వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 31:జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్  కలెక్టర్ కార్యాలయంలో బ్యాంకర్లు వ్యవసాయశాఖ అధికారులతో సమావేశం నిర్వహించి రైతు రుణమాఫీ 2018 పై సమీక్షించారు. జిల్లాలో మొత్తం 1,75,719 రైతులకు గాను 1360.48 కోట్ల రూపాయల రుణమాఫీ వర్తించనుందని, 99 వేల 999 రూపాయల లోపు రుణం ఉన్న  79178 మంది రైతులకు ప్రభుత్వం ఇప్పటివరకు 409.22 కోట్ల రూపాయల మాఫీ డబ్బు ఖాతాలో వేయగా 70 వేల 770 మంది రైతుల ఖాతాలలో ఇప్పటివరకు 359.09  కోట్లు జమ అయినవని కొన్ని ఖాతాలు క్లోజ్ కావడం వలన  మిగతావి జమ కాలేదని బ్యాంకర్స్ వ్యవసాయశాఖ అధికారులు మాఫీ జాబితాని గ్రామాల వారీగా సరిచేసి డబ్బులు జమకాని రైతుల  రైతురుణ ఖాతాలోంచి సేవింగ్ ఖాతాలోకి డబ్బులు జమ చేయాలని అన్నారు. అలాగే 1 లక్ష రూపాయలు  ఆ పైన ఉన్న రైతు రుణాల మాఫీ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుందని అన్నారు. రైతు రుణమాఫీ  ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రతి బ్యాంకుకు ఒక నోడల్ అధికారిని నియమించాలని ఎల్డిఎం సత్యజిత్  కు సూచించారు. అలాగే వారం వారం  రైతు రుణమాఫీ పై సమీక్షిస్తానని తెలిపారు. అలాగే కొత్త రుణాలను పొందేందుకు లేదా రెన్యువల్ చేసుకునేందుకు ప్రతి ఒక్క రైతు పాస్పోర్ట్ సైజ్ ఫోటో, పట్టాదారు పాస్ బుక్ జిరాక్స్ , బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలతో వ్యవసాయ అధికారులు సూచించిన తేదీలలో సోమవారం నుండి గ్రామాల వారీగా బ్యాంక్ లకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని అన్నారు.అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) గరీమ అగ్రవాల్ స్ట్రీట్ వెండర్ రుణాల గురించి బ్యాంకర్లతో చర్చించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శివ ప్రసాద్, పిడి మెప్మా హనుమంతరెడ్డి, ఏపీజీవీబీ రీజినల్ మేనేజర్ ఆశాలత, యుబిఐ చీప్ మేనేజర్ ఆలం, ఇతర బ్యాంకు అధికారులు, వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *