సమగ్ర ఆదివాసీ అభివృద్ధి – రాజ్యాంగ పరిరక్షణే నా లక్ష్యం!

  • పేదరికం, కులవివక్ష ఇంకా కొనసాగుతున్నాయి
  • మా కమ్యూనిటీలో స్రీల పట్ల అంత వివక్ష లేదు
  • హాస్పిటల్‌ ‌వరకు వెళ్లేలోపే గర్భిణులు చనిపోవటం కలిచివేసింది
  • గూడానికి రవాణా వ్యవస్థ ఏర్పాటు నా ప్రధాన లక్ష్యం
  • మా దగ్గర కూడా ఆహార పంటలు పోయి వాణిజ్య పంటలు మొదలయ్యాయి
  • యూనివర్సిటీ కోసం పోరాటం కొనసాగిస్తూనే ఉన్నాం

 డెబ్బై ఐదేళ్ల స్వాతంత్య్ర భారతదేశంలో ఆదిలాబాద్‌ ‌పార్లమెంటు నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఒక ఆదివాసీ మహిళ పోటీలో వున్నారు. అందునా ఒక సామాజిక హక్కుల కార్యకర్త. రాజకీయం అనంగానే కుటుంబ వారసత్వం వైపో, ఆధిపత్య కులబలం వైపో, ఆర్థిక స్థితిగతుల వైపో చూపు సారించే ఈనాటి పరిస్థితుల్లో, ఇప్పటి వరకూ ఒక ఆదివాసీ గోండు సమూహం నుంచి ఉపాధ్యాయురాలిగా, సామాజిక హక్కుల కార్యకర్తగా వున్న ఆత్రం సుగుణ రాజకీయాల్లోకి రావటం వెనుక తన సమూహాన్ని విజ్ఞాన పథం వైపు, చదువు వైపు, సమగ్ర జీవన అభివృద్ధి వైపు రాజ్యాంగ బద్ధంగా తీసుకెళ్లాలనే ఆకాంక్ష బలంగా పనిచేసిందని చెబుతున్నారు. ఈ రంగంలోకి రావటం, లోక్‌ ‌సభ ఎన్నికలలో ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ ‌పార్టీ నుంచి అభ్యర్థిగా నిలబడటం తనకి అంత సులువైన విషయమేమీ కాదు. ఇన్నేళ్ల ప్రజా ఉద్యమాలతో మమేకమైన సుగుణ స్నేహశీలి, క్షేత్రస్థాయి ప్రజా అంశాల పట్ల అవగాహన వున్న వ్యక్తి. వేలాది మందిని ఒక్కమాటతో కదిలించగల నాయకురాలు. అనేక ప్రజా ఉద్యమాల సహకారం, మద్ధతు కూడగట్టుకున్న ఆత్రం సుగుణతో ‘ప్రజాతంత్ర ‘ దినపత్రిక తరఫున స్వతంత్ర జర్నలిస్ట్ ‌కె. సజయ సంభాషణ :

సజయ : నమస్తే సుగుణ. మీ బాల్యం, చదువు ఎలా సాగాయో చెప్పండి?

ఆత్రం సుగుణ : నమస్తే అక్క. చిన్నప్పటి నుంచి నా చదువు చాలా కష్టంగా కొనసాగింది. అమ్మ ఒక్కతే పనిచేయాల్సి వొచ్చేది. మేం నలుగురం. ఒక చెల్లె, ఇద్దరు తమ్ముళ్లు. నేనే ఇంట్లో పెద్ద. మాకేమీ వ్యవసాయం లేకుండే. సిర్పూరు పుల్లర బొగడగూడ గ్రామం మాది. నాన్న 2000లో చనిపోయాడు. ఆ తర్వాత అక్కడి నుంచి అంటే జన్నారం మండలం నుంచి తిమ్మాపూర్‌కి వలస రావటం జరిగింది. ఇక్కడికి వొచ్చిన తర్వాత చాలా కష్టమైపోయింది జీవితం. గడిచేది కాదు. అమ్మ పనిచేస్తేనే గడిచేది. నానమ్మ కూడా మాతోపాటే వుండేది. అమ్మ ఒక్కటే పనిచేయటం. పొద్దంతా పనిచేసి సాయంత్రం నూకలు కొనుక్కుని వొస్తుండేది మా అమ్మ. వొచ్చి గంజి కాసి మమ్మల్ని సాదేది. అట్లా జీవితం కొనసాగించేది. శని, ఆదివారాలు వొస్తే అమ్మతో కలిసి నేను కూడా పనికి వెళ్లేదాన్ని. అసలు ఆ జీవితం గుర్తు చేసుకుంటే మస్తు బాధ అనిపిస్తుంది. ఒకటే జత బట్టలు. ఇప్పుడైతే స్కూళ్ళల్లో బట్టలు ఇస్తున్నరు, మధ్యాన్నం భోజనం వుంది.

