వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి.
వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 28: అర్హులైన ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించేందుకు ఏర్పాటు చేసిన ప్రజా పాలన గ్రామ సభలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి అన్నారు. గురువారం ధరూర్ మండలం, రాజాపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన గ్రామ సభ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ తో కలసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. గ్రామ సభలో ముందస్తుగా ప్రజాపాలన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి వినిపించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభయహస్తం కార్యక్రమంలో భాగంగా ఆరు గ్యారంటీలను అమలుపరచడానికి అర్హులైన ప్రజల నుండి ప్రజా పాలన కార్యక్రమం ద్వారా దరఖాస్తులను సేకరించడం జరుగుతుందన్నారు. డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు పని దినాలలో ప్రణాళిక ప్రకారం గ్రామాలలో, వార్డులలో ప్రజాపాలన కార్యక్రమాలు నిర్వహించి ఆరు గ్యారంటీలకు సంబందించి ప్రజల నుంచి వివిధ పథకాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తామని, ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ప్రజలు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. చివరి వరుసలో ఉన్న పేదవారికి సంక్షేమ పథకాలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం స్వయంగా మీ ఊరికి వచ్చిందన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని, ఇందు కోసం 57 టీమ్ లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కుటుంబం నుంచి ఒకరు వచ్చి దరఖాస్తు చేస్తే సరిపోతుందని, అన్ని పథకాలకు సంబంధించి ఒక దరఖాస్తు స్వీకరించడం జరుగుతుందని అయన అన్నారు. వివిధ కారణాల వల్ల గ్రామ సభలో దరఖాస్తు చేసుకొని వారు తిరిగి గ్రామ కార్యదర్శికి దరఖాస్తు సమర్పించుకోవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని అర్హులందరూ సదివినాగం చేసుకోవాలని తెలియజేశారు. దరఖాస్తు దారులకు తప్పనిసరిగా రశీదు అందించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ సూచించారు. అనంతరం ప్రజల నుండి కలెక్టర్ దరఖాస్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ ఆర్డీవో విజయ కుమారి, ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పిటిసి సుజాత, ఎంపీడీవో చెన్నారెడ్డి, తాసిల్దార్ భువనేశ్వర్, డి.ఎస్.పి నర్సింలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.





