మీ బానిసత్వాన్ని మీరే పోగొట్టుకోవాలి. పోరాడి రాజులు అవుతారో.. వోటును అమ్ముకుని బానిసలు అవుతారో నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది – డాక్టర్ బీఆర్ అంబేడ్కర్
ప్రపంచంలో ఏ పదవీ వోటరు బాధ్యతకంటే గొప్పది కాదు -ఫెలిక్స్ ఫ్రాంక్‌ఫర్టర్
ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. ప్రజల చేతిలోనే సార్వభౌమాధికారం వుంటుంది. అటువంటి ప్రజాస్వామ్య మనుగడకు నవ సమాజ నిర్మాణానికి వోటే పునాది. సమర్థ పాలనకు వోటు ఆయువు. తమను పాలించే పాలకులను నిర్ణయించడానికి, సమర్థులైన వారిని ఎన్నుకోవడానికి, అవినీతిపరులను గద్దె దింపడానికి వోటు సామాన్యుడి చేతిలో ఉన్న పాశుపతాస్త్రంలాంటిది. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారత ప్రజాస్వామ్యానికి మూలస్తంభం ఎన్నికల వ్యవస్థ. 1952లో సాథారణ ఎన్నికల సందర్భంగా 326 అధికరణ క్రింద భారత రాజ్యాంగం కింద సార్వత్రిక వయోజన వోటు హక్కును కల్పించింది. దీని ప్రకారం 21 ఏళ్లు పైబడిన పౌరులు అందరూ కుల, మత, లింగ, ప్రాంత, ధనిక, పేద, వివక్ష లేకుండా అక్షరాస్యులకు నిరక్షరాస్యులకు సార్వత్రిక వయోజన వోటు హక్కు కలిపించి ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేసే అవకాశాన్ని రాజ్యాంగం పౌరులందరికీ కల్పించింది. అయితే 1988 రాజ్యాంగ సవరణ ద్వారా అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ ప్రభుత్వం వోటు హక్కు వయో పరిమితిని 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించారు.18 ఏళ్లు నిండిన పౌరులందరూ ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో వోటుహక్కు వినియోగించుకోవడం ద్వారా తాము కోరుకున్న పాలనను ప్రజలే తెచ్చుకోవచ్చు. దీని ద్వారా మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉందనే విషయాన్ని వోటు చాటుతుంది. ఈ ప్రజాస్వామ్య క్రతువులో వోటర్లందరూ భాగస్వాములై వోటు హక్కును వినియోగిం చుకున్నప్పుడే రాజ్యాంగం పౌరులకు కల్పించిన వోటు హక్కుకు సార్ధకత చేకూరుతుంది.. మనం వేసే వోటే మన భవిష్యత్తు, రాబోయే తరాల మనుగడ నిర్ణయిస్తాయి. వోటు ఓ బ్రహ్మాస్త్రం అది ప్రభుత్వాల్నిమారుస్తుంది.
వోటు ఓ ఆగ్రహం. దుష్టనేతల్ని దునుమాడుతుంది. వోటు ఓ వ్యక్తీకరణ. మన ప్రాధాన్యతలు ఏమిటో మనకెలాంటి పాలన కావాలో పాలకులకు అర్థమయ్యేలా వోటు చెబుతుంది. అంతే కాదు వోటు అనేది ఓ బాధ్యత. ప్రజాస్వామ్యాన్ని ప్రేమించేవాళ్లంతా పాల్గొని తీరాల్సిన పవిత్ర ఉద్యమం. రాజ్యాంగంలో కల్పించిన వోటు హక్కును వినియోగించుకోవడం అనేది మన బాధ్యత. వోటు వేయటం అనేది మన ప్రాధమిక హక్కు. మన వోటును వినియోగించుకువడానికి కొద్దిపాటి సమయం కూడా కేటాయించకుండా పాలనలో రౌడీలు, గూండాలు, దుర్మార్గులు అందలం ఎక్కేస్తున్నారు అని విమర్శించే హక్కు మనకి లేదు. వోటు వేయకుండా నీతికి, న్యాయానికి, సమర్థతకి, ప్రతిభకి ఈ దేశంలో స్థానం లేదు అని ఘోషించే హక్కు మనకు లేదు. వోటు వేయకుండా రోడ్లు చండాలంగా ఉన్నాయి అని ఫిర్యాదు చేసే హక్కు మనకు లేదు. మన వేసే ఒక్క వోటుతో దేశం బాగుపడుతుందా అని ఉదాసీనత వ్యక్తం చేయడంలో అర్ధం లేదు. ఎందుకంటే ఒక్క వోటుతోనే వోటమి పాలయిన వాళ్ళు.. ఒక్క వోటు తేడాతోనే కూలిపోయిన ప్రభుత్వాలు ఎన్నో ఉన్నాయి. దివ్యాంగులు, వృద్ధులు సైతం పోలింగ్ రోజు క్యూ లో నిలబడి వోట్లు వేస్తూ ఉంటే యువత మాత్రం సెలవు దినమైన పోలింగ్ రోజున కాలక్షేపం చేయడం ఎంతవరకు సబబు. మనం వోటు వేయకపోతే దొంగ వోట్లు పడే అవకాశం కూడా లేకపోలేదు.అటువంటి అవకాశాన్ని మనం ఇవ్వకూడదు.ప్రభుత్వ ఏర్పాటులో మన అభిప్రాయం ప్రతిబింబించాలి అంటే ఖచ్చితంగా మన వోటును మనం ఉపయోగించాలి.. ముఖ్యంగా నేటి సమకాలీన సమాజంలో యువత వోటరుగా నమోదు చేసుకోవడానికి నమోదు చేసుకున్నా వోటు వేయడానికి ఆసక్తి కనబర్చడం లేదు. దేశ భవిత తమ చేతుల్లోనే ఉందన్న వాస్తవాన్ని యువత విస్మరిస్తున్నారు.
యువతరం సంఖ్య గణనీయంగా పెరుగుతున్నా ఆ స్థాయిలో వోటర్ల సంఖ్య పెరగకపోవడమే ఇందుకు నిదర్శనం. భారత్‌లో, ముఖ్యంగా పట్టణాల్లో విద్యావంతులైన మధ్యతరగతి ప్రజలు పోలింగ్‌లో పాల్గొనే విషయంలో ఉదాసీనత కనబరుస్తారు. వారు వోటు వేయకపోవడమే కాకుండా, వోటింగ్‌లో పాల్గొనలేదంటూ గర్వంగా చెప్పుకోవడమూ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వోటు విలువను వివరించి ప్రతి ఒక్కరూ వోటు హక్కు వినియోగించుకునేలా చైతన్యవంతం చేసే ఉద్దేశంతో భారత ఎన్నికల కమిషన్ ఆవిర్భవించిన రోజు జనవరి 25న కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏటా జాతీయ వోటరు దినోత్సవం నిర్వహిస్తోంది. 18 ఏళ్లు నిండిన దేశపౌరుడిని వోటరు జాబితాలో చేర్పించి గుర్తింపు కార్డు అందజేసి హక్కును కల్పిస్తోంది. అర్హులైన ప్రజలందరూ తమ వోటు హక్కును వినియోగించుకునేలా ప్రోత్సహించడమే లక్ష్యంగా 2011 సంవత్సరం నుండి భారత ప్రభుత్వం జాతీయ వోటర్ల దినోత్సవం నిర్వహిస్తున్నది. అర్హులైన ఓటర్లందరూ వోటుహక్కు వినియోగించుకున్నప్పుడే ప్రజాస్వామ్యానికి నిజమైన పండుగ రోజు. ఆ దిశగా ప్రజల్ని చైతన్య పరచడమే వోటర్ల దినోత్సవం ముఖ్య ఉద్దేశం. వోటంటే ఇంకు చుక్క కాదు. వోటంటే వ్యవస్థనే మార్చుకునే వెలుగు చుక్కని ప్రతీ వోటరు భావించి విలువైన వోటును వినియోగించుకున్న నాడు ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది.
-రుద్రరాజు శ్రీనివాసరాజు
9431239578





ఈ రోజుల్లో డొల్ల సాహిత్యం ఇలాగే అమ్ముడుపోతోంది నాగిని కందాల