అప్పుడవేవీ లెవ్వు. అన్నీ మనమే చూసుకోవాలే. పుస్తకాలు కూడా మనమే కొనుక్కోవాల్సి వొచ్చేది. అంత కష్టంగా గడిచింది నా జీవితం. 8వ తరగతి వరకూ జిల్లా పరిషత్‌ ‌తపాలపూర్‌ ‌స్కూల్‌కి వెళ్లాను. మొత్తం స్కూల్‌లో నేనొక్కదానినే ఆదివాసీ గోండు అమ్మాయిని! ఆ తర్వాత నాకు మేరేజ్‌ అయింది. అప్పటికే భుజంగరావ్‌ ‌టీచర్‌గా చేస్తుండే! అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఏపీటీఫ్‌(ఆం‌ధప్రదేశ్‌ ‌టీచర్స్ ‌ఫెడరేషన్‌)‌లో మండలాధ్యక్షుడిగా వుంటుండే! అప్పుడు మా స్కూల్‌ ‌కి ఒకసారి వొచ్చారు. నాకు ఐడియా లేదుగానీ, భుజంగరావ్‌ అయితే నన్ను చూసిండట! అక్కడ అప్పుడు లచ్చయ్య సార్‌ అని సైన్స్ ‌టీచర్‌ ‌వుండే! ‘‘అమ్మాయి బాగా చదువుతుంది కానీ వాళ్లకు ఎల్లటం చాలా కష్టంగా వుంది, దానితో బడికి అడపాదడపా వొస్తుంది. మీరు పెళ్లి చేసుకోండి’’ అని ఆ సార్‌ ‌భుజంగరావ్‌ ‌కి చెప్పిండట! ఆ తర్వాత మా ఇంటికి వొచ్చి చూశారు. బాగా పేదరికం మాది. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పేదల కష్టాన్ని అర్థం చేసుకుంటుంది, ఆ విషయాల గురించి పనిచేస్తుంది, మంచిగా చదివిస్తాను అని అనుకున్నడట! పెళ్లి అయినంక తనే పై చదువులు చదివించిండు. పెళ్లి అయిన తర్వాత 9, 10 తరగతులు కంటిన్యూ చేశాను. తర్వాత ఇంటర్‌, ‌డిగ్రీ ఓపెన్‌లో చేశాను. తర్వాత బి.ఈడీ రెగ్యులర్‌గా చేశాను. తర్వాత 2008లో డిఎస్సీ రాశాను. దానిలో స్కూల్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం వొచ్చింది. రెండేళ్ల తర్వాత 2010లో పోస్టింగ్‌ ఇచ్చారు. ఇప్పటికీ పదమూడు సంవత్సరాల సర్విస్‌ అయింది. ఇప్పుడు నాకు ఇంకా పద్నాలుగు సంవత్సరాల సర్విస్‌ ‌వుంది.  

సజయ : సామాజిక వివక్షను ఎదుర్కున్నారా? ఆ సమస్యలను ఎలా అధిగమించారు? హక్కుల కార్యకర్తగా అనేక అంశాల మీద ఆదివాసులు మహిళలు, దళితులు, నిరుపేదలు, శారీరక వైకల్యం ఉన్నవారు, ట్రాన్స్ ‌జెండర్స్, ఆర్థికంగా వెనకబడిన వారు- ఇలా అనేక సామాజిక వర్గాల బాగు కోసం మీరు పోరాడారు! ఈ వర్గాల సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేయాలంటే అడ్డుపడే అంశాలు ఏమున్నాయని అనుకుంటున్నారు?

ఆత్రం సుగుణ : నాకు ప్రత్యక్ష అనుభవం కన్నా, మా తాత వాళ్లు ఎలా వివక్షను ఎదుర్కున్నారో చూసినా! మా తాత దొరల దగ్గర పనిచేస్తుండేది. శ్రీనివాసరావ్‌ ‌దొర అని వుండే, వాళ్లు వొస్తుంటేనే తలవంచి నిలబడాలే! తలపాగా తియ్యటం, చెప్పులు విడిచి నిలబడటం, చేతులు కట్టుకుని తలవంచి పనిచేసేది చూశాను. నేను చాలా చిన్నదాన్ని అప్పుడు, ఎందుకలా అని అర్థమయ్యేది కాదు. మా దగ్గర వాళ్లని అణిచివేయటం చూశాను. మా నానమ్మ, అమ్మ వాళ్లు కూడా కథలు కథలుగా చెప్పేది. ఇక్కడ వెలమ దొరల పాలన ఎక్కువ, అందర్నీ బానిసలుగానే చూసేవారు. ఇప్పటికీ కూడా దొరా అనే పిలిపించుకుంటారు. చేతులు కట్టుకోవాలి. ఆంధ్రాలో అయితే భూస్వాములు అంటారు, ఇక్కడ తెలంగాణలో దొరలనే అంటారు. ఆకాలంలో చాలా అరాచకాలు జరిగినాయట! వాటికి గురైన అప్పటి స్త్రీలు ఇంకా వున్నరని చెప్తరు కానీ, వాళ్లని బయటకు తీయొద్దు అని ఎవరూ ఆ విషయాలు పెద్దగా మాట్లాడరు!

గతం నుంచి చూసుకుంటే, ఇప్పటికీ కూడా పేదరికం, వివక్ష ప్రధాన కారణం అని నేననుకుంటాను. ఎందుకంటే ఒక దళిత్‌గా వుండి, ఒక పై స్థాయికి ఎదిగితే తనకి గౌరవం వుండటం చూస్తున్నాము. కానీ, అదే పేదరికంతో వుంటే అసలు వాల్యూ అనేదే లేదు. కులవివక్ష చాలా వుంటుంది. ఇంక మహిళ అయితే ఆ వివక్ష మరీ ఎక్కువ వుంటుంది. ఏమే పోసీ, రావే పోవే అంటూ ఎంతో చులకనగా చూసే పరిస్థితి వుంది. అయితే, మా ఆదివాసీలకు బయట సమాజం నుంచి వివక్ష వుంటుంది కానీ, మా కమ్యూనిటిలో అంత వివక్ష లేదు. స్త్రీని గౌరవిస్తరు. వాల్యు ఇస్తరు. ఈ మధ్య కాలంలో బయట సమాజపు పోకడలు నేర్చుకుంటున్నరు గానీ గతంలో ఇట్ల లేకుండే! భార్య- భర్త ఇద్దరూ ఈక్వల్‌గా పనిచేసుకుంటూ గౌరవం ఇచ్చుకునేది. మా దాంట్ల డామినేషన్‌ ‌చేయకపోతుండేది. చదువుకుంటున్నవాళ్లే పితృస్వామ్య వ్యవస్థ లక్షణాలను వంటబట్టించుకుంటున్నరు. గతంలో అలా లేకుండే, స్వేచ్ఛగా వుండేది.

ట్రాన్స్ ‌జెండర్స్, ‌శారీరక వైకల్యం ఉన్నవారు- ఈ వర్గాల మీద సమాజానికి ఎప్పుడూ చిన్నచూపే వుంది. చాలా వివక్ష ఎదుర్కుంటారు. ఇక్కడ మా ప్రాంతంలో కూడా హక్కుల సంఘాలు, మేధావులు పనిచేస్తుండ బట్టి కొంత మార్పు అయితే వొచ్చిందని చెప్పగలను. అయితే పూర్తిగా కాదు.

సజయ: పూర్వరంగంలో పేదలు, నిరుపేద ప్రజల హక్కుల గురించి ఆలోచించే వ్యక్తిగా, వారి కోసం అహర్నిశలు ఆలోచిస్తూ వారి అస్తిత్వం కోసం, అభివృద్ధి కోసం, వారి పిల్లల భవిష్యత్తు కోసం పనిచేసే మనిషిగా మీరు గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ప్రధాన స్రవంతి రాజకీయరంగంలో ప్రవేశించారు. ఈ తరుణంలో ఏ విషయాలు ప్రధానమైనవి అని మీరు అనుకుంటున్నారు?

