షర్మిలను నెత్తినెట్టుకుని ఊరేగాల్సిన ఖర్మ లేదు

  • రాజశేఖర్‌ ‌రెడ్డిని ఎత్తుకునే కాంగ్రెస్‌ ‌తప్పు చేసింది
  • మాజీ ఎంపి చింతామోహన్‌ ‌సంచలన వ్యాఖ్యలు

తిరుపతి, జూలై 1 :  కాంగ్రెస్‌ ‌పార్టీలోకి వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్‌ ‌షర్మిల  చేరుతారంటూ వస్తున్న వార్తపై తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్‌  ‌తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ అ‌గ్ర నేతలు ఎవరూ కూడా షర్మిల కోసం ఇడుపులపాయకు రావటం లేదని తెలిపారు. ఈ ప్రచారం అంతా ఒట్టి అబద్ధమని స్పష్టం చేశారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ ‌రాజశేఖర్‌ ‌రెడ్డిని నెత్తిన పెట్టుకొని కాంగ్రెస్‌ ‌తప్పు చేసిందని.. అదే పొరపాటు ఈసారి చేయదలచుకోవడం లేదన్నారు. కాసు బ్రహ్మానందం, కోట్ల విజయభాస్కర్‌ ‌రెడ్డి, మర్రి చెన్నారెడ్డికి కూడా కూతుర్లు ఉన్నారని.. వారు వచ్చి కాంగ్రెస్‌ ‌పార్టీలో చేరొచ్చన్నారు. వారెంతో షర్మిల కూడా అంతే అని చెప్పుకొచ్చారు. షర్మిలను నెత్తిన పెట్టుకొని నాయకత్వాన్ని అప్పగించడం జరగదన్నారు.

షర్మిల కోసం జరుగుతున్న ప్రచారం అంతా అబద్ధమే అని చింతామోహన్‌ ‌మరో సారి తేల్చిచెప్పారు. గత కొద్ది రోజులుగా వైఎ స్సార్టీపీని షర్మిల కాంగ్రెస్‌లో విలీనం చేయబోతున్నారనే వార్తలు హల్‌చల్‌ ‌చేస్తున్నా యి. ఈ క్రమంలో కాంగ్రెస్‌ ‌హైకమాండ్‌ ‌నుంచి షర్మిలకు పిలుపు వచ్చిందని.. ముఖ్య నేతలతో భేటీ అవుతారనే ప్రచారం కూడా జరిగింది. ఇప్పటికే వైఎస్‌ ‌షర్మిల కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో పలుమార్లు భేటీ అయ్యారు. ఢీకేతో భేటీ అయిన మరుసటి రోజే వైఎస్‌ఆర్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసే అంశంపై కాంగ్రెస్‌ అధిష్ఠానం, షర్మిల మధ్య చర్చలు జరిగినట్లుగా వార్తలు గుప్పుమన్నాయి.

ఏపీలో షర్మిల సేవలను వాడుకునేందుకు వీలుగా వైఎస్‌ఆర్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలంటూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రతిపాదించారని వార్తలొచ్చాయి. అయితే విలీనం వార్తలను షర్మిల ఖండించారు. తన చివరి శ్వాస వరకూ తెలంగాణ బిడ్డగా.. తెలం గాణ కోసం పోరాడుతూనే ఉంటానన్నారు. ఊహాజనిత కథలు కల్పిస్తూ తనకు, తెలంగాణ ప్రజలకు మధ్య అగాథాన్ని సృష్టించే విఫలయత్నాలు జరుగుతున్నాయని షర్మిల ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *