సర్వేంద్రియానాం నయనం ప్రధానం

  • కంటి చూపుకు ఢోకా రాకుండా ‘కంటి వెలుగు’ ద్వారా పరీక్షలు
  • రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌ ‌రావు
  • సరోజినీ దేవి హాస్పిటల్‌లో ఫ్యాకో మెషిన్లు ప్రారంభించిన మంత్రులు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 28 : ‌సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు..అంతటి ముఖ్యమైన కళ్లు సరిగ్గా కనిపించకపోవడం వల్ల ఎంతో మంది ఇబ్బంది పడుతుంటారని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. కెసిఆర్‌ ఆదేశాలతో కంటి సమస్యలు లేకుండా, రాకుండా కంటి వెలుగు పథకాన్ని చేపట్టామని అన్నారు. స్కూల్‌కు వెళ్లే విద్యార్థి నుంచి, పండుముసలి వరకు కంటి సమస్యలతో బాధపడుతుంటారని చెప్పారు. చిన్న సమస్యే కదా అని వదిలేస్తూ.. కాలం గడుపుతుంటారని, చివరకు అది పెద్ద సమస్యకు దారి తీస్తుందన్నారు. దీన్ని దృష్టిలోఉంచుకొని సీఎం కేసీఆర్‌ ‌కంటి వెలుగుఅనే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టి, విజయవంతంగా అమలు చేశారని వెల్లడించారు. బుధవారం హైదరాబాద్‌లోని సరోజినీదేవి కంటి దవాఖానలో ఫ్యాకో మెషీన్లను మంత్రి మహమూద్‌ అలీతో కలిసి హరీష్‌ ‌రావు ప్రారంభించారు.

ఈ సందర్భంగా హరీష్‌ ‌రావు మాట్లాడుతూ.. కంటి సమస్యలతో బాధపడుతున్న పేదలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలన్న సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఈ యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. కాటరాక్ట్ ‌సర్జరీల నిర్వహణలో ఈ అత్యాధునిక యంత్రాలు ఎంతో సహాయం చేస్తాయని తెలిపారు. అల్టాస్రౌండ్‌ ‌పరిజ్ఞానంతో పనిచేసే వీటి ద్వారా సర్జరీలు సులభంగా, వేగంగా చేసేందుకు అవకాశం లభిస్తుందని, సర్జరీ తర్వాత రోగులు కూడా తొందరగా కోలుకుంటారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12 ఫ్యాకో యంత్రాలను ఏర్పాటు చేశామని, వీటన్నింటినీ ఇప్పుడు ఒకేసారి ప్రారంభించుకున్నామని వెల్లడించారు. సరోజినీదేవి కంటి హాస్పిటల్‌లో కూడా రెండు మెషిన్లు ఏర్పాటు చేశామన్నారు. మలక్‌పేట ఏరియా హాస్పిటల్‌లో, మహబూబ్‌గర్‌, ‌వరంగల్‌, ‌నిజామాబాద్‌, ‌సంగారెడ్డి, ఆదిలాబాద్‌, ‌కరీంనగర్‌, ‌వికారాబాద్‌, ‌నల్లగొండ, ఖమ్మం జిల్లాలో ఒక్కో యంత్రం అందుబాటులోకి వొచ్చాయని చెప్పారు. ఒక్కో ఫ్యాకో యంత్రం ఖరీదు రూ.28.85 లక్షలు అనీ, మొత్తంగా 12 యంత్రాలకు కలిపి ప్రభుత్వం రూ.3.46 కోట్లు ఖర్చు చేసిందని వెల్లడించారు.

ప్రైవేటులో రూ.30 నుంచి రూ.40 వేలు అయ్యే సర్జరీ పేదలకు ఉచితంగా అందనుంది. సర్జరీ నిర్వహించడానికి వైద్య సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇప్పించాం. కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా కంటి సమస్యలు గుర్తించిన వారికి ఈ ఫ్యాకో మిషన్ల ద్వారా అవసరమైన చికిత్స అందనుంది. అంధత్వ రహిత తెలంగాణ సాధన కోసం ప్రారంభించిన కంటి వెలుగు.. రెండు దఫాల్లో విజయవంతంగా పూర్తి చేశామన్నారు. ఎవరూ అడగకముందే, ఇంటి పెద్దకొడుకుగా ఆలోచించిన కేసీఆర్‌ ‌ప్రజల కంటి సమస్యలను దూరం చేసేందుకు ఈగొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు.

‘గ్రామాలకు వైద్య సిబ్బంది వొచ్చి…ఉచితంగా పరీక్షలు నిర్వహించి, అద్దాలు అందించే కార్యక్రమం ప్రపంచంలో తెలంగాణలో మినహా మరెక్కడా లేదు. 100 పని దినాల్లో కోటి 62 లక్షల మందికి కంటి పరీక్షలు చేశారు. ఇందులో దృష్టి లోపంఉన్న 40.59 లక్షల మందికి అంటే 25.1 శాతం మందికి అద్దాలు పంపిణీ చేశారు. అందులో 22.51 లక్షల మందికి ఉచితంగా కళ్లద్దాలు, మందులు అందించాం. 18.08 లక్షల ప్రిస్కిప్షన్‌ ‌గ్లాసెస్‌ ‌కూడా ఉచితంగా పంపిణీ చేశాం. ఇంత పెద్ద మొత్తంలో కంటి పరీక్షలు నిర్వహించి, కళ్లద్దాలు, మందులు పంపిణీ చేసిన ఘనత బీఆర్‌ఎస్‌కుకు తప్ప ప్రపంచంలో మరే ప్రభుత్వానికి లేదు. కంటి పరీక్షల్లో మాది ఆల్‌ ‌టైమ్‌ ‌రికార్డ్’ అని మంత్రి హరీష్‌ ‌రావు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *