరికి 5000 చొప్పున ఆయన పంపిణీ చేయడం విశేషం. అంతేకాకుండా నాయకులు ఎవరూ ఇళ్లల్లో కూర్చోవద్దని బాధితులకు సాయం చేసేందుకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. మరోవైపు అధికార పార్టీ నుంచి ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఎప్పటికప్పుడు సమస్యలు తెలుసుకోవడమే కాకుండా ఇల్లు కూలిన వారికి భరోసా కల్పిస్తూ గృహలక్ష్మి పథకం కింద ఒక్కో కుటుంబానికి మూడు లక్షల రూపాయల చొప్పున అందించేందుకు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అన్ని గ్రామాలలో బీఆర్ఎస్ నాయకులు అప్రమత్తంగా ఉండి సమస్యలు తన దృష్టికి తేవాలని, అవసరమైతే తాము కూడా స్వయంగా వారికి సహకారం అందించాలని ఎమ్మెల్యే సూచించారు. నాయకులంతా ఒక్కొక్కరు ఒక్కో పార్టీ నుంచి ముందడుగు వేసి వరద బాధితులను ఆదుకునేందుకు చిత్తశుద్ధితో పనిచేయడం ప్రశంసలు అందుకుంటుంది. వర్షాలు తగ్గి పరిస్థితి సాధారణ దశకు వచ్చేదాకా ప్రజలకు అండగా ఉంటామని ఆయా పార్టీల నేతలు ప్రకటించడం అభినందనీయం. ఇది ఎన్నికల ట్రెండా ? లేక ఇంకేమైనా కారణాలా ? ఏవైనా కావచ్చు. కానీ నాయకులు మాత్రం తమదైన శైలిలో చురుకుగా సాయం అందించేందుకు ముందుకు కదులుతున్నారు. ఈ సాయం పరంపర ఇలాగే కొనసాగితే బాగుంటుందని గ్రామాల్లో ప్రజలు కోరుకుంటున్నారు. ఎన్నికలకు ముందు హడావుడిగా ఇలా వ్యవహరించినట్టు మిగతా సమయంలో కూడా అలాగే వివరించాలని సూచిస్తున్నారు. ఎంతైనా దేవుడంటే సాయమేరా తమ్ముడు.. కానివ్వండి!