ఆత్రం సుగుణ: నా మనసుని కలిచివేసిన సంఘటనల్లో ముఖ్యమైనవి, రోడ్డు లేక గర్భిణీలు, బాలింత స్త్రీలు హాస్పిటల్‌ ‌వరకూ వెళ్లలేక చనిపోవటం. ఈ ఉట్నూర్‌ ‌మండలంలోనే వర్షాకాలం వొస్తే నాలుగైదు గర్భిణీ మహిళల మరణాలు జరుగుతాయి. ఆ బాధ అసలు చెప్పలేనిది. ఉన్నత విద్య కోసం ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేయడం, ఆరోగ్య వ్యవస్థ నెలకొల్పటం- ఇవి నాకు చాలా ముఖ్యమైనవి. ఇక్కడ రక్తహీనత చాలా ఎక్కువ. హాస్పిటల్‌కి వెళ్లాలంటే వాళ్ల దగ్గర డబ్బు వుండదు. అతివృష్టి, అనావృష్టి. పంటలు సరిగా పండకపోవటం, తిండి సరిగా లేకపోవటం చాలా ఎక్కువ. మానవహక్కుల వేదిక నుంచి బాలగోపాల్‌ ‌గారు, ప్రొఫెసర్‌ ‌రమా మేల్కోటే ఇంకా చాలా మంది వొచ్చి ఈ ప్రాంతంలో ఆరోగ్యం విషయాల గురించి చర్చించి ఇక్కడి స్త్రీలలో రక్తహీనత అతి తీవ్రంగా వుందని వెల్లడిచేశారు. డబ్బులు లేక ప్రైవేట్‌ ‌హాస్పిటల్స్‌కి పోలేక, గవర్నమెంట్‌ ‌హాస్పిటల్స్‌లో డాక్టర్లు లేక, మందులు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కునేది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ కూడా అనేక సమస్యలు, అవే పరిస్థితులు అలానే వున్నాయి.

మేము యూనివర్సిటీ కొరకు చాలా పోరాడాము. గూడు, కూడు, ఆరోగ్యం, రవాణా ఇక్కడ ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరం. ఇవి వుంటేనే అభివృద్ధి అనేది జరుగుతుంది. పండించిన పంటను బయటకు తెచ్చి అమ్మాలన్నా గానీ, ఒక వస్తువును కొనుక్కోవాలన్నా గానీ రవాణా చాలా ముఖ్యమైన అంశం. ఇక్కడి అడవులను కాపాడుకుంటూ, వున్నటువంటి గూడాలకు సరైన రవాణా వేయాలనేది ఒక లక్ష్యం. రవాణా తప్పనిసరిగా వుండాలి. అప్పుడయితేనే ఆదివాసీ బతుకులు మారతాయి. తాము పండించిన పంటను బయట అమ్ముకోవటానికి అవకాశం వుంటుంది. రహదారి వుంటేనే 108 అంబులెన్స్‌లు గూడెం లోపలి వరకూ వెళ్లగలుగుతాయి.

గతంలో మావాళ్లు సహజసిద్ధంగా పండిన చాలా మంచి ఆహారం తీసుకునేది. రసాయనిక ఎరువులనేది అస్సలు వాడకపోయేది. పశువుల పెండతోనే ఎరువు తయారయ్యేది. అన్నీ సహజమైన పంటలు. జొన్నలు, కొర్రలు, సామలు, వూదలు, రాగులు, కందులు, సెనెగలు ఇలా వుండేవి. నీళ్లు ఎక్కువ లేకుండానే వరి పండించేది మా వాళ్ళెప్పుడూ! అన్నీ మంచి ఆహారం వుండేవి. ఆ తర్వాత ఏమైందంటే, ఆహార పంటలు పోయి, వాణిజ్య పంటలు వొచ్చాయి. పూర్తిగా పత్తి రావటం, దానికి రసాయనిక ఎరువులు వాడటం మొదలైంది. వాణిజ్య పంటల మీద మోజుతో ఆహార పంటలను పూర్తిగా నిర్లక్ష్యం చేయటం, బయట పండించినవాటిని కొనుక్కుని తెచ్చుకుని వీళ్లు తినటం. దీనివల్ల ఏమైందంటే, వాళ్లు పండించే ఆహార పంటలు కనుమరుగు అయిపోయాయి. రేషన్‌ ‌బియ్యం తినటం. పూర్తిగా పత్తే వేయటం మొదలు పెట్టారు. దీనితో వాళ్లు తినే ఆహారంలో చాలా మార్పులు వొచ్చాయి. ఇది అందరి ఆరోగ్యం మీద బాగా ప్రభావం చూపించి, రక్తహీనతకి దారితీసింది. దాంతోపాటు మంచినీళ్లు సరిగా లేకపోవటం, బయట నుంచి ఫెర్టిలైజర్స్‌తో పండించిన పంటను తినడం ఎక్కువవడం అన్నీ కలిపి ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా దారుణంగా మార్చాయి. ఇప్పుడు కొంచం మళ్లీ జొన్న పంట, సెనెగెలులోకి వొస్తున్నారు కానీ వాటికి కూడా రసాయన ఎరువులు వేసేస్తున్నరు. పాతకాలంలో సహజమైన పేడతోనే ఎరువు తయారు చేసుకునేవారు. ఇప్పుడలా కాదు. అన్నీ కొనడమే! ఆదివాసీ ప్రాంతాల్లో ఒకప్పుడు రైతు ఆత్మహత్యలు అనేవి లేవు. వర్షాలు తగ్గిపోవటం, ఎప్పుడైతే పత్తిలాంటి పంటలు పెరిగాయో అప్పటినుంచి ఆత్మహత్యలు కూడా మొదలయ్యాయి.

విద్య విషయంలో చూస్తే 10, ఇంటర్‌ ‌వరకూ చదివి ఆపేస్తున్నరు. ఇక అంతే. ఉద్యోగస్తుల పిల్లలు మాత్రమే పై చదువులకి వెళ్తున్నరు. ఇప్పుడు చాలామంది అమ్మాయిలు చదువుకోవటానికి ముందుకు వొస్తున్నారు. నా చిన్నప్పుడు మా మురిమడుగులో నేనొక్కదాన్నే అమ్మాయిని. మా తిమ్మాపూర్‌ ‌గ్రామంలో, పుల్లర గ్రామంలో నేనొక్కదాన్నే అమ్మాయిని చదువుకుంది. చదువు మీద మా వాళ్లు అందరికీ అంత అవగాహన లేకుండే! చదువుకునేవాళ్లు చాలా తక్కువ మంది వుండేది. అమ్మాయిలనయితే బయటకు తీసుకురాలేదు. 85లో అనుకుంటాను అంగన్వాడీ స్కూల్స్ ‌మొదలయ్యాయి. ఆశ్రమ స్కూల్స్ ‌కూడా దూరము. పల్లెల్లో లేవు. అమ్మాయిలను దూరం పంపించకపోయేది అప్పుడు. అందుకే అమ్మాయిలు చదువుకోకపోయేది. బయట సమాజంతో కలిసి లేరు. భాష కూడా ఒక సమస్యగా వుండేది. మా గోండు భాషకి అపుడే లిపి వుండేది అంటారు కానీ అది ఇప్పుడిప్పుడు ఓ పది సంవత్సరాల నుంచి లిపి బయటపడింది. కొంచెం ప్రచారంలోకి వొస్తుంది. లిపి అందుబాటులో వుంటే ఎక్కువమంది చదుకునేవాళ్ళేమో తెలియదు. ఇప్పుడు ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో 10, ఇంటర్‌, ‌డిగ్రీ ఇలా ఎంతో కొంత వరకూ చదివిన వాళ్లు ఒక్కరయినా వున్నారు. ఆశ్రమ స్కూల్స్‌లో చదువుతున్నారు. 10 అయిపోతుంది. 10 అయినంక ఇంటర్‌ ‌చేస్తున్నరు. ఇంటర్‌ అయినంక డిగ్రీ- అలా చేయాలంటే ఇంక ఇక్కడ ఏమీ వుండవు. హైదరాబాద్‌ ‌లేదా వేరే చోటికి వెళ్లాలి. అంత స్తోమత వుండదు. బయట వాతావరణంలో గిరిజనేతరులతో కలిసిపోవుడు కూడా అంత ఈజీగా వుండదు. చాలా తక్కువమందే పై చదువులకు వెళ్తున్నరు.

సామాన్య వ్యవసాయదారులైన ఆదివాసీల పిల్లలు తమ క్వాలిఫికేషన్స్ ‌పెంచుకోవటం లేదు. విద్య మాత్రం పూర్తిగా తక్కువగానే వుంది. కేజీ నుండీ పీజీ గానీ, కామన్‌ ‌స్కూల్‌ ‌విధానం గానీ ఏర్పాటు చేస్తే అన్ని వర్గాల, సమూహాల పిల్లలు వుంటారు కాబట్టి పిల్లలు ఒకరితో ఒకరు కలిసి నేర్చుకుంటారు. చదువు పెరుగుతుంది. నాణ్యమైన విద్య అందుతుంది. అందరూ కలిసి చదువుకోవటం వల్ల పిల్లలు ఒక శాస్త్రీయ ఆలోచనను పెంచుకోగలుగుతారు. ఇక్కడ ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే పిల్లలు ఉన్నత విద్యని అందుకుని ఇక్కడే ఉద్యోగాలు వొస్తే, ఈ ప్రాంతం అభివృద్ధిలోకి వెళుతుంది. యూనివర్సిటీ కోసం చాలా సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తూనే వున్నాము.

(ఇంకా వుంది…తరువాయి రేపు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *