- ప్రభుత్వ బడుల్లో భారీగా విద్యార్థుల చేరికలు
- స్కూల్ యూనిఫామ్స్ లేకుండానే బడులకు..
- పుస్తకాలు లేకుండానే తరగతులు ప్రారంభం
- ఎస్‌సిఇఆర్‌టి సైట్ నుంచి పిడిఎఫ్ ద్వారా ఇంగ్లీష్ మీడియం బోధన
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు క్రమంగా పెరుగుతున్నాయి. కానీ సౌకర్యాల కల్పనలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదు. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ బడుల్లో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అరకొరగా ఇంగ్లీష్ మీడియంలో శిక్షణ ఇచ్చింది. ఒకవైపు ఉపాధ్యాయుల కొరత, ఇంకోవైపు విద్యా వాలంటీర్లను నియమించక పోవడం, మరోవైపు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం వల్ల విద్యార్థులకు సరైన విద్యా బోధన అందడం లేదు.వాస్తవానికి ఇంగ్లీష్ మీడియం బోధన ఇప్పటికి మొదలు కాలేదు. 45 రోజులు ఎబిసి పోగ్రాం అని, ఆ కార్యక్రమంలో బోధించాల్సినవి ఎస్‌సిఇఆర్‌టి సైట్ నుంచి పిడిఎఫ్ ద్వారా టీచర్లను బోధించమంటున్నారు. అరకొర సౌకర్యాలు, వివిధ రకాల సమస్యలతో విద్యార్థులకు బడులు స్వాగతం పలుకుతున్నాయి. పుస్తకాలు ఇంకా అందలేదు..స్కూల్ యూనిఫామ్స్ ఇవ్వలేదు..సరిపడా టీచర్లు, లేరు. పారిశుద్ధ్య కార్మికుల సమస్య అలానే ఉంది. సరిపడా ఎంఈఓలు, డీఈవో అధికారులు లేరు. ఇలాంటి సమస్యల నడుమ విద్యాసంవత్సరం ప్రారంభం అయ్యి నెల గడిచింది.
ప్రభుత్వ బడుల్లో భారీగా చేరిన విద్యార్థులు
రాష్ట్రంలో గత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగింది. 2.30 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పొందారు. ఈ విద్యా సంవత్సరం కూడా భారీగానే ప్రవేశాలు కొనసాగుతున్నాయి. కొరోనా నేపథ్యంలో ఆర్థికస్థోమత సరిగా లేకనో, సర్కారు బడిలోనూ విద్యను బాగా చెప్తారనే ఉద్దేశంతోనో..చాలా మంది తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్ల నుంచి సర్కారు బడులకు మార్చారు. కుటుంబాల ఆదాయాలు తగ్గడం, ప్రైవేట్లో ఆన్లైన్ తరగతులకూ భారీగా ఫీజులు వసూలు చేస్తుండడంతో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు గణనీయంగా పెరిగాయి. ప్రభుత్వ, ప్రైవేట్‌కు ఒకటే సిలబస్ ఉన్న నేపథ్యంలో ఫీజుల భారం మోయలేక తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కారు బడుల్లో చేర్పించారు.
విద్యార్థులు స్కూల్ యూనిఫామ్స్ లేకుండానే బడులకు..
గతేడాది కూడా విద్యార్థులకు యూనిఫామ్స్ ఇవ్వలేదు. ఈసారైనా బడులు ప్రారంభమయ్యే సమయానికి యూనిఫామ్స్ అందుతాయంటే అదీలేదు. ఎప్పుడు అందుతాయో కూడా తెలియని పరిస్థితి. రాష్ట్రంలోని 26,072 ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 24 లక్షల వరకు విద్యార్థులు చదువుతున్నారు. ఎనిమిదో తరగతి వరకు విద్యార్థులకు ఒక్కో యూనిఫామ్ కోసం ప్రభుత్వం దాదాపు ఆరువందలు రూపాయల చొప్పున ఇస్తుంది. మొత్తం విద్యార్థులకు అయ్యే ఖర్చులో 60 శాతం వరకు నిధులు కేంద్రమే ఇవ్వనుంది. ప్రభుత్వ బడుల విద్యార్థులకు యూనిఫామ్స్ కోసం దాదాపు 1.5కోట్ల మీటర్ల క్లాత్ అవసరం పడుతుంది. ఈ క్లాత్ పంపిణీ చేసేందుకు టెస్కోతో విద్యాశాఖ ఒప్పందం చేసుకుంది. ఆర్డర్ ఇవ్వడంలో ఆలస్యమవ్వడంతో యూనిఫామ్స్ పంపిణీలో ఆలస్యం కానుంది. ఇలా పంపించిన క్లాత్ జిల్లాల నుండి బడులకు చేరి విద్యార్థులకు యూనిఫామ్స్ పంపిణీ చేయాలంటే మరో రెండు నెలలు పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
పుస్తకాలు లేకుండానే తరగతులు ప్రారంభం
26 వేల ప్రభుత్వ, స్థానిక సంస్థలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీల్లో కలిపి 26 లక్షల వరకు విద్యార్థులు చదువుతున్నారు. వారి కోసం 2.10 కోట్ల పుస్తకాలు అవసరమవుతాయని విద్యాశాఖ అధికారులు అంచనా వేశారు. వాటిలో ఇప్పటి వరకు 40 లక్షల పుస్తకాలను మాత్రమే ముద్రించి జిల్లా కేంద్రాలకు పంపించారు. ఇంకా 1.70 కోట్ల పుస్తకాలను ముద్రించాల్సి ఉన్నది. దీన్ని బట్టి విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉన్నదో అర్థమవుతున్నది.
19 వేల పోస్టుల ఖాలీ..
విద్యాశాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో దాదాపు 19 వేల ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలున్నాయి. వీటి భర్తీ ఊసే లేదు.
ఊసే లేని విద్యా వాలంటీర్లు
2019-20లో 12,600 మంది విద్యా వాలంటీర్లు సేవలందించారు. కొరోనా నేపథ్యంలో పాఠశాలలు సరిగా నడవక 2020-21, 2021-22 విద్యాసంవత్సరాల్లో వాలంటీర్లను నియమించలేదు.
జాడేలేని ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు
ప్రభుత్వం ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులపై కొద్ది నెలలుగా అదిగో… ఇదిగో…అంటున్నా ఆ పక్రియ పూర్తయ్యే పరిస్థితి కనిపించటం లేదు. ముఖ్యంగా భాషాపండితుల పోస్టులను స్కూల్ అసిస్టెంట్లుగా ఉన్నతీకరించడంపై హైకోర్టులో కేసు నడుస్తుంది. దాన్ని అనుసరించి సాధారణ ఉపాధ్యాయ బదిలీలపై నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. రాష్ట్రంలో 2018లో చివరి సారిగా బదిలీలు జరిగాయి. ఉపాధ్యాయ బదిలీల కోసం వేలాది మంది ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్నారు.
పర్యవేక్షణాధికారులు లేక గతి తప్పుతున్న విద్యా వ్యవస్థ
ప్రభుత్వం 443 మండలాలకు మంజూరు చేసిన ఎంఈవో పోస్టుల్లోనూ కేవలం 17 మంది మాత్రమే రెగ్యులర్ ఎంఈవోలు పనిచేస్తున్నారు. మిగతా 426 ఎంఈవో పోస్టుల్లో ఇంచార్జీలే విధులు నిర్వహిస్తుండటం గమనార్హం. అలాగే రాష్ట్రంలో 72 రెవెన్యూ డివిజన్లుకు కేవలం 56 డిప్యూటీ డీఈవో పోస్టులను మాత్రమే మంజూరు చేసింది. ఈ 56 పోస్టు ల్లోనూ 4 గురు రెగ్యులర్ డిప్యూటీ డీఈవోలు పనిచేస్తుండగా, మిగిలిన పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల్లో డైట్, బీఈడీ కాలేజీ లెక్చరర్లను, ప్రొఫెసర్లను, అసిస్టెంట్ డైరెక్టర్లకు అదనపు బాధ్యతలను అప్పగించిన ఉన్నతాధికారులు చేతులు దులుపేసుకుంటున్నారు. ఇన్ చార్జిల పర్యవేక్షణ లోపంతో విద్యా వ్యవస్థ గాడి తప్పుతుంది.
ఆదర్శ ఉపాధ్యాయుల సమస్యలు
రాష్ట్రంలోని 194 ఆదర్శ పాఠశాలల్లో 2,863 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. 2013 జూన్లో నియమితులయ్యాక ఇప్పటివరకు వారికి బదిలీలు, పదోన్నతులు లేవు. సర్వీసు నిబంధనల విషయంలోనూ స్పష్టత లేదు.
కేజీబీవీ ఉపాధ్యాయుల సమస్యలు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 475 కేజీబీవీ పాఠశాలలు, 194 యూఆర్‌ఎస్ పాఠశాలల్లో సుమారు 1.50లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తుంటే, 12వేలకు పైగా బోధన, బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారు. మినిమమ్ పే స్కేల్ ఇవ్వకుండా, కనీసం ఉద్యోగస్తులుగా కూడా గుర్తించడం లేదని, పొరుగున ఉన్న కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీలో ఎక్కువ వేతనాలు అక్కడి టీచర్లు పొందుతున్న విషయం బహిరంగ రహస్యమే. సుప్రీమ్ కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అని చెప్పినప్పటికీ వాస్తవానికి అది కార్యరూపం దాల్చడం లేదని ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు. కేజీబీవీలలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉపాధ్యాయులు ఉద్యోగులను శాశ్వత పద్ధతిలో నియామకం చేసి రెగ్యులర్ ఉపాధ్యాయుల మాదిరిగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. హెల్త్ కార్డులు అందజేయాలి. బదిలీలకు అవకాశం కల్పించాలి. పదోన్నతులు కల్పించాలి.
ప్రచారానికే ‘మన ఊరు-మనబడి’ పరిమితం
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు-మనబడి’ కార్యక్రమం ప్రచారానికే పరిమితమైంది. రాష్ట్ర వ్యాప్తంగా నామమాత్రంగా పాఠశాలల్లో పనులు ప్రారంభమయ్యాయి. టెండర్లు పూర్తయినా చాలా బడుల్లో పనులే ప్రారంభం కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 18,240 ప్రాథమిక, 3,164 ప్రాథమికోన్నత, 4,661 ఉన్నత పాఠశాలలు కలిపి మొత్తం 26,065 స్కూళ్ల అభివృద్ధికి మూడేండ్లలో రూ.7,289.54 కోట్లను ప్రభు త్వం ఖర్చు చేయనుంది. అత్యధికంగా విద్యా ర్థులుండే 9,123 (35 శాతం) స్కూళ్లను మొదటి దశలో ఎంపిక చేసింది. వాటిలో మౌలిక వసతుల కల్పన కోసం రూ.3,497.62 కోట్లు ఖర్చు చేయడానికి ప్రతిపాదనలు తీసుకొన్నారు. కానీ ఇప్పటివరకు జిల్లాకు రెండు కోట్లు కూడా కేటాయించలేదు.ఈ కార్యక్రమం కింద 12 రకాల అంశాలను పటిష్టపరచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే పాఠశాలల కు అవసరమైన మౌలిక వసతుల కల్పన కోసం సరిపోయినన్ని నిధులు కేటాయించడం లేదు.
పారిశుద్ధ్య కార్మికులేరి?
పారిశుధ్య కార్మికులు లేకపోవడంతో ఉపాధ్యాయులే పాఠశాలల ఆవరణ, తరగతి గదులను శుభ్రం చేసుకోవాల్సి వస్తున్నది. పంచాయతీ, మున్సిపల్ కార్మికుల సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం ఆదేశించినా ఆచరణలో అది అమలు కావడం లేదు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యలు వెంటనే పరిష్కరించి ప్రభుత్వ పాఠశాలల పునర్వైభవానికి కృషి చేస్తుందని ఆశిద్దాం.
– పిన్నింటి బాలాజీ రావు,
టిపియుఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు



