వోట్‌ చోరీ పదంతో అవమానించొద్దు

  • ఆధారాలు ఉంటే అఫిడవిట్‌ దాఖలు చేయండి
  • రాహుల్‌ విమర్శలకు ఈసీ ఘాటైన జవాబు
    న్యూదిల్లీ, ఆగస్టు 14: దేశంలో అనేకచోట్ల వోటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సహా విపక్ష పార్టీలు చేస్తున్న ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి తీవ్రంగా స్పందించింది. ఈ క్రమంలో వోటు- చోరీ అనే పదాన్ని పదేపదే వినియోగించడాన్ని తప్పుపట్టిన ఈసీ తప్పుడు కథనాలకు కారణమయ్యే అసభ్యకర పదాలు ప్రచారం చేసే బదులు ఆధారాలు చూపించాలని పేర్కొంది. ఒక వ్యక్తి-ఒకే వోటుకు సంబంధించిన నిబంధన తొలి ఎన్నికలు జరిగిన 1951-52 నాటి నుంచి అమల్లో ఉందని తెలిపింది. ఏ ఎన్నికల్లోనైనా ఎవరైనా రెండుసార్లు వోటు వేసినట్లు ఆధారాలు ఉంటే లిఖితపూర్వక అఫిడవిట్‌ ఎన్నికల సంఘానికి ఇవ్వండి. ఎలాంటి ఆధారాలు లేకుండా దేశంలోని వోటర్లందర్నీ ‘చోర్‌’గా పిలవడం సరికాదని పేర్కొంది. ఇలాంటి చెడు పదబంధాలను ప్రచారం చేయడం కోట్లాదిమంది వోటర్లు, లక్షలాదిమంది ఎన్నికల సిబ్బందిపై దాడిగా ఈసీ అభివర్ణించింది. వోటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటున్న రాహుల్‌ గాంధీ కర్ణాటకలోని ఒక్క మహాదేవపుర నియోజకవర్గంలోనే లక్ష వోట్లు చోరీకి గురయ్యాయని ఇటీవల ఆరోపించారు. బెంగళూరు సెంట్రల్‌ లోక్‌సభ పరిధిలో ఉన్న ఈ అసెంబ్లీ స్థానంలో ఓడిపోవడం వల్లే కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి అక్కడ ఓటమి పాలయ్యారన్నారు. వీటిపై స్పందించిన ఎన్నికల సంఘం ఆ ఆరోపణలకు లిఖితపూర్వంగా డిక్లరేషన్‌ ఇవ్వాలని కోరిన విషయం తెలిసిందే. అయినప్పటికీ వోటరు జాబితాల్లో తప్పిదాలకు సంబంధించి వివిధ అంశాలను లేవనెత్తుతూ ఎన్నికల సంఘం పనితీరుపై కాంగ్రెస్‌ నేత విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఈ ఆరోపణలను బీజేపీ కూడా ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది. తాజాగా సోనియా పౌరసత్వానికి ముందే వోటరు జాబితాలో పేరు చోటుచేసుకోవడాన్ని బీజేపీ బయటపెట్టింది. ఓటమిపాలైన ప్రతిపక్షం నిరాశృానిసృహ్పలతో చేసే విమర్శలుగా ఈ ఆరోపణలను కొట్టిపారేసింది. ప్రజల తీర్పును కాంగ్రెస్‌ అవమానిస్తోందని రవిశంకర్‌ ప్రసాద్‌, దేవేంద్ర ఫడ్నవీస్‌ వంటి వారు ఆరోపించారు. అయినా బహుళ ప్రతిపక్ష పార్టీలు, పౌరసమాజం, స్వతంత్ర దర్యాప్తు సంస్థలనుంచి ఆందోళనలు పెరుగుతూనే ఉన్నాయి. మొదట ఈసీఐ యంత్రాలతో చదవగలిగే వోటర్ల జాబితాలను విడుదల చేయాలి. స్వతంత్ర పరిశీలనకు సిసిటివి ఫుటేజీలను భద్రపరచడం, పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వడం, వోటర్ల నమ్మకాన్ని పెంచేందుకు ట్యాంపర్‌ ప్రూఫ్‌ రికార్డులను అందించడం వంటి డిమాండ్లను ప్రతిపక్షాలు చేస్తున్నాయి. తటస్థ ఏజెన్సీల ద్వారా వోటర్ల జాబితా థర్డ్‌ పార్టీ ఆడిట్‌లో లోపాలు గుర్తించి సరిదిద్దాలని కూడా అంటున్నాయి. 1951 నాటి ప్రజాప్రాతినిధ్యం చట్టానికి చట్టపరమైన సంస్కరణలు కావాలని కోరుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *