సంక్షోభం ముగిసింది ..సందేహం వీడలేదు

కాంగ్రెస్‌ ‌పార్టీ జాతీయ అధ్యక్ష అభ్యర్థి ఎంపిక విషయంలో గడచిన రెండు మూడు రోజులుగా ఆ పార్టీలో తలెత్తిన సంక్షోభ పరిస్థితి గురువారం సాయంత్రానికి కాస్త చల్లబడింది. అంతమాత్రాన ఉపద్రవం తప్పిందనుకోవడానికి వీలులేదు. కాంగ్రెస్‌ అధ్యక్ష అభ్యర్థి ఎంపిక మొత్తం కాంగ్రెస్‌ ‌పార్టీనే కుదిపేస్తుందని ఎవరూ ఊహించలేకపోయారు. ఎప్పుడైతే రాహుల్‌ ‌గాంధీ తనకు ఆ పదవి అవసరం లేదని భీష్మించుకుని కూర్చున్నాడో అప్పటి నుండే పార్టీకి సరైన మార్గదర్శి కోసం అధిష్టానం వెతకటం ప్రారంభించింది. పార్టీ నాయకత్వాన్ని చేపట్టే విషయంలో మొదట్లో ఎవరూ ముందుకు రాలేదు. వివిధ రాష్ట్రాల్లోని పిసిసిలు కూడా రాహులే ఆ పదవికి అర్హుడని తీర్మానాలు చేసి పంపించాయి. అయినా రాహుల్‌ ‌ససేమిరా అనడంతో తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉన్న సోనియా గాంధీకి గాంధీ యేతర వ్యక్తులను ఆహ్వానించక తప్పలేదు. ఈ నేపథ్యంలోనే ప్రజాస్వామ్యయుతంగా ఎంపిక జరుపుకునేందుకు నోటిఫికేషన్‌ ‌విడుదల చేశారు. ఎవరైనా పోటీకి అర్హులైనప్పటికీ, పార్టీకి కాస్తా లాయల్‌గా ఉండే వ్యక్తి అయితే బాగుంటుందనుకున్నారు. మొదటి నుండి గాంధీ కుటుంబానికి సన్నిహితుడిగా ఉన్న రాజస్తాన్‌ ‌ముఖ్యమంత్రి అశోక్‌ ‌గెహ్లాత్‌ అయితే బాగుంటుందని పేరు కూడా ప్రకటించారు.

అక్కడే కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఎంత విశ్వాసపాత్రుడని అనుకున్నారో, ఆయనతోనే పార్టీలో పెద్ద సంక్షోభం ఏర్పడడంతో పార్టీ అధినేతలు తలలు పట్టుకోవాల్సి వొచ్చింది. పార్టీ అధ్యక్ష పదవి, ముఖ్యమంత్రి పదవి రెండింటిలో కొనసాగుతానని ఆయన భీష్మించుకుని కూర్చునడమే ఈ సంక్షోభానికి కారణమైంది. ఇందిరాగాంధీ, రాజీవ్‌, ‌పివి నర్సింహారావు, రాహుల్‌, ‌సోనియా లాంటి వారు, ఇంకా ముందుకు వెళితే నెహ్రూ, కామరాజ్‌నాడార్‌ ‌లాంటి హేమాహేమీలు అధ్యక్షులుగా కొనసాగారు. అంతటి ప్రాధాన్యత ఉన్న అధ్యక్ష స్థానానికి గెహ్లాత్‌ ‌రెండవ ప్రాథాన్యత నివ్వడంతోనే పెద్ద సమస్యగా మారింది. ఎట్టి పరిస్థితిలోనూ తాను ముఖ్యమంత్రి పదవి నుండి వైదలగేదిలేదని ఆయన ఖచ్చితంగా చెప్పడంతో అధిష్టానం కూడా ఏమీ చేయలేక పోయింది. ఒకరికి ఒకటి కన్నా ఎక్కువ పదవులు ఉండరాదని పార్టీ చేసుకున్న తీర్మానానికి కట్టుబడి ఉండాలన్న ఆదేశాలను ఆయన పాటించేందుకు అంగీకరించలేదు. ఒక వేళ తాను అధ్యక్షుడిగా ఎంపిక కాని పక్షంలో తాను రెండు పదవులనూ కోల్పోయిన వాడినవుతానన్న అనుమానాన్ని వ్యక్తం చేయడం, ఒకటి కాగా ముఖ్యమంత్రి పదవికి తాను రాజీనామా చేయాల్సి వొస్తే తాను సూచించిన వ్యక్తినే ఆ పదవిలో కూర్చుండబెట్టాలన్న షరతు విధించడం అధిష్టానానికి మింగుడు పడలేదు. ముఖ్యంగా సచిన్‌ ‌పైలెట్‌ను ముఖ్యమంత్రిగా చేయడాన్ని ఆయన ఏమాత్రం ఒప్పుకోకపోవడం అధిష్టానానికి తలనొప్పిగా తయారయింది. గతంలో సచిన్‌ ‌పైలెట్‌ ‌పార్టీలో తిరుగుబాటు చేశాడని గుర్తు చేస్తున్న గెహ్లాత్‌తోపాటు వందకు పైగా ఎంఎల్‌ఏలు పైలెట్‌ ‌వ్యతిరేకించడం చూస్తే, అధిష్టానం ఆయన మాటను కాదంటే తిరుగుబాటుకు సిద్ధం అన్న సంకేతాలు ఇచ్చాడు. దీంతో కాంగ్రెస్‌లో తీవ్ర సంక్షోభం చోటుచేసుకుంది. సోనియా చెప్పినా వినని పరిస్థితి ఏర్పడింది.

గురువారం దిల్లీ చేరుకున్న సిఎం అశోక్‌ ‌గెహ్లాత్‌ ‌గంటన్నర సేపు సోనియాగాంధీతో జరిగిన చర్చల్లో ఏమాత్రం లొంగకపోవడంతో అధ్యక్ష పదవికి మరో వ్యక్తి కోసం పార్టీ అన్వేషణ ప్రారంభించింది. సోనియాతో సమావేశానంతరం గెహ్లాత్‌ ‌మీడియాతో మాట్లాడుతూ రాజస్తాన్‌లో నెలకొన్న సంక్షాభానికి తానే పూర్తి బాధ్యత వహిస్తానని, తానే దాన్ని చక్కదిద్దుతానని చెప్పడంతోపాటు తాను అధ్యక్ష స్థానానికి పోటీచేయడం లేదని స్పష్టంగా ప్రకటించడంతో అధిష్టానానికి మరో వ్యక్తిని వెతుక్కునక తప్పలేదు. ఒకవైపు గెహ్లాత్‌తో చర్చలు జరుగుతున్న నేపథ్యంలోనే పార్టీ సీనియర్‌ ‌నేత దిగ్విజయ్‌ ‌సింగ్‌ను అందుకు సిద్ధం చేశారు. రాహుల్‌ ‌గాంధీ పాదయాత్రలో కొనసాగుతున్న ఆయన్ను దిల్లీకి రప్పించి నామినేషన్‌ ‌వ్యవహారాన్ని పూర్తి చేశారు. శుక్రవారం చివరి రోజున ఆయన నామినేషన్‌ ‌పత్రాలను దాఖలు చేయనున్నారు. అదే విధంగా మరో సీనియర్‌ ‌నేత శశిథరూర్‌ ‌తానూ అధ్యక్ష పదవి పోటీలో పాల్గొనబోతున్నట్లు ప్రకటించారు. ఆయన కూడా శుక్రవారం చివరి రోజున్నే నామినేషన్‌ ‌వేయనున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉంటే మరి కొందరు కూడా తామూ పోటీకి సిద్దమేనన్న సంకేతాలిస్తున్నారు. వారిలో ఎనిమిది పదులు దాటిన మల్లిఖార్జున ఖర్గే ఒకరు కాగా, ఏ.కె. అంటోని కూడా ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తున్నది. ఏ.కె. ఆంటోని తాజా పరిణామాల నేపథ్యంలో సోనియా గాంధీతో సుమారు రెండు గంటల పాటు చర్చించారు. ఒక వైపు ఆయనతో సుదీర్ఘ చర్చలు జరుపడం, దిగ్విజయ్‌సింగ్‌ను స్వయంగా రమ్మని కబురు పెట్టడం, శశిథరూర్‌ ఆసక్తి కనబరుస్తుండడంతో వీరిలో ఎవరికి సోనియా అభయహస్తం ఇస్తుందోనన్నది ఆసక్తిగా మారింది. శుక్రవారం మధ్యాహ్నం వరకు ఏదో ఒకటి తేలని పక్షంలో ఎన్నికలు తప్పవు. ఎన్నికలే జరిగితే ఎటువంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోనని కాంగ్రెస్‌ ‌వర్గాలు ఆందోళన వ్యక్తి చేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *