శ్రీ‌కృష్ణ జన్మస్థానంపై పిటిషన్‌

లక్నో, డిసెంబర్‌ 24 : ఉత్తరప్రదేశ్‌ ‌లోని మధురలో ఉన్న షాహీ ఈద్గా మసీదును సర్వే చేయాలంటూ స్థానిక కోర్టు ఆదేశాలిచ్చింది. జనవరి 2 తర్వాత సర్వేను చేపట్టి..  జనవరి 20లోగా నివేదికను సమర్పించాలని నిర్దేశించింది. హిందూ సేన అనే సంస్థకు చెందిన విష్ణు గుప్తా వేసిన న్యాయ వ్యాజాన్ని విచారించిన కోర్టు ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది. యూపీలోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదు సర్వేను నిర్వహించిన తరహాలోనే.. షాహీ ఈద్గా మసీదు సర్వేను కూడా చేయాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను జనవరి 20న నిర్వహిస్తామని తెలిపింది. మధురలో కత్రా కేశవ్‌ ‌దేవ్‌ ఆలయం పక్కనే ఉన్న షాహీ ఈద్గా మసీదుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ గతంలో ఎన్నో హిందూ సంస్థలు కోర్టులో కేసులు వేశాయి.
హిందూ సేన సంస్థ జాతీయ అధ్యక్షుడు విష్ణు గుప్తా వేసిన పిటిషన్‌ ‌కూడా ఆ కోవలోకే వస్తుంది. శ్రీ కృష్ణ పరమాత్ముడు జన్మించిన ప్రదేశంలో షాహీ ఈద్గా మసీదును నిర్మించారని పిటిషనర్‌ ‌విష్ణు గుప్తా ఆరోపించారు. మొగల్‌ ‌చక్రవర్తి ఔరంగజేబ్‌ ఆదేశాల మేరకు 1669 1670 సంవత్సరాల  మధ్యకాలంలో కత్రా కేశవ్‌ ‌దేవ్‌ ఆలయ పరిసరాల్లోని 13.37 ఎకరాల స్థలంలో షాహీ ఈద్గా మసీదును కట్టారని పిటిషన్‌ ‌లో పేర్కొన్నారు. ఈమేరకు అభియోగాలతో పిటిషనర్‌ ‌విష్ణు గుప్తా తరపు న్యాయవాది శైలేశ్‌ ‌దూబే ఈ ఏడాది డిసెంబరు 8న  కోర్టులో వాదనలు వినిపించారు. శ్రీ కృష్ణ జన్మస్థాన్‌ ‌సేవా సంఘ్‌, ‌షాహీ ఈద్గా మసీదు కమిటీ మధ్య 1968 సంవత్సరంలో కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ ‌చేశారు. ఆ అగ్రిమెంట్‌ అన్యాయమైందని పిటిషనర్‌ అభిప్రాయపడ్డారు. ఈ వాదనల నేపథ్యంలోనే మధురలోని ఓ కోర్టు తాజా ఆదేశాలను జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *