సకల జనుల తెలంగాణా..

  • ప్రజలు మార్పు కోరుకుంటున్నారు..బీజేపీ జెండా ఎగరేస్తాం
  • రెండో..మూడో స్థానాల కోసం బీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌పోటీ పడాలి
  • ఇప్పటికే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ ‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌  

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 9 : ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి తాము అన్ని శక్తిసామర్థ్యాలను వినియోగిస్తామని, ప్రజల విశ్వాసాన్ని చూరగొని బీజేపీ జెండా ఎగరేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి అన్నారు. ప్రజలు కోరుకునే మార్పు..బీజేపీ ద్వారానే సాధ్యమని, కేసీఆర్‌ అవినీతి ప్రభుత్వం పోవాలని, తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం..షెడ్యూల్‌ ‌విడుదల చేయడాన్ని స్వాగతిస్తున్నామని, పూర్తిస్థాయిలో ఎన్నికలు సిద్ధంగా ఉన్నామని, తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కిషన్‌ ‌రెడ్డి అన్నారు.

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ ‌ప్రాంతానికి చెందిన దిల్లీ వసంత్‌, ‌కొత్తగూడెం జిల్లా ఇల్లందు ప్రాంతానికి చెందిన కొందరు నేతలు సోమవారం కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ ‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ ‌సమక్షంలో బీజేపీలో చేరారు. పార్టీలో చేరిన దిల్లీ వసంత్‌..‌కిషన్‌ ‌రెడ్డి, ఈటలకు హనుమఫలాన్ని అందించారు. ఈ సందర్భంగా ‘హనుమఫలమే..బీజేపీ విజయఫల’మని కిషన్‌ ‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్‌ ‌మీట్‌లో కిషన్‌ ‌రెడ్డి, ఈటల మాట్లాడారు. కిషన్‌ ‌రెడ్డి మాట్లాడుతూ..మోదీ నాయకత్వం పట్ల ప్రజల్లో ఎన్నో ఆశలున్నాయని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా 30, 40 రోజులు తమంతా కష్టపడి పనిచేస్తామన్నారు. 2, 3వ స్థానం కోసం మాత్రమే బీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌పోటీ పడాలన్నారు.

రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం వొస్తుందని ఆయన వ్యాఖానించారు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌, ‌బీఆర్‌ఎస్‌ ‌పార్టీల పాలనను ఇప్పటికే చూశారని, ఉద్యమకారుల ఆకాంక్షలను కాంగ్రెస్‌ ‌పార్టీ గౌరవించలేదని, 1200 మంది అమరుల ఆకాంక్షలను బీఆర్‌ఎస్‌ ‌పార్టీ గౌరవించదని విమర్శించారు. ఉద్యమద్రోహులందరూ మంత్రి పదవుల్లో, ప్రగతి భవన్లో ఉన్నారన్నారు. అందుకే ఆ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీజేపీపై ప్రజల్లో విశ్వాసం ఉందన్నారు. 50 రోజులే మిగిలుందని, డబ్బు, మద్యం ప్రభావం లేకుండా, అధికార దుర్వినియోగం లేకుండా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు. బీఆర్‌ఎస్‌..‌చేసిన పనులపై ఆధారపడి పనిచేయడం లేదని, డబ్బును, అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ.. గెలవాలనుకుంటుందన్నారు. అవినీతి, కుటుంబ పాలననుంచి..విముక్తి చేసి.. ప్రజాపాలన, సకల జనుల తెలంగాణ రావాల్సిన అవసరం ఉందని కిషన్‌ ‌రెడ్డి అన్నారు.

ఇది బీజేపీ ద్వారానే సాధ్యమని, ఎన్నికలకు అన్నిరకాలుగా సిద్ధంగా ఉన్నామని, ఇప్పటికే అన్ని కమిటీలను ప్రకటించామని, సమగ్రమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని కిషన్‌ ‌రెడ్డి తెలిపారు. మంగళవారం అమిత్‌ ‌షా ఆదిలాబాద్‌ ‌బహిరంగ సభకు రానున్నారని, సాయంత్రం ఇంపీరియల్‌ ‌గార్డెన్స్ ‌లో..మేధావులు, విద్యావంతులనుద్దేశించి ఆయన మాట్లాడతారని, బుధవారం మేడారంలో ధన్యవాద సభ పెట్టుకోబోతున్నామని ఆయన వెల్లడించారు. ములుగులో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు కానున్న సందర్భంగా.. పార్టీ గిరిజన మోర్చా ఆధ్వర్యంలో సమ్మక్క-సారక్కల ఆశీర్వాదం తీసుకునేందుకు మేడారం వెళ్తున్నామన్నారు.

