షాద్ నగర్ నియోజకవర్గంలో  నామినేషన్ల పరిశీలన

షాద్ నగర్ ప్రజా తంత్ర నవంబర్ 13: కాంగ్రెస్ అభ్యర్థి వీర్లపల్లి శంకర్, ఏఐఎఫ్ బి పార్టీ అభ్యర్థి పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి నామినేషన్లపై ఉత్కంఠ*
షాద్ నగర్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల పరిశీలన పర్వం ముగిసింది.  షాద్ నగర్ అసెంబ్లీకి దరఖాస్తు చేసుకున్న 24 మంది నామినేషన్లను ఎన్నికల అధికారి డి. వెంకట మాధవ రావు తదితర అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా యుగ తులసి పార్టీ అభ్యర్థి పులిజాల నవీన్, ఎం రాము, భుయంకారి రవీందర్ వారి నామినేషన్లను తిరస్కరించినట్టు ఎన్నికల పరిశీలకులు చంద్రకాంత్ ఐఏఎస్ తెలిపారు. యుగ తులసి పార్టీకి చెందిన పులిజాల నవీన్ పదిమందితో బలపరచాల్సి ఉండగా కేవలం ఒక్కరు మాత్రమే బలపరిచినట్లు అధికారులు తెలిపారు. దీంతో అతని నామినేషన్ రిజెక్ట్ చేసినట్టు చెప్పారు. అదేవిధంగా బీఎస్పీ పార్టీ నుండి వేసిన రాము బిఫామ్ అందజేయక పోవడంతో ఆయన నామినేషన్ కూడా తిరస్కరించబడిందని తెలిపారు. అలాగే భుయంగారి రవీందర్ తన నామినేషన్ ఫారంలో కోర్టు కన్వెక్షన్ వేసినట్టు చెప్పడంతో నామినేషన్ ను తిరస్కరించారు.  ప్రతిరోజు అందుబాటులో ఉంటాం.. ఫిర్యాదులు స్వీకరిస్తాం ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉండి ఈ ఎన్నికల్లో తగిన ఫిర్యాదులు స్వీకరిస్తామని ఎన్నికల పరిశీలకులు చంద్రకాంత్ మీడియాకు తెలిపారు. ఈనెల 16వ తేదీ నుండి స్థానిక ఎన్నికల కార్యాలయంలో అందుబాటులో ఉంటామని చెప్పారు. ఉదయం 10:30 నుండి 11:30 వరకు ప్రజలు ఫిర్యాదులు తీసుకురావచ్చు అని చెప్పారు. ఈనెల 29 వరకు తాను ఆర్డీవో కార్యాలయంలో ప్రత్యేకంగా ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు చెప్పారు.అభ్యర్థులపై ఫిర్యాదుల పర్వం షాద్ నగర్ అసెంబ్లీలో పోటీ కోసం నామినేషన్ దాఖలు చేసిన ముగ్గురు అభ్యర్థులపై మిగతా అభ్యర్థులు ఇద్దరు ఫిర్యాదు చేశారు. యుగ తులసి పార్టీకి చెందిన అభ్యర్థి పులిజాల నవీన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ కు సంబంధించి కొన్ని కేసులు అధికారులకు చూపలేదని ఫిర్యాదు చేశారు. అదేవిధంగా కొన్ని ఆస్తుల విషయంలో కూడా డిక్లరేషన్ చేయలేదని ఫిర్యాదులొ పేర్కొన్నారు. అయితే అప్పటికే ఆలస్యం జరిగిపోయిందని నామినేషన్ స్వీకరించడం జరిగిందని అధికారులు చెప్పారు. వీలైతే పై అధికారులకు ఫిర్యాదు చేసుకోవాలని లేదా కోర్టుకు వెళ్లాలనీ సూచించినట్టు చెప్పారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అందె బాబయ్య ఏబి కాంప్లెక్స్ నిర్మాణ వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారని మొగిలిగిద్దకు చెందిన మరో స్వతంత్ర అభ్యర్థి మఠం శశిధర్ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఇదిలా ఉండగా ఆల్ ఇండియా బ్లాక్ ఫార్వర్డ్ అభ్యర్థి పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి నామినేషన్ విషయంలొ ఏ ఫారానికి సంబంధించి సరైన సమాచారం అధికారులకు అందలేదని ఆయన నామినేషన్ పత్రాన్ని కాసేపు ఆపేశారు. సింహం గుర్తుకు సంబంధించి సరైన పత్రాలు సమర్పించలేదన్న కారణాన్ని అధికారులు చూపారు. అయితే మెయిల్ ద్వారా ఆ సమాచారం వచ్చిందని అభ్యర్థి పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి చెప్పగా తమకు అందలేదని అధికారులు చెప్పారు. అయితే పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి సదరు విషయాన్ని మెయిల్ కు సంబంధించిన అంశాలను మళ్లీ అధికారులకు సమర్పించగా నామినేషన్ స్వీకరించారు. ఒకవేళ చివరి నిమిషంలో అతని నామినేషన్ స్వీకరించకపోతే సింహం గుర్తు రద్దయేది. అయితే ఇదంతా కొంతమంది కావాలని ఇలా చేశారని కాంగ్రెస్ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ మరో అభ్యర్థి పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డిలు అభిప్రాయం వ్యక్తం చేశారు. అధికార పార్టీకి చెందిన కార్యకర్తను నామినేషన్ వేయించి వారి ద్వారా తప్పుడు ఫిర్యాదులు చేయించారని ఈ సందర్భంగా పేర్కొనడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *