‌శ్రమదోపిడే లాభాలకు మూలమని తెలియజెప్పిన రావిశాస్త్రి ‘‘బల్లచెక్క’’ కథ

తెలుగు సాహిత్యంలో తన కథల ద్వారా పేదల జీవితాలను వస్తువుగా చేసుకొని అద్భుతమైన శైలిలో మార్క్సిజం చలనసూత్రాలను అర్దం చేసుకొని సమాజానికి గొప్ప సందేశమందించిన రచయిత రావిశాస్త్రి. ‘‘బల్లచెక్క’’ కథ ద్వారా మార్కస్ అం‌దించిన మిగులు విలువ సిద్దాంతమును ఇంత చిన్న కథలో ధ్వనింపజేసినతీరు బుద్దిజీవులను ఆలోచింపజేస్తుంది. కథ విషయానికొస్తే అయిదెకరాలపొలం, పదెకరాల మామిడితోటలో వచ్చిన ఫలసాయంతో నలభైయ్యేళ్ళపాటు చీకు చింతా లేకుండా కాలం గడిపిన కాంతయ్యకు పండులో పురుగు చేరిన చందాన లాభం అనే దాహాం ప్రవేశించింది. దమ్మిడి విలువ చేయడని భావించిన వీరిగాడు,సబ్బిగాడు లాంటి వాళ్ళు తాటి చెట్లలా పెరిగి మర్రిచెట్లలా విస్తరించిన విషయాలను తెలుసుకున్న కాంతయ్యకు కంటిమీద కునుకు లేకుండా చేసింది.తొందరగా ధనవంతుల జాబితాలో చేరడానికి కాంతయ్య కు లాభమనే దెయ్యం పట్టుకుంది. రూపాయికి కుంచెడు చొప్పున కొన్న ధాన్యాన్ని రెండు రూపాయలకు అమ్మి రూపాయి అదనంగా ఎందుకు పొందావు? అని ప్రశ్నించిన కూతురు సావిత్రికి కాంతయ్య వద్ద సరియైన సమాధానం లేకపోయింది.లాభంలోని మతలబు తెలియక సావిత్రి లో ఘర్షణ మొదలవుతుంది.

. చాలా రోజుల తర్వాత ఇంటికొచ్చిన మేనల్లుడు సత్యమూర్తిని కాంతయ్య కుశల ప్రశ్నలు వేస్తాడు. సత్యమూర్తి వడ్రంగి పనిలో నేర్పరి.మామ పెరట్లోని దేవదారు పెట్టెలు చూసి నాలుగు రూపాయలకు బేరమాడుతాడు. లాభం కోసం బతికే కాంతయ్య పన్నెండు రూపాయలు ఇస్తే కాని గిట్టుబాటు కాదంటాడు. మామకు తెలియకుండానే సత్యమూర్తి దేవదారు పెట్టెలను అందమైన బల్లచెక్కలుగా తయారుచేశాడు.తనకు తెలియకుండా చేసిన పనికి కాంతయ్య మొదట్లో చిరాకు పడ్డ వచ్చే లాభాన్ని తలచుకొని ఆనందపడ్డాడు.మామకు ప్రేమతో ప్రజెంటు చేయాలనీ భావించాడు సత్యమూర్తి. కాని సత్యమూర్తికి తెలియకుండానే కాంతయ్య బల్లలను యాభై రూపాయలకు అమ్మేశాడు.అందమైన బల్లలను అమ్మినందుకు పిల్లలంతా బాధపడ్డారు.సత్యమూర్తికి కాంతయ్య పది రూపాయలు కట్నంగా ఇవ్వబోయాడు. తన కూలీ చెక్కల ఖరీదు ,తయారీకి అయిన ఖర్చులు పోగా ముప్పై రెండు రూపాయల పావలా లాభం కొట్టేశావని,అది తన కష్టం ఫలితమని సత్యమూర్తి మామ కాంతయ్యను నిలదీశాడు.ఒకడు నష్టపోతేనే మరొకడు లాభం పొందుతాడని కాంతయ్య నిష్ఠూరంగా సెలవిచ్చాడు.

లాభార్జన దెయ్యంలా పట్టుకున్న తండ్రి వింత ప్రవర్తన చూసి సావిత్రికి రెండేళ్ళ క్రితం చూసిన ఇంగ్లీషు సినిమా గుర్తుకొచ్చింది. మంచివాళ్ళకు మందుపెట్టి చంపి ,ఆ శవాళ్ళో దుర్మార్గులు దూరి మళ్ళీ బతికి సమాజంలో నానా భీభత్సం సృష్టించిన సంఘటనలు సావిత్రి కళ్ళముందు కదలాడాయి. ఇప్పుడు సావిత్రి తన నాన్నను దుష్టుడు ప్రవేశించిన శవంగా భావించింది.మెల్లగా సత్యమూర్తి లో కూడా తన మామ కాంతయ్యలా ఉంటేనే మంచిదనే దుష్ట నువ్వు ముఖము నిండా అలముకున్నది.ఆ సమయంలో సావిత్రికి తన బావ సత్యమూర్తి పాము ప్రవేశించిన శవంలా కనబడ్డాడు.

ఇట్లా రావిశాస్త్రి గారు బల్లచెక్క కథలో లాభం పొందాలనే ఆలోచన మనిషినిలోని సున్నితత్వాన్ని నశింపజేసి స్వార్ధ పరునిగా ఎట్లా నిలబెటడుతుందో తెలియజేస్తుంది.శ్రామికుల శ్రమను దోపిడి చేయడం ద్వారా యజమానులు ఎలా లాభాలు గడించి కోట్లకు పడగలెత్తుతారో తెల్పిన మార్కస్ ‌మిగులు విలువ సిద్థాంతమును ఈ కథ ధ్వనింపజేస్తుంది. .కుటుంబ సంబంధాలలోని వైరుధ్యాలు,భిన్న ఆలోచనా విధానాలు, తద్వారా జరిగే మానసిక సంఘర్షణకు ప్రతీకగా ఈ కథలో సావిత్రి పాత్ర సృష్టించబడింది.కాలప్రభావంలో కొట్టుకుపోయే కాంతయ్య, సత్యమూర్తిలే కాకుండా , లాభనష్టాల కతీతంగా ఆలోచించే సావిత్రి లాంటి ఉదాత్త పాత్రలు మానవీయ సమాజానికి ఆశాకిరణంగా కనబడుతాయి. నేడు ప్రపంచీకరణ ప్రభావం వల్ల మానవ జీవన విధానంలో వచ్చే పెనుమార్పులను మనమంతా కళ్ళారా చూస్తున్నదే. చాలా ఏళ్ళ క్రితం వచ్చిన ఈ కథ ద్వారా రాబోయే మార్పులను ధ్వనింపజేసినతీరు రచయితలోని క్రాంత దృష్టి కి నిదర్శనంగా చెప్పవచ్చు. కాదేది కవిత కనర్హం అన్న శ్రీశ్రీ ఋక్కులలోని కవితా వస్తువులను శీర్షికలుగా తీసుకొని అద్భుత కథలుగా మలిచిన కథలలో ఒక మణిహారం బల్లచెక్క కథ అనుటలో ఎలాంటి సందేహం లేదు.

– గన్‌ ‌రెడ్డి ఆదిరెడ్డి, 9494789731

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *