- అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస
- ప్రధాని మోడీ, సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ తదితరుల సంతాపం
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ (82) కన్నుమూశారు. గతకొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. వారం రోజులుగా ఆయనను ఐసీయూలో ఉంచి, చికిత్స అందిస్తున్నారు. ములాయం మరణవార్తను ఆయన తనయుడు అఖిలేశ్ యాదవ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ములాయం మూడుసార్లు పని చేశారు. అలాగే కేంద్రంలో రక్షణ మంత్రిగానూ సేవలందించారు. 1967లో యూపీ శాసనసభకు తొలిసారిగా ఎన్నికయ్యారు. 1939, నవంబర్ 22న ఆయన జన్మనించారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేతగా దేశ రాజకీయాలపై చెరగని ముద్రవేశారు. రాం మనోహర్ లోహియా వంటి మహానేతల మార్గ దర్శకత్వంలో రాజకీయ ఓనమాలు నేర్చుకున్న ఆయన.. ఉత్తరప్రదేశ్ ప్రజలు ’నేతాజీ’ అని పిలుచుకునేంత ఖ్యాతిని ఆర్జించారు. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. సుదీర్ఘకాలం పాటు యూపీకి సీఎంగా సేవలందించారు. అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో 19 నెలల పాటు జైలుజీవితాన్ని అనుభవించారు. రాజకీయ జీవితంలో పదిసార్లు ఎమ్మెల్యేగా, ఏడుసార్లు ఎంపీగా గెలుపొందారు. 1977లో తొలిసారిగా మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1980లో యూపీలోని లోక్‌దళ్ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1992లో సమాజ్‌వాదీ పార్టీని స్థాపించారు.
1989లో తొలిసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. 1993లో రెండోసారి, 2003లో మరోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. 1996లో మొయిన్‌పురి నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికై.. యునైటెడ్ ఫ్రంట్ సంకీర్ణ ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా పనిచేశారు. ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎంపీ ములాయం సింగ్ యాదవ్ అకాలమరణం పట్ల ప్రధాని మోడీ దిగ్భ్రాతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ములాయం మరణం పట్ల ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. తాము ముఖ్య మంత్రులుగా పనిచేసిన సమయంలో అనేక సార్లు ములాయం, తాను సంభాషిచుకున్నామని ప్రధాని మోడీ గుర్తు చేసుకున్నారు. తమ ఇద్దరి మధ్య సన్నిహిత సహవాసం కొనసాగిందన్నారు. తాను ఎల్లప్పుడూ ఆయన అభిప్రాయాలను వినడానికి ఆసక్తి కనబర్చినట్లు చెప్పారు. ములాయం మరణం తనను బాధిస్తోందన్నారు. ఆయన కుటుంబానికి, లక్షలాది మంది మద్దతుదారులకు ప్రధాని సానుభూతి తెలిపారు. ఓం శాంతి అని ట్వీట్ చేశారు. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాతి వ్యక్తం చేశారు.
దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ కు మూడుసార్లు ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన ములాయం తన జీవితకాలం పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసమే పని చేశారని కొనియాడారు. ములాయం కుమారుడు అఖిలేష్ యాదవ్, వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రముఖ సోషలిస్టు నాయకులు రామ్ మనోహర్ లోహియా, ప్రముఖ స్వతంత్ర సమరయోధులు రాజ్ నారాయణ్ వంటి గొప్ప నేతల స్ఫూర్తితో ములాయం సింగ్ యాదవ్ రాజకీయాల్లోకి వచ్చారని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల మంత్రి కేటీఆర్ సంతాపం తెలియజేశారు. ఆయన మృతితో భారత రాజకీయాల్లో ఒక శకం ముగిసింది అన్నారు. ములాయం కుమారుడు అఖిలేష్ యాదవ్, ఇతర కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సమాజ్‌వాదీ పార్టీ నాయకులు, విధేయులందరికీ బలం చేకూర్చాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.



