‘‘నావియక్సు కిరణాల కళ్ళేమో – నాకేం తెలుసు, లోకమా ? కంటికి కనిపించిందంతా కైతగా రాసేస్తున్నాను’’ అన్న మహాకవి దాశరథి కృష్ణమాచార్య 1925 జూలై 22న తెలంగాణలోని వరంగల్ జిల్లా చిన్న గూడూరు (ఈ గ్రామమిప్పుడు మహబూబాబాద్ జిల్లాలో ఉంది) గ్రామంలో జన్మించాడు. చిన్నతనంలోనే పద్యాలు అల్లడం నేర్చిన ఈ కవి, రచయిత నిజాం ప్రభువును ఎదిరిస్తూ తన ధిక్కార స్వరం వినిపించారు. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అన్న దాశరథి తెలంగాణ విముక్తి కోసం కృషి చేశారు. ‘రైతుదే తెలంగాణము రైతుదే. ముసలి నక్కకు రాచరికంబు దక్కునే’ అని నిజామును గద్దిస్తూ, నిజాం రాజు బూజును తుడిచే బూజు కర్రే నా పద్యం అంటూ మనుష్యుల్లో చైతన్యాల్ని రగిలించారు. తెలంగాణము నా జన్మభూమియని గర్వంతో చెప్పుకున్న దాశరథి రుద్రవీణ మ్రోగించాడు. అగ్నిధార కురిపించాడు. పునర్నవంను ఆకాక్షించాడు. దీపము-చీకటి జ్ఞానానికి ప్రతీకలు అంటూ స్వాతంత్య్ర కాంక్ష, దేశభక్తితో అమృతాభిషేకం గావించాడు. మహాంద్రోదయాన్ని ఆశించాడు. పీడిత ప్రజల సమస్యలకు ప్రాధాన్యత ఇచ్చి ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడ బానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో అంటూ తన మనసులోని భావాలను ఆవేదనతో అక్షరీకరించారు.
ఎవరు కాకతి ! ఎవరు రుద్రమ ! ఎవరు రాయులు ! ఎవరు సింగన ! అంతా నేనే ! అన్నీ నేనే అలుగు నేనే ! పులుగు నేనే ! వెలుగు నేనే ! తెలుగు నేనే ! అంటూ తెలుగు జాతి ఆత్మ కథలాంటి పద్యాన్ని రాశారు. ‘ఎన్ని పుణ్యాలు చేసి జన్మించినావొ ! / ఈధరా భామినీ మధురాధరాన / అమృత మొలకించినావు నీ హలముతోడ, / హాలికా / వేనవేల దండాలు నీకు’ అంటూ హాలికుని గొప్పతనానిన స్తుతించారు. ఒక కాలమ్మున ఇద్ది దేవళము, / వేరొక్కప్డు దుర్గంబు, నే / డకటా జైలయి కానుపించెను, భవి/ష్యత్కాల మందెట్టి రూ/పకమున్ దాల్చునొ ! కాల చక్రగమన / స్వాభావికా వర్తక / ల్పకమై విద్యల కాలయంబె యగు నీ / బందీలె పాలింపగన్ అంటూ నిజామాబాద్ సెంట్రల్ జైలుకు సంబంధించి ‘ఇందుపుర దుర్గము’ అనే కవితలోను రాశారు. తరతరాల దరిద్రాల / బరువులతో పరుగెత్తే / నిరుపేదా ! విరుగుతోంది నీ మెడ / పెరుగుతోంది నీ గుండెల్లో దడ అంటూ నిరుపేదా ! నేనుకూడా / నీ కోసం ఆకలితో / చచ్చేనా ! నా కలాన్ని రూకలకై అమ్ముకొచ్చేనా ? / తరతరాల బరువులతో / విరుచుకుపడు నిరుపేదా ! / నిరీక్షించు / దివ్య నవ్య భవితవ్యానికి, / నిరీక్షించు అంటూ నిరుపేదల పక్షాన ఆలోచించి రాసిన కవిత నిరుపేదా ! చల్లని చమురుంటేనే / జ్వాలావళీ, కీలావళి, / ప్రజా బలం వుంటేనే ప్రభుత్వాలు, రాజ్యాలూ అంటూ ప్రజా బలం గొప్పతనాన్ని తెలిపారు దీపావళి అనే కవితా ద్వారా.
ఊహలకు సంగీతం చేర్చినంత తేలికగా ఉంటుంది మనస్సు కవిత్వంతో మునిగినప్పుడు అన్న దాశరథి గతాన్ని కాదనలేను / వర్తమానం వద్దనబోను / భవిష్యత్తు వదలుకోను, / కాలం నా కంఠమాల / నా పేరు ప్రజాకోటి / నా ఊరు ప్రజావాటి అంటూ కత్తిపట్టి గెలిచినట్టి / ఘనుడగు వీరుండెవ్వడు? మెత్తని హృదయం దాడికి తుత్తునియలు కానిదెవడు? / అజ్ఞానపు అడుసు కడిగి / అసలు విషయమెరుగండీ / ఘర్షణలో ఏనాటికి హర్షం లభియింపబోదు. నాపేరు ప్రజాకోటి / నా ఊరు ప్రజావాటి అంటూ ఘర్షణలు కాదు కావలిసింది మంచి హృదయం అనే సందేశాన్నిచ్చారు. నా పేరు ‘ప్రజాకోటి’ అనే కవితలో త్యాగధనుల కళేబరాల గద్దెలు / నేటి పాలకులకు మిద్దెలు / అంటూ అనాదిగా సాగుతోంది / అనంత సంగ్రామం / అనాథుడికీ, ఆ గర్భ / శ్రీనాధుడికీ మధ్య / సేద్యం చేసే రైతుకు / భూమి లేదు పుట్ర లేదు / రైతుల రక్తం తాగే జమీందార్లకె స్టేట్లు అంటూ పేదవాళ్ళకు ధనికులకు మధ్య తారతమ్యాన్ని విశ్లేషిస్తూ ఆవేదనతో రాసిన కవిత ‘జ్యోతిశ్చక్రం’.
మంచి చెడులను తెలియజెప్పి ఆలోచింపజేసే చైతన్యశీలి అయిన దాశరథి వుండడానికో సౌధం / వుండకపోయినాగానీ / ఆశాసౌధాన్నై నా అధిరోహిస్తే తప్పా ? అంటూ భవిష్యత్తు అనగానే / భయపడతారెందుకు ? / వర్తమానపు పునాదుల్లో / భవిష్యత్తు నా సౌధం. ఆశా సౌధ గోపురాన / అదిగదిగో ఇంద్ర ధనువు: /ఆ సౌధం నాకిటిలో / సామాన్యుడికి స్వాగతం అంటూ ఆశావహ దృక్పథంతో రాసిన కవిత ‘ఆశాసౌధం’. శాంతికి సంకేతాలై / సాగిపోవు పతాకాలు,/ నరునికి సత్యాన్ని గూర్చి / ఎరుకపరచు బాకాలు / అంటూ జ్ఞాతి వైరము లెరుంగవు, /జాతి భేదము లెరుంగవు, / ప్రీతిగూర్చునే గాని / భ్రీతి గూర్చవెవ్వరికి అంటూ సరిహద్దులు తెలియనట్టి / విరిసిన హృదయం నాటిది / భాష రాకపోయినను / వాటి గుణమెమేటిది అంటూ పావురాల నిష్కల్మష నైజాన్ని హృద్యంగా విశ్లేషించారు దాశరథి ‘పావురాళ్ళు’ అనే కవితలో. గగనంలో చుక్కలు /తోటలోని పూవులు / కలహించక కలిసుండును, / మనఘులేల కలహించుట ? అని ఆవేదనతో ప్రశ్నిస్తూ సూర్యునితో చంద్రుడు పొట్లాడడు. / ఒక మతస్థునితో ఇంకొక మతస్థుడేల పోట్లాడుట? తోటలోని పూవులు యుద్ధం చేస్తే తోటంతా రణరంగంగా మారుతుంది, / పరిమళాలు నశించిపోతాయి, / శవాల దుర్వాసన పెరుగుతుంది, /తోటవంటి లోకాన్ని ఎడారిలా చేయకండి అంటూ గొడవల్లేకుండా మనుషులందరూ కూడి ఉండాలంటూ సమాజానికి హితవు చెప్పారు ‘కవితా పుష్పకం’లో మాట పట్టింపులూ / మారణయుధాల రెట్టింపులూ / మానేయాలి మానవుడు అంటూ యుద్ధాల అబద్ధాలు గెలవ్వు / శాంతి సహనాల సత్యం తెలుస్తుంది / పైన పటారాలు నిలవ్వు / నిజమైన కవిత్వం నిలుస్తుంది అంటూ వాస్తవాలను వివరిస్తూ రాసిన కవిత అమావాస్య దీపాలు.
హత్యలు చేసి ఆనందించేవాడు / వీరాధివీరుడనిపించుకుంటున్నాడు / జ్ఞానుల్ని పిచ్చివాళ్ళనుకొని / తన్ని తగలగేస్తున్నారు మూకలు / అంటూ రక రకాల సంకుచిత్వాలతో / శకలాలైపోయిన జగంలో ఎలా బ్రతుకుతాడు మానవుడు? / అమాయకుడైన నా తమ్ముడు? / ద్వేష పిశాచం గెంతే రంగస్థలాన / ప్రేమ దేవత కాలు పెట్టడానికి వీల్లేదు / డబ్బుతో పెద్దవాడవుతున్న దానవుడు / త్యాగశీలిని చూసి సహించలేడు / అఖిల ప్రపంచ శాంతి కోరే వీరుడు / ఒక్క తుపాకీ దెబ్బకు కూలిపోతున్నాడు / ఎన్నాళ్ళిలా హింస గెలుస్తుంది? / ఎన్నాళ్ళిలా మంచి నశిస్తుంది అని అవేదనతో పాటు ఆగ్రహాంతో కూడా రాసిన కవిత ‘జిజ్ఞాస’. ఇట్లా పేద ప్రజల పక్షాన నిలిచి సమాజంలోని అసమానతలనూ అన్యాయాలనూ ప్రశ్నిస్తూ దాశరథి రాసిన కవిత్వమంతా ఆలోచింపజేసేదే. చైతన్యాన్ని కలిగించేదే. మార్గనిర్ధేశం చేసేదే. ‘జనం మనం మనం జనం / జనం లేక మనం లేము’ అన్ని కవిత్వమే కాదు దాశరథి రచనలన్నీ అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ సమాజాన్ని మేల్కొలిపేవే జీవితమే పోరాటంగా భావించి ఆశావాద దృక్పథంతో, ప్రపంచశాంతి గమ్యంగా, ప్రజాస్వామ్య సామ్యవాదం )క్ష్యంగా సాహిత్య సేద్యం గావించిన ఆ మహాకవి ఆశయాలను గౌరవిద్దాం. అనుసరిద్దాం.
(జూలై 22న ప్రజాకవి దాశరథి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా)
– డాక్టర్ కొమర్రాజు రామలక్ష్మి




