హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 29 : తాము కట్టుకున్న ప్లాట్లలో నిర్మాణాలను తన అనుచరులతో కూల్చివేయడంతో పాటు గత పది సంవత్సరాలుగా ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి మంచిర్యాల ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రేమ్ సాగర్ రావు ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆరోపిస్తూ ఉద్యోగ్, దళిత బహుజన ప్లాట్ ఓనర్స్ సొసైటీ ప్రధాన కార్యదర్శి జి.గోపాల్ రావు, సభ్యులు శుక్రవారం డిప్యూటీ సీఎం నివాసంలో కలిసి వినతి పత్రం అందచేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన మల్లు బట్టి విక్రమార్కను శాలువా, పూలమాలలతో సత్కరించారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చేసిన భూ కబ్జా పత్రాలు, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన సమగ్ర నివేదికను డిప్యూటీ సీఎంకు అందజేశారు. ఈ సందర్బంగా గోపాల్ రావు మాట్లాడుతూ మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా సరిహద్దుల్లోని కాప్రా రెవిన్యూ డివిజన్ పరిధిలో గల వంపుగూడా గ్రామంలోని 62 ఏకరాల భూముల్లో వేసిన వెంచర్లో ప్లాట్స్ కొనుగోలు చేశామని తెలిపారు. ఈ భూముల సర్వే నెం.లు వరుసగా 639,643, 644, 647, 648, 654 ఉన్నాయని వెల్లడించారు. ప్లాట్లలో తాము కట్టుకున్న నిర్మాణాలను సైతం తన అనుచరులతో కూల్చివేశాడని డిప్యూటీ సీఎంకి వివరించారు. సమస్యను త్వరలోనే పరిష్కారిస్తానని డిప్యుటీ సిఎం హామీ ఇచ్చారని ఆయన తెలిపారు.
సమస్య పరిష్కరించాలని డిప్యూటీ సీఎం బట్టికి వినతి





