- కెసిఆర్ పాలన అంతం కావాలి
- రూ.400 కోట్లు కేటాయిస్తానని మాట తప్పారు
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలు
సిరిసిల్ల ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18 : వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి కోసం ఏటా రూ.100 కోట్ల చొప్పున రూ.400 కోట్లు ఖర్చు చేస్తానని చెప్పి కెసిఆర్ మాట తప్పాడని, కేసీఆర్ మూర్ఖపు పాలన అంతం కావాలని కోరుకుంటున్నానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేములవాడ ఆలయం వద్ద భక్తుల కోసం బీజేపీ మెడికల్ సెల్ ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని సందర్శించారు.
అంతకుముందు మీడియాతో మాట్లాడుతూ….హిందూ బంధువులందరికీ శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. లక్షలాది మంది భక్తులు కనీస సౌకర్యాల్లేక భక్తులు అల్లాడుతున్నారని, నీళ్లు కూడా లేక పసిపిల్లలు ఏడుస్తున్నారని, శివ దీక్షలు తీసుకున్న వేలాది మంది భక్తులకు సౌకర్యాల్లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే దేవాలయంలో పెళ్లి చేసుకున్నా మర్చిపోనని చెప్పిన కేసీఆర్ ఏటా వంద కోట్ల చొప్పున రూ.400 కోట్లు ఖర్చు చేస్తానని మాట తప్పాడని అన్నారు.
ప్రసాదం స్కీమ్ కింద ప్రతిపాదనలు పంపితే కేంద్రం నుండి నిధులు తీసుకొస్తానని తాను ఎంపీగా గెలిచినప్పటి నుండి కోరుతున్నప్పటికిని వేములవాడతో పాటు కొండగట్టు, ధర్మపురి ఆలయాల అబివృద్ధి కోసం కూడా ప్రతిపాదనలు పంపాలని అడిగినప్పటికిని పట్టించుకోలేదని, దీనిని ఆ పరమ శివుడు అన్నీ గమనిస్తున్నాడని అన్నారు. మద్యం దందా, పత్తాల దందా కోసం వేల కోట్లు ఖర్చు చేస్తూ పేదల దేవుడు రాజన్న ఆలయంలో భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించకుండా కెసిఆర్ నిర్లక్ష్యం వహించడం సిగ్డుచేటని అన్నారు. మద్యం దందాలో తన బిడ్డ కవిత పాత్రపై నోరెందుకు మెదపడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు. ఆయన వెంట బిజెపి జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, వేములవాడ పట్టణ శాఖ అధ్యక్షుడు రేగుల సంతోష్‌బాబు తదితరులున్నారు.




