సమాచార శాఖపై మంత్రి పొంగులేటి సమీక్ష

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 14 : ప్రభుత్వ పథకాల పట్ల ప్రజలను చైతన్య వంతులను చేయడంలో సాంప్రదాయ ప్రచార మాధ్యమాలతో పాటు  సోషల్‌ మీడియా వింగ్‌ను విస్తృత స్థాయిలో ఉపయోగించుకోవాలని అధికారులను రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహనిర్మాణ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆదేశించారు. తెలంగాణ మాస పత్రికను  మరింత ప్రామాణికమైన పత్రికగా తీర్చి దిద్దడంతోపాటు పత్రికను రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, ప్రజా ప్రతినిధులకు, సామాన్య ప్రజానీకానికి అందుబాటులోకి తేవాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంలో సమాచార శాఖ కీలక పాత్ర వహించాలని అన్నారు. గురువారం డా.బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో సమాచార శాఖ పనితీరును సంబంధిత అధికారులతో మంత్రి సమీక్షీంచారు.

ఈ సందర్బంగా సమాచార శాఖలో వివిధ విభాగాల పనితీరును మంత్రి సమీక్షించారు. ప్రింట్‌ మీడియా, అవుట్‌ డోర్‌ విభాగం చేపట్టిన కార్యక్రమాలపై ఆయన సమీక్షించారు. జర్నలిస్టుల సంక్షేమం, క్షేత్ర స్థాయిలో ప్రచార నిర్వహణపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. సమాచార శాఖ పనితీరును మెరుగు పర్చాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా సమాచార శాఖతో పాటు మీడియా అకాడమీ చేపట్టిన కార్యక్రమాలపై సమాచార కమిషనర్‌ అశోక్‌ రెడ్డి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా మంత్రికి వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో ఇంకా సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్‌ రాజమౌళి, అడిషనల్‌ డైరెక్టర్‌ నాగయ్య, జాయింట్‌ డైరెక్టర్లు జగన్‌, శ్రీనివాస్‌, వెంకటరమణ, డిప్యూటీ డైరెక్టర్లు మధు సూధన్‌, హాష్మి, రాజా రెడ్డి, సురేష్‌, చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఇంజనీర్‌  రాధా కిషన్‌, ప్రాంతీయ సమాచార ఇంజనీర్‌ జయరామ్‌ మూర్తి, రాములు, అకౌంట్స్‌ ఆఫీసర్‌ పద్మ కుమారి, పలువురు అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *