చేసిన వాగ్దానాలు నిలుపుకుంటే పోటీ చేయనని ఒకరు…
రాజీనామా చేస్తానని మరొకరు
విపక్షాలకు ఆరళ్లుగా కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న కొలది రాజకీయ ప్రత్యర్థుల మధ్య సవాళ్ళు.. ప్రతిసవాళ్ళు పెరిగిపోతున్నాయి. అది రాజకీయ నేతల భవిష్యత్‌ను నిర్ణయించే వరకూ వెళుతున్నాయి. ప్రజలకు చేసిన వాగ్ధానాలను అన్న సమయంలో నెరవేర్చిన పక్షంలో తన ఎంఎల్‌ఏ పదవికి రాజీనామా చేస్తానని ఒకరంటే, అసలు తాను ఈ ఎన్నికల్లో పోటీ చేయనని మరొకరు దేవుళ్ళపైన ఒట్టుపెట్టుకుంటున్నారు. ఈ వివాదం బిఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య తారస్థాయికి చేరిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో అధికారంలోకి వొచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్, పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజలకిచ్చిన మాట ప్రకారం ఒక్కో గ్యారంటీని అమలు పరుస్తూ వొస్తుంది. అదే విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి పార్లమెంటు ఎన్నికల ప్రచార సభల్లో ఎలుగెత్తి చాటుతున్నాడు. తామిచ్చిన మాట ప్రకారం ఇప్పటి వరకు అయిదు గ్యారంటీలు అమలు పర్చామని, చివరి గ్యారంటీకి సమయం సరిపోలేదంటున్నాడు. పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ రావడంతో దాన్ని వాయిదా వేసుకోవాల్సి వొచ్చిందని, ఎన్నికల తంతు పూర్తికాగానే రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల వరకు రుణమాఫీని వెంటనే అమలు పరుస్తామని చెబుతుండగా, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం తప్ప మరేది సక్రమంగా అమలు కావడం లేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ విషయంలో బిఆర్‌ఎస్ కాస్త దూకుడుగానే ముందుకెళుతుంది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు, సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్నట్లు ఆగస్టు 15లోగా చేసిన వాగ్దానాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని వాదిస్తున్నాడు. ఆరు గ్యారంటీలతో పాటు, రైతుల రుణమాఫీని ఏకమొత్తంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయగలిగితే తాను తన పదవికి రాజీనామా చేయడమే కాదు..తర్వాత ఎన్నికల్లో కూడా పాల్గొననని శపథం చేశాడు. దానిపై గత శుక్రవారం అమరవీరుల స్థూపం వద్ద రాజీనామా లేఖను మేధావులకు అందజేసి, రేవంత్‌రెడ్డిని తన సవాల్‌ను స్వీకరించి, ఆయన రాజీనామాను కూడా మేధావులకు అందజేయాల్సిందిగా డిమాండ్ చేశాడు. అయితే హరీష్‌రావు రాజీనామా లేఖ కేవలం లేఖ మాత్రమేనని, అది రాజీనామ ఫార్మెట్‌లో ఇవ్వలేదని కాంగ్రెస్ ఆరోపించడంతో తాను నిజంగానే రాజీనామా ఫార్మాట్‌లో అందజేస్తానని హరీష్ రావు ప్రకటించారు. ఇదే విషయంపై బిజెపీ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కూడా రేవంత్ రెడ్డికి మరో సవాల్ విసిరారు. ఆరు గ్యారంటీలను ప్రజలకిచ్చిన మాట ప్రకారం వంద రోజుల్లో అమలు చేసినట్లు కాంగ్రెస్ నిరూపిస్తే తాను ఎన్నికల బరిలో నుండి తప్పుకోవటమే కాదు, హస్తం పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని సంచలన ప్రకటన చేశారు. నిజంగానే తన సవాల్‌ను స్వీకరించే ధైర్యమే ఉంటే మహిళకు నెలకు 2500 ఇస్తామన్న సొమ్మును ఏ మహిళ ఖాతాల్లో వేసారో నిరూపించాలని ఆయన సవాల్ చేశారు. అలాగే ఆసరా పెన్షన్లు మొదలు కాంగ్రెస్ ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలను అమలు చేసినట్లు రుజువులు చూపించాల్సిందేనంటాడు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నిటినీ ఆగస్టు 15లోగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తే తాను ఎంఎల్‌ఏ పదవికి రాజీనామా చేయడమే కాదు, రాజకీయ సన్యాసం తీసుకుంటానని బిజెపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సవాల్ చేశారు. అంతేకాదు తన రాజీనామాకు సంబంధించి ఓపెన్ లెటర్ హెడ్‌ను గాంధీ భవన్‌కు పంపిస్తున్నానన్నారు. ఆలాగే స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా రాసి పెట్టుకోవాలని ఆయన సిఎం రేవంత్‌రెడ్డికి ఛాలెంజీ విసిరారు. అక్కడితోనే ఆగకుండా కాంగ్రెస్ చెబుతున్న 14 ఎంపీ స్థానాలను గెలువకుంటే కూడా సిఎం తన పదవికి రాజీనామా చేస్తాడా అని ఆయన ప్రశ్నించారు. కాగా మరో బిజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ప్రస్తుత మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కూడా మరో సంచలన ప్రకటన చేశారు. కాంగ్రెస్ అంటున్నట్లు ఆగస్టు 15న రైతు రుణమాఫీ అమలు చేసే విషయంలో హైదరబాద్‌లోని ప్రభుత్వ భూములు అమ్మకుండా అమలు చేయాలని రేవంత్‌రెడ్డికి షరతు విధించారు. అతి తక్కువ సమయంలో ప్రజల విశ్వాసాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కోల్పోతున్నదని ఆయన పేర్కొన్నారు. ఇలా కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు విపక్షాల ఆరళ్ళుగా మారింది.
-మండువ రవీందర్‌రావు
సీనియర్ జర్నలిస్ట్





