సమైక్య పాలనలో చిన్నచూపునకు గురైన ఆలయాలు

  • నేడు అద్భుతంగా తీర్చిదిద్దుతున్న సిఎం కేసీఆర్‌
  • ‌కేసీఆర్‌ ఇచ్చిన ప్రాధాన్యత మరే సిఎం ఇవ్వడం లేదు
  • సిద్ధిపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో అయ్యప్పపడి పూజలో పాల్గొన్న మంత్రి హరీష్‌రావు

సిద్ధిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 8: ‌సమైక్య పాలనలో తెలంగాణలో ప్రాంతంలోని ఆలయాలన్నీ చిన్నచూపునకు గురైతే…తెలంగాణ ఏర్పడి కేసీఆర్‌ ‌సిఎం అయ్యాక సమైక్య పాలనలో చిన్నచూపునకు గురైన ఆలయాలన్నింటినీ అద్భుతమైన రీతిలో తీర్చిదిద్దుతున్నారనీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. గురువారం సిద్ధిపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన అయ్యప్ప పడి పూజ, భిక్ష(భోజనం)కార్యక్రమం మంత్రి హరీష్‌రావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు అయ్యప్పపడిపూజలో పాల్గొన్న అనంతరం మాట్లాడుతూ…ఆలయాలకు సిఎం కేసీఆర్‌ ఇచ్చిన ప్రాధాన్యతను దేశంలో మరే ముఖ్యమంత్రి ఇవ్వడం లేదన్నారు.  ఇరిగేషన్‌ ‌ప్రాజెక్టులకు, జోన్లకు, జిల్లాలకు  ఆలయాలు, దేవుళ్ల పేర్లు పెట్టిన ఘనత కూడా కేసీఆర్‌దేననీ అన్నారు.

అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలనీ,  సంకల్ప సిద్ది గల ప్రాంతం  సిద్ధిపేట అని,  సకల దీక్షలకు… మాలదారణ ప్రసిద్దిపేట అన్నారు. అయ్యప్ప స్వామి కారణ జన్ముడనీ,  ముల్లోకాలను ముప్పుతిప్పలు పెట్టిన మహిషి అనే రాక్షస మహిళను సంహరించి కోట్లాది మందికి దేవుడయ్యాడన్నారు.  ఎక్కడో కేరళ రాష్ట్రంలోని 18 కొండల ఎగువన వెలసిన అయ్యప్ప స్వామి నేడు మన ఇంటి దేవుడుగా మారాడనీ అంటే మహిమ, మహత్యం ఉన్నవారిని మనసుతో ఆరాధిస్తే అన్నీ సత్ఫలితాలే ఉంటాయనడానికి అయ్యప్ప పూజలే నిదర్శనమన్నారు.  నియమనిష్టలకు, క్రమశిక్షణకు, ఆధ్యాత్మిక ప్రశాంతతకు అయ్యప్ప మాలధారణ పెట్టింది పేరు అని చెప్పొచ్చన్నారు. ఉదయాన్నే 4 గంటలకు నిద్రలేచి సూర్యోదయానికి ముందే పూజలు, ఒంటి పుట భోజనం, నల్లటి దీక్షా వస్త్రాలు, కటిక నేలపై నిద్ర, రోజంతా స్వామివారి జపంతో 41రోజుల పాటు మండల దీక్ష చేయడం ఆషామాషీ కాదన్నారు. ఇదంతా ఒక ఎత్తయితే దీక్ష విరమణకు 80 కిలో మీటర్ల పెద్ద పాదం నడిచి శబరి వెళ్లడం మరో ఎత్తు అని, చిన్న పాదం నడకలోనూ మీకు ఎన్నో ఆటంకాలు ఉన్నా స్వామి దరి చేరుతున్నారన్నారు.

సిద్దిపేటకు ఒక ప్రత్యేకత ఉందనీ, చాలా ప్రాంతాల్లో ఒక్కో దీక్ష మాత్రమే చేపడతారు. కానీ, సిద్దిపేట హనుమాన్‌ ‌ధీక్షలో ఫస్ట్, అయ్యప్ప ధీక్షలో కూడా ఫస్ట్. ‌హనుమాన్‌ ‌దీక్ష సమయంలో ఎటు చూసినా కాషాయ వస్త్రాలు ధరించిన స్వాములే కనిపిస్తారు. ఇప్పుడు పెద్ద సంఖ్యలో నల్ల వస్త్రాలు ధరించిన అయ్యప్ప స్వాములు దర్శనమిస్తున్నారు.  ఇంకా దుర్గా మాత దీక్ష, గణేష్‌ ‌దీక్ష, శివ దీక్ష, వేణుగోపాల స్వామి దీక్షలు కూడా పాటిస్తున్నారన్నారు. సిద్ధిపేట ప్రజలు పూజించని దేవుడు లేడనీ, పాటించని దీక్ష లేదు అంటే అతిశయోక్తి కాదన్నారు.  ఈ ఆధ్యాత్మికత వల్లనే నేడు సిద్ధిపేట ప్రాంతం అభివృద్ధిలో విలాసిల్లుతుందనీ,  నిన్నటికి నిన్న 14 రోజుల పాటు కాల చక్ర యాగం కన్నుల పండుగగా నిర్వహించారనీ మంత్రి హరీష్‌రావు గుర్తించారు. పడి పూజ అనంతరం మంత్రి హరీష్‌రావు అయ్యప్పసాములకు స్వయంగా భిక్ష(భోజనం)వండించారు. ఈ మహాపడి పూజలో వందలాది సంఖ్యలో అయ్యప్పస్వాములు, భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *