తిరుపతి వెటర్నరీ వర్సిటీ స్నాతకోత్సవంలో ఎపి గవర్నర్
తిరుపతి, జూలై 22 : సక్సెస్ అనేది యాక్సిడెంటల్ కాదని.. కష్టపడటం, పోటీతత్వం, త్యాగం, చేసే పనిని ప్రేమించటం, నేర్చుకోవటం ఇలా నిరంతర పక్రియ కావాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ విద్యార్థులకు సూచించారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయ 12వ స్నాతకోత్సవంలో కులపతి హోదాలో గవర్నర్ అబ్దుల్ నజీర్ పాల్గొని మాట్లాడారు. ‘మన భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. హరప్పా నాగరికత కాలం నుంచి భారతదేశంలో పశు వైద్యంపై సమగ్రమైన జ్ఞానం ఉండేది. దేశానికి సంపదను సృష్టించే శక్తి వెటర్నరీ వైద్యులైన చేతుల్లోనే ఉంది. పశు ఆధారిత ప్రకృతి వ్యవసాయం వల్ల ఆరోగ్యం, కాలుష్య రహిత ఆహారం సాధ్యం. ఆనాదిగా పశువుల నుంచి సేకరించే పాలు, నెయ్యి వంటి వాటితో చేసే పంచగవ్య వైద్యం విలువను ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది.
కలలు కనే ధైర్యం ఉండాలి. వ్యూహాత్మమైన సహనం అందుకు తోడు కావాలి. లేవండి.. లక్ష్యం సాధించే వరకు ఆగకండి అనే వివేకానందుడి మాటలను నిత్యం గుర్తు పెట్టుకోండి.‘ అని విద్యార్థులు గవర్నర్ హితబోధ చేశారు. ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ 12 వ స్నాతకోత్సవం లో కులపతి హోదాలో ముఖ్య అతిథిగా పాల్గొనుటకు శనివారం ఉదయం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ వారికి ఘన స్వాగతం లభించింది.జిల్లా కలెక్టర్ కే వెంకట రమణా రెడ్డి, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, వైస్ ఛాన్సలర్ ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ పద్మనాభ రెడ్డి గవర్నర్ గారికి ఘన స్వాగతం పలికారు. వీరితో పాటుగా లైజన్ ఆఫీసర్ భాస్కర్ నాయుడు, శ్రీకాళహస్తి ఆర్డీఓ రామారావు తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.