ఎన్నికల్లో కేసీఅర్‌ ‌ది నీచమైన సంస్కృతి…: ఈటల
ఈ సందర్భంగా ఎంఎల్‌ఏ ఈటల రాజేందర్‌ ‌మాట్లాడుతూ.. దేశంలోనే అత్యధిక డబ్బు ఖర్చుపెట్టేటటువంటి నీచమైన సంస్కృతిని తెలంగాణకు అందించిన ఘనత కేసీఆర్‌ ‌దేనని విమర్శించారు. గతంలో తెలంగాణలో డబ్బు, మద్యం ప్రభావం తక్కువగా ఉండేదని, సమైక్యరాష్ట్రంగా ఉన్నప్పుడు ఏపీలో ఖర్చుపెట్టేదాంట్లో  నాలుగో వంతు ఖర్చుపెడితే ఇక్కడ గెలిచేవారన్నారు. వేల ఎకరాల భూమిని అక్రమంగా అమ్ముకుని.. ఆ డబ్బుతో ఎన్నికల్లో గెలుద్దామని కేసీఆర్‌ ‌నిర్ణయించుకున్నాడని, 15 కోట్లను ఇప్పటికే నియోజకవర్గాలకు చేర్చారని ఈటల ఆరోపించారు. ఇతర పార్టీల నాయకులను వెలగట్టి 5 లక్షలు, 10 లక్షలు ఇచ్చి కొంటున్న నేత కేసీఆర్‌ అని, గొప్ప సంప్రదాయాన్ని అందిస్తానన్న ముఖ్యమంత్రి..మద్యం తాగించే విషయంలో.. డబ్బులు ఎరవేయడంలో నెంబర్‌ ‌వన్‌గా నిలిచాడని ఈటల ఎద్దేవా చేశారు. నిక్కచ్చిగా పనిచేసే రాజకీయ కార్యకర్తలకు అవకాశం లేకుండా..డబ్బులున్నోళ్లే గెలిచేటట్లు వాతావరణం మార్చారన్నారు.

బీఆర్‌ఎస్‌ ‌పార్టీకి వోటేస్తా అంటేనే.. పింఛను, దళితబంధు, బీసీ బంధు వొస్తదని.. బెదిరిస్తున్నారని, ప్రజల మీద, ప్రజాస్వామ్యం మీద వీళ్లకు నమ్మకం లేదని విమర్శించారు. బీజేపీకి వోటేస్తే..మోటర్లకు మీటర్లు వొస్తయని..పింఛన్లు పోతయని..దుష్ప్రచారం చేస్తున్నారని ఈటల మండిపడ్డారు. బీజేపీ గెలిస్తేనే.. ఇవన్నీ టైమ్‌కు ప్రజల అకౌంట్లలోకి వొస్తాయని, ఒకటో తేదీకే జీతాలు వొస్తాయని అన్నారు. కేసీఆర్‌ ఇప్పటికే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని మండిపడ్డారు. అమరవీరులు కలలుగన్న బంగారు తెలంగాణను సాధించుకోవాలంటే.. బీజేపీ అధికారంలోకి వొస్తేనే సాధ్యమవుతుందన్నారు. తెలంగాణ చిన్నమ్మ..పార్లమెంటు వేదికగా.. మన యువతకు ధైర్యం చెప్పారని, రాజ్‌ ‌నాథ్‌ ‌సింగ్‌..‌తెలంగాణకు తమ మద్దతు ఉన్నదన్న తర్వాతనే..రాష్ట్ర ఏర్పాటు పక్రియ వేగవంతం అయిందని అన్నారు. బీజేపీని నిండు మనసుతో ఆశీర్వదించాలని ప్రజలను ఈటల కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